Pawan Babu and ManoharPawan Babu and Manohar

జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ద్వారా అణగారిన వర్గాలకు (Suppressed Classes) రాజ్యాధికారం (Rajyadhikaram) దక్కేనా? జనసేన పార్టీ (Janasena Party) అధికారంలోకి రావడం (Change in Power) ద్వారా వ్యవస్థల్లో మార్పు సాధ్యమేనా? దశాబ్దాలుగా రెండు వర్గాలు లేదా కేవలం కొన్ని కుటుంబాలే అధికారాన్ని అనుభవిస్తున్నాయి. అధికారం దక్కని వర్గాలకు కూడా అధికారం దక్కాలి అంటే రాష్ట్రంలోకి తృతీయ ప్రత్యామ్నాయం రావాలి అనే ఆశల మధ్య పుట్టిన పార్టీ జనసేన. కానీ తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన జనసేన టీడీపీకి వశం అయిపోయింది. ఇలా అయితే జనసేన ఎదిగేదెప్పుడు? బడుగులకు అధికార ఫలాలు దక్కేదెప్పుడు అనే విమర్శలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.

ఏడు దశాబ్దాల పాలనలో వ్యవస్థలు చచ్చుబడ్డాయి. అధికార ఫలాలు కేవలం కొన్ని కులాలు లేదా కొన్ని కుటుంబాలే అనుభవిస్తున్నాయి. సమాజం అమ్మబోతే అడవి-కొనబోతే కొరివిలా తయారు అయ్యింది. సంక్షేమ పధకాల ముసుగులో అధికారంలో ఉన్నవారు సమాజాన్ని దోచుకొని తింటున్నారు. మరొక పక్కన పాలకుల అనినీతి బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. తృతీయ ప్రత్యామ్నాయం ద్వారా పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీపరుడు సీఎం అవ్వాలి. అప్పుడే చచ్చుబడ్డ వ్యవస్థల్లో సమూల మార్పులు వస్తాయి. అని ఆశిస్తున్న వారి నమ్మకం కూడా రోజు రోజుకీ సన్నగిల్లుతున్నట్లు కనిపిస్తున్నది. తృతీయ ప్రత్యామ్న్యాయంగా ఎదుగుతాడు అనుకొన్న సేనాని టీడీపీకి మద్దతునిచ్చే నాయకుడిగా ఎందుకు మిగిలిపోతున్నాడు అని న్యూట్రల్ ఓటర్లు కూడా మదన పడుతున్నారు.

జనసైనికుల కష్టాలను మాత్రం పట్టించుకోవడం..

మా దేవుడు మోడీని పీఎంని చేసాడు. బాబుని సీఎం చేసాడు. తద్వారా రాక్షస పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడాడు. ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ పేరు నేడు దేశంలో అన్నిచోట్లా మారుమోగుతున్నది. మా భోళాశంకరుడు ఆగర్భ శత్రువులకు కూడా వరాలిస్తున్నాడు. అడిగిన వారిని, అడగని వారిని కూడా ఆపదలో ఆదుకొంటున్నాడు. కానీ పార్టీ కోసం, సేనాని గెలుపు కోసం అలుపెరుగక శ్రమించిన మా నాయకుల, జనసైనికుల కష్టాలను మాత్రం సేనాని పట్టించుకోవడం లేదు. స్థానిక టీడీపీ నాయకుల కాళ్ళకింద మా ఆత్మాభిమానం నలిగిపోతున్నది. చివరకు మా దేవుడు మాకు ధర్మ దర్శనం కూడా ఇవ్వడం లేదు అంటూ జనసేన పార్టీ శ్రేణులు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. రాక్షసులకు కూడా సేనాని వరాలిస్తున్నాడు. మా దేవుడు తనని మోసం చేసే పూజారులను కూడా కౌగిలించుకొంటున్నాడు. కానీ సేనాని మా భక్తులను ఎందుకు మరిచిపోతున్నాడు అనే ఆవేదనతో పార్టీ శ్రేణులు రగిలి పోతున్నాయి. చివరకు కరడు గట్టిన జనసైనికులు, నాయకులు కూడా మా దేవుడు సేనాని మాకు ఎప్పుడు దర్శనం ఇస్తాడు అని ప్రశ్నిస్తున్నారు.

ఇంతకీ తప్పు సేనానిదా లేక సేనాని విమర్శకులదా?

బడుగులకు అధికార ఫలాలను అందిస్తాను. దానికి అనుగుణమైన వ్యూహాలకు నాకు వదిలేయండి అన్న జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహాలది తప్పా? లేక జనసేన పార్టీపై పెరుగుతున్న అసంతృప్తి వాదులది, విమర్శకులది తప్పా? అనేదే నేటి చర్చనీయాంశం.

పవన్ కళ్యాణ్ నిజాయితీపైగాని, సేనానికి సమాజం పట్ల ఉన్న అంకితభావంపై గాని, లేదా సేనాని శక్తి సామర్ధ్యాలపై గాని ఎవ్వరికీ, ఏవర్గానికి కూడా సందేహం లేదు. జనసేనాని వల్లనే తృతీయ ప్రత్యామ్న్యాయం నిలబడుతుంది. పవన్ కళ్యాణ్ వల్లనే మా బడుగులకు అధికార ఫలాలు దక్కుతాయి అని విమర్శకులు కూడా సేనానిని మెచ్చుకొంటున్నారు. అయితే పార్టీ పటిష్టత విషయంలో పవన్ కళ్యాణ్ నాంచివేత ధోరణిపైన… పవన్ కళ్యాణ్ కోటరీ స్వార్థ వ్యవహార శైలిపైనే అందరికీ అసంతృప్తి ఉంది అనేది అక్షర సత్యం.

నిజంగానే పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నారా?

జనసేనాని పవన్ కల్యాణ్ పొత్తుల పేరుతో తప్పు చేస్తున్నాడు. కాపుల చిరకాల ప్రత్యర్థి బాబుతో సేనాని స్నేహం చేయడం ఏమిటి? అసలు ఒక పాలక వర్గానికి చెందిన వ్యక్తిని మా దేవుడు ఎందుకు పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు? ఇంతకీ పవన్ కల్యాణ్ సీఎం ఎప్పుడు అవుతాడు అంటూ కొంత మంది అవేశపరులు మదన పడుతున్నారు. ఆ రెండు పాలక వర్గాల కుటిల రాజకీయ వ్యూహాలపై అవగాహన లేని వాళ్ళకి వివరణ ఇవ్వడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాను.

1. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీచేస్తే కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామజిక వర్గానికి చెందిన పార్టీలు ఒక్కటి అయ్యి తృతీయ ప్రత్యామ్నాయాన్ని ఓడిస్తున్నారు. 1956 నుండీ ఇదే జరుగుతున్నది. ఈ సమస్యను అధికమించడానికే ఒక పాలక వర్గంతో పొత్తుల వ్యూహంతో జనసేనాని వెళుతున్నాడు.

2. జనసేన పార్టీ సమస్త వర్గాల కోసం పెట్టిందే తప్ప కేవలం ఏ ఒక్క కులం కోసం పెట్టింది కాదు. ఒక పార్టీ విజయానికి కాపులుతో పాటు తతిమ్మా కులాల మద్దతు కూడా అవసరం. కులం యొక్క వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే కులసంఘాలు తీర్చాలి గాని కులం యొక్క సమస్యలను రాజకీయ పార్టీ అయిన జనసేనకు ఆపాదించడం సరి కాదు.

3. రాజ్యాధికారం మాకు రావాలి దానికోసమే పవన్ స్పష్టత నివ్వాలి అనే వర్గాల ఆవేశం, ఆవేదనలో అర్థం ఉంది. కానీ తక్షణమే రాజ్యాధికారం తెచ్చేయడానికి, రాజ్యాధికారం అనేది చంటి కుర్రోడు చేతిలో ఉన్న చాక్లెట్ కాదు. రాజ్యాధికారం అనేది రెండు బలమైన సామాజిక వర్గాల చేతిలో ఉన్న కుర్చీ. వ్యూహాత్మకంగా మాత్రమే దాన్ని దక్కించుకోగలం తప్ప కులపిచ్చితోనో లేదా సినిమా పిచ్చితోనే కాదు అనేది పవన్ విమర్శకులు అర్ధం చేసికోవాలి.

4. కులవివక్షత పునాదులపై అంబేద్కర్ పెట్టిన పార్టీని కూడా ప్రజలు ఓడించారు. మిగిలిన వర్గాలతో పాటు దళితులు కూడా అంబేడ్కర్ పార్టీకి నాడు ఓట్లు వేయలేదు. నాటి నుండే నేటి వరకు కూడా ఒక కులం పునాదులపై ఏ పార్టీ గెలిచి అధికారం దక్కించు కోలేదు అనేది తెలిసికోవాలి.

5. సోషల్ జస్టిస్ (సామాజిక న్యాయం) పేరుతో రాజకీయాల్లోకి వచ్చిన రామ్ మనోహర్ లోహియా పార్టీ కూడా ఘోరంగా విఫలం అయ్యింది. నిన్నటి మన చిరంజీవి ప్రజారాజ్యం కూడా సామజిక న్యాయ పునాదులపై కూలిపోయిన పార్టీనే. ఆవేశం వల్లలో లేదా కుల వైరం వల్లనో అధికారం రాదు. అందరి మన్నలను పొందడం వల్లనే జనసేన పార్టీకి అధికారం సిద్ధిస్తుంది. అందుకే సేనాని వ్యూహంతో వెళుతున్నాడు అనే వాస్తవాన్ని విమర్శకులు తెలిసికోవాలి.

6. అగ్ర వర్ణాల ఆధిపత్యం, హిందూ మత వ్యతిరేకతతో రాజకీయాల్లోకి వచ్చిన పెరియార్ కూడా అన్ని వర్గాలను ఏకతాటిపై తేవడంలో విఫలం అయ్యారు. అసలు పెరియార్, అంబేద్కర్, రామ్ మనోహర్ లోహియా లాంటి వారు నాడు కలిసి ఒక శక్తిగా పోరాడి ఉండి ఉంటే దేశ రాజకీయాలు నేడు వేరే విధంగా ఉండేవి. పొత్తులు లేకుండా ఉంటే వైస్సార్ సీఎం అయి ఉండేవాడా? పొత్తులు లేకుండా ఉంటే కేసీఆర్ పార్టీ ఉండి ఉండేదా? లేక తెలంగాణాని సాధించి ఉండేవాడా? అసలు పొత్తులు లేకపోతే తెలుగుదేశం అనే పార్టీనే నేటికీ ఉండి ఉండేదా? ప్రస్తుత రాజకీయాల్లో పొత్తులు అనివార్యం అనే నిజాన్ని కుల విమర్శకులు తెలిసికోవాలి.

7. బహుజన సమాజం పేరుతో అధికారంలోకి వచ్చిన బీఎస్పీ మాయావతి వ్యూహాత్మక తప్పిదాల వల్ల అగ్రవర్ణాలు కుట్రలకు బలి అయ్యింది. ఆ తప్పిదాల వల్లనే నేడు బహుజనుల పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. తొందరపడితే సేన కూడా నామరూపాలు లేకుండా పోతుంది. రాజకీయాల్లో వ్యూహాలు ఉండాలి గాని కుల వ్యతిరేకత మంచిది కాదు. అలానే కుల ప్రేమ కూడా శ్రేయస్కరం కాదు.

8. డబ్బై సంవత్సరాల తెలుగు రాష్ట్రాల చరిత్రలో కమ్మ రెడ్డి పార్టీలు తప్ప మరో పార్టీ నేటికీ బతికి బట్టకట్టలేదు. ఒక్క జనసేన మాత్రమే 11 సంవత్సరాలుగా కొనసాగుతూ, 100 % స్ట్రైక్ రేటుతో విజయం సాధించి, ఎన్నికల కమీషన్ వద్ద గుర్తింపుని కూడా పొందింది.

9. అందుకే ఒక కులం పునాదుల మీద జనసేననే కాదు ఏ పార్టీ కూడా బతికి బట్టకట్టలేదు అని తెలుసుకోవాలి. రాజకీయ పార్టీ అనేది అందరినీ కలుపుకోవాలి. అందరి మన్నలు పొందాలి. అందు కోసం సేనాని వ్యూహాలు సరిఅయినవే అని గమనించాలి. వర్గాల ఆవేశాన్ని లేదా అభిమానుల తొందరపాటుని, న్యూట్రల్ ఓటరుల ఆకాంక్షను సేనాని అర్ధం చేసికోగలడు. సేనాని అధికారాన్ని సాధించి తీరుతాడు. కానీ దానికి ఖచ్చితంగా సమయం పడుతుంది అనేది విమర్శకులు అర్ధం చేసికోవాలి.

ముల్లును ముల్లుతోనే తీయాలి?

10. ఆంధ్రప్రదేశ్ లో అన్ని రంగాలు కూడా ఆ రెండు వర్గాల ఆధిపత్యంలో ఉన్నాయి. ఆ రెండు పాలక వర్గాలతో పనులు అవ్వాలి అంటే ఆ వర్గాల వాళ్ళతోనే చేయించు కోవాలి. ముల్లును ముల్లుతోనే తీయాలి. అంతే గాని మనకి కమ్మ, లేదా రెడ్డి లేదా మరో వర్గం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళను పక్కన పెట్టుకోరాదు అనడం అవివేకం. అజ్ఞానం అవుతుంది. రాజకీయ పార్టీ అన్నాక అన్ని కులాల సమ్మిళితం అనే వాస్తవాన్ని సేనాని విమర్శకులు అర్ధం చేసికోవాలి.

11. 1953 నుండీ రెడ్డి సామజిక వర్గమే అధికారంలో ఉంది. అయినప్పటికీ వైస్సార్ సీఎం అవ్వడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టింది. కమ్మ సామజిక వర్గానికి సీఎం అవ్వడానికి 30 సంవత్సరాలు పట్టింది. 1983 నుండీ కూడా కమ్మలు అధికారంలో ఉన్నారు. అయినప్పటికీ బాబుకి సీఎం అవ్వడానికి సుమారు 20 సంవత్సరాలుపైనే పట్టింది. జగన్ గాని, బాబు గానీ వైస్సార్ గానీ రాత్రికి రాత్రే సీఎం అయిపోలేదు. అలాంటిది తాడు బొంగరం లేని కాపులు తదితర వర్గాలు రాత్రికి రాత్రే సీఎం అవ్వాలి అని అనడం అవివేకం అవుతుంది అని విమర్శకులు తెలిసికోవాలి.

12. బడుగుల బలహీనత, పూర్వీకుల చేసిన ఉద్యమ పాపాలు, ప్రజారాజ్యం విలీనం, చీలికలు పీలికలుగా మిగిలిన అణగారిన వర్గాలు లాంటి లోపాలు జనసేన పార్టీని వెంటాడుతున్నాయి. ఇప్పటివరకు జనసేన పార్టీని విస్తరణ చేయలేక పోవడానికి ఈ లోపాలు కూడా ప్రధాన కారణం అనే కఠోర నిజాన్ని మనం అంతా అంగీకరించి తీరాలి.

13. అయితే నేటి నుండి అయినా జనసేన పార్టీని విస్తరింప చేయవలసిన అవసరం జనసేనానికి ఉంది. దానికి అనుగుణమైన అన్ని చర్యలు సేనాని తీసికోకపోతే మాత్రం జనసేన పార్టీకి మనుగడ సాధ్యం కాకపోవచ్చు.

14. కులపిచ్చితోనే లేదా మా సేనాని సీఎం అవ్వాలి అనే ఆవేశంతోనే లేదా రాత్రికి రాత్రే మార్పు వచ్చేయాలి అనే తొందరపాటుతోనో సేనాని పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం మంచిది కాదు. సేనాని పవన్ కల్యాణ్ ని సంపూర్ణంగా నమ్మి అనుసరించినప్పుడే సేనాని ద్వారా బడుగులు అధికారాన్ని సాధించ గలరు. అప్పుడే మార్పు సిద్ధిస్తుంది.

పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక తప్పిదాల్లో కోటరీ పాత్ర ఏమిటి?

1. ఓటమిలోకూడా సేనాని వెనుక ఉన్నాం. 2024 లో సేన గెలుపుకు శక్తి వంచన లేకుండా సహకరించిన మా నాయకులకు, పార్టీ కార్యకర్తలకు కూడా సేనాని అందుబాటులో ఉండడం లేదు అనే ఆవేదన నాయకుల్లో కార్యకర్తల్లో ప్రబలంగా ఉంది.

2. సీఎం అవ్వాల్సిన పవన్ కల్యాణ్ సీఎం పదవిని కూడా టిడిపికి త్యాగం చేస్తే, టిడిపి మాత్రం జనసేన నాయకులకు, కార్యకర్తలకు అస్సలు విలువ నివ్వడం లేదు.

3. పవన్ కల్యాణ్ తన చుట్టూ ఉన్న ఇద్దరు, ముగ్గురిని నమ్మి పార్టీ బాధ్యతలును అప్పగించారు. అయితే వారు పార్టీని, నాయకులను, కార్యకర్తలను కూడా అస్సలు పట్టించు కోవడం లేదు. పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న వారిలో ఎక్కువమందికి జనసేన పార్టీ శ్రేయస్సు లేదా జనసేనాని శ్రేయస్సు ముఖ్యం కాదు టీడీపీ శ్రేయస్సునే ముఖ్యం అనే అనుమానాలు కూడా సేన నాయకుల్లో, కార్యకర్తల్లో ఉన్నాయి.

4. పీఆర్పీతో కలిపి 15 సంవత్సరాలుగా మెగా ఫ్యామిలీ లేదా కళ్యాణ్ గారి వెంట ఉండి పని చేస్తుంటే, మమ్ములను కనీసం పార్టీ ఆఫీస్ లోనికి కూడా రానివ్వడం లేదు అని కరడు కట్టిన కార్యకర్తలు, నాయకులూ కూడా లోలోన కుమిలిపోతున్నారు. ఇంచార్జిలను కూడా పార్టీ ఆఫీస్ లోనికి రానివ్వక పోవడమేమిటి అని రగిలిపోతున్నారు.

5. ఓడిన వైసీపీ, గెలిచిన టిడిపిలు తమ తమపార్టీలని బలపెట్టుకుంటుంటే, జనసేన మాత్రం పార్టీ అభివృధి గురించి అస్సలు పట్టించు కోవడం లేదు అని మెజారిటీ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. పార్టీ పటిష్ఠతకు అవసరమైన చర్యలు తీసికొనంత వరకు ఇటువంటి ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఇది పార్టీకి మంచిది కాదు.

6. జనసేన మద్దతు దారుల్లో మెజారిటీ భాగం బాబుని, లోకేష్ ను, జగన్ ను మెచ్చు కోవడం ఒప్పుకోరు. అటువండిది కళ్యాణ్ గారు పదే పదే బాబుని టీడీపీని మెచ్చుకోవడం జనాలు జీర్ణించు కోలేక పోతున్నారు. పొత్తులో ఉన్నప్పుడు మెచ్చుకోక తప్పదు అనే అవగాహన నాయకుల్లో, కార్యకర్తల్లో వచ్చే విధంగా పార్టీ చర్యలు తీసికోవాలి.

7. పార్టీ కోసం పని చేస్తున్న వారిని దూరం పెడుతున్నారు. పార్టీని అణచివేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవడం మానేసి, బహిరంగ సమావేశాల్లో కూడా అధినేత కౌగిలించు కొంటున్నారు అని నాయకులూ, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో ఉన్న ఇటువంటి అభిప్రాయాన్ని ఆదిలోనే పరిష్కరించకపోతే అది పార్టీకి శ్రేయస్కరం కాదు.

ఇలా అయితే పార్టీ ఎలా వృద్ధి చెందుతుంది?

7. వైసిపి, టీడీపీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ నాయకులను అనుమతిస్తుంది. కానీ పవన్ కల్యాణ్ గారు మాత్రం ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీని అనుమతి నివ్వడం లేదు ఇలా అయితే పార్టీ ఎలా వృద్ధి చెందుతుంది. మేము ఇలా ప్రజల్లోకి వెళతాం అని అంటున్నారు.

8. ప్రభుత్వ పథకాల్లో, కాంట్రాక్టుల్లో, పదవుల్లో మెజారిటీ భాగం టీడీపీకే దక్కుతున్నాయి. చివరకు కానిస్టేబుల్ కూడా జనసేన నాయకుల, కార్యకర్తల మాట వినడం లేదు అనే బాధతో నాయకులూ కార్యకర్తలు కుశించికు పోతున్నారు.

9. కింది స్థాయిలో చాలా మంది జనసేన నాయకులూ కూడా టిడిపికి వశం అయ్యి సేన కార్యకర్తలను పట్టించు కోవడం లేదు. పార్టీకి చెబుదామంటే పార్టీలో పట్టించుకునే నాధుడే లేడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటికి సున్నిత పరిస్కారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉంది.

10. పంచాయతీ, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయినను జనసేనపార్టీ విధానం ఏమిటో ఇప్పటికీ తెలియడంలేదు అనే కన్ఫ్యూషన్ పార్టీలో ప్రబలంగా ఉంది. దీన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మొత్తం మీద జనసేన నాయకులూ, కార్యకర్తల్లో అసమ్మతి, ఆవేదన, నైరాశ్యం తీవ్రంగా ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విచారణ జరిపి తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసికోవాలి. అలా తీసికోకపోతే కరడుగడ్డిన కార్యకర్తలను, నాయకులను సేనాని కోల్పోవాల్సి వస్తుంది. కరడుగట్టిన కార్యకర్తలను కోల్పోతే అప్పుడు అద్దెకు తెచ్చికొన్న నాయకులూ, కార్యకర్తలతో పార్టీని విజయాపథం వైపు నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ విషయాలు పవనేశ్వరుడికి తెలియనిది కాదు అనుకొంటాను.

సేనానికి ,సేనాని విమర్శకులకు అక్షర సందేశం!

జనసేన పార్టీని అధికార సాధన దిశగా తీసికేల్లడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ తన సర్వ శక్తులను ఒడ్డి పార్టీని నడిపిస్తున్నారు. అందుకు గాను మనం అంతా అధినాయకుడిని అనుమానించ కుండా, అండగా నిలబడాలి. జనసేనకు మద్దతుగా ఉంటూనే వైసీపీ లేదా టీడీపీ చేస్తున్న కుట్రలను తిప్పుకోడుతూ ఉండాలి.

అలానే పార్టీ పెట్టి 12 సంవత్సరాలు కావస్తోంది. ఇప్పటికైనా జనపార్టీని బలోపేతం చేస్తాను. పార్టీని, నాయకులను జనసేన కార్యకర్తలను అణచివేస్తున్న నాయకులను/పెద్దలను అవసరమైతే పక్కన పెడతాను. పార్టీలో ఉన్న లోపాలను సరిద్దుతాను. జనసేన నాయకుల్లో, కార్యకర్తల్లో, సేన మద్దతు దారుల్లో ఉన్న అనుమానాలను తొలగించడానికి అవసరమైన అన్ని చర్యలను తక్షణమే తీసికొంటాను అనే భరోసాను జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వాలి.

జనసేన మద్దతు దారుల్లో, జనసేన నాయకుల్లో, కార్యకర్తల్లో, సేనాని చుట్టూ ఉన్న కోటరీ వైఖిరిలో మార్పు రావాలి. అలానే జనసేనాని పవన్ కళ్యాణ్ చేతల్లో కూడా సంపూర్ణ మార్పు వచ్చినప్పుడే ఆ రెండు పార్టీలను ఎదుర్కొని జనసేన సంపూర్ణ విజయం సాధిస్తుంది. ఆరోజునే జనసేన ద్వారా బడుగులకు అధికార సాధన సాధ్యం అవుతుంది. లేకపోతే జనసేనాని ద్వారా బడుగులకు అధికారం ఎండమావిగానే మిగిలిపోతుంది.

ఇది సగటు శ్రేయోభిలాషి, లేదా జనసేన నాయకుడి లేదా కార్యకర్త నుండి సేకరించిన గ్రౌండ్ రిపోర్టునే గాని అక్షర సత్యం వ్యక్తిగత ఆవేదన కాదు అని గ్రహించండి.

అంజనీ పుత్రా! మీ నిజాయితీపై, మీ శక్తి సామర్ధ్యాలపై అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది. పొత్తుల్లో ఉంటూనే జనసేన పార్టీ బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు తీసికొంటూ మీరు ముందకు వెళ్ళాలి. మనం బలపడినప్పుడే అధికారంలో సంపూర్ణ మార్పుని సాధించి జనసేన చరిత్రను సృష్టిస్తుంది”. లేకపోతే జనసేన ఒక విఫల పార్టీగా చరిత్రలో మిగిలి “పోతుందేమో” ఆలోచించండి. ( It’s from Akshara Satyam)

ఓ నాన్నారు ఆవేదనపై అక్షర సందేశం

Spread the love