అంబేద్కర్ జయంతి సందర్భంగా శతకోటి పాదాభివందనలతో…
జయంతికి, వర్ధంతికి తేడా కూడా తెలియని జగమెరిగిన బాబులకు (పాలక బాబులకు), ఇత్తరీయం కుడి వైపు వేసికోవాలా లేక ఎడమ వైపు వేసికోవాలో కూడా తెలియని వర్తమాన అభినవ దుర్యోధనాదులకు, పాలకుల పెరట్లో సేదతీరే ప్రజాప్రతినిధులకు/మంత్రులకు, అంబెడ్కర్ అంటే ఎవరే అనే మా అణగారిన వర్గాల ప్రజాప్రతినిధులకు
ఏప్రిల్ 14 అంటే అర్ధం పూర్తిగా తెలియక పోవచ్చు. వారి దృష్టిలో ఏప్రిల్ 14 అంటే “ఒక గజ మాల వేస్తే రేపు ఓట్లు వేయించే ఒక యంత్రంలా” కనిపించవచ్చు.
నేడు దళిత సోదరులకు మాత్రమే వెలుగు నిచ్చే సూర్యుడు ఉదయించిన రోజు కాదు. ఏప్రిల్ 14 అంటే సూరీడు ఉదయిస్తున్న రోజు మాత్రమే కాదు. అణచివేయబడ్డ వర్గాల జీవితాలలో వెలుగు నింపడానికి ఈ సూర్యుడే అంబేద్కర్’గా ఉదయించిన రోజు.
ఓట్లు వేయించే యంత్రం కాదు…
అంబేద్కర్ అంటే సంవత్సరానికి ఒక్కసారి రెండు పూల దండలు వేస్తే, ఒక ప్రెస్ మీట్ పెడితే, ఓట్లు వేయించే యంత్రం కాదు. కుల వివక్షతనకు వ్యతిరేకంగా మరో మహా భారతాన్ని జరగకుండా ఆపిన శ్రేష్ఠుడు. ఉత్తముడు.
ఆ రోజుల్లో దళితులు గుక్కెడు నీళ్లు తాగి దాహం తీర్చుకోవాలంటే అగ్రవర్ణాల అనుమతి కావాలి. కనీసము సహ విదార్థులతో కూర్చొని చదువుకోవడానికి కూడా అనుమతి ఉండేది కాదు. అటువంటి వాతావరణములో వీధి దీపాల క్రింద చదువుకొని, అత్యున్నత స్థానానికి వెళ్లి కూడా తన మూలాలను, తన జాతికష్టాలను మరిచి పోయిన వ్యక్తి కాదు అంబేద్కర్.
జాతి ముందు బిడ్డ మన అంబేద్కర్
ఈ అంకితభావము, జాతిపునరుద్ధరణ అనే ఈ భావన నేడు ఎంతమందిలో ఉంటున్నది. నాటి కర్ణుడి నుండి నేటి కుల రాజకీయ నాయకులలో ఎందరో కులాల పేరుతో పదవులు పొంది, ఆ పొందిన పదవులతో, విశ్వాసం గల కుక్కలమి అని చెప్పుకొంటూ, తమ గాదెలను నింపుకోవడమే కానీ తమ జాతి గురించి, జాతికి జరుగుతున్న అన్యాయముల గురించి ఎక్కడ ఆలోచిస్తున్నారు?
ఇప్పటికి పదిరికుప్పం, కారంచేడు, చుండూరు, కంచికచర్ల, పెందుర్తి లాంటి ఘటనలలో నిందుతులకు శిక్ష పడుతున్నదా? లేదా? అని అడుగుతున్న వారు నేడు లేరు. ఎవరైనా అడుగుతున్న వారికి మద్దతు తెలిపేవారు లేరు.
మరో మహాభారతాన్ని ఆపిన అపార మేధావి
అంబేద్కర్ అంటే ఒక దళిత నాయకుడుగానే ఇప్పటికీ ప్రచారము జరుగుతున్నది. అంబేద్కర్ లేకపోయి ఉంటే, బానిస సంకెళ్లును భరించలేక, వివక్షతకు గురియైన ఈ అణచివేయబడ్డ వర్గాలు ఎప్పుడో తిరుగుబాటు చేసి ఉండేవి. రక్తపాతము జరిగి ఉందేది. మరో మహా భరతం జరిగి ఉండేది.
భారతదేశములో సకల జనులకి, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వము రాజ్యాంగములో సమపాళ్లలో ఉన్నాయి అంటే అది అంబేద్కర్ ముందు చూపే అనే భావన అగ్రవర్ణాల యువతలో వచ్చేది ఎప్పడు?
అటువంటి మేధావి, దార్శినికుడు, సమసమాజ స్థాపనకు దారి చూపిన అంబేద్కర్’కి భారతరత్న (Bharat Ratna) రావడానికి, మరణానంతరము సుమారు మూడు దశాబ్దాలు పట్టింది. ఓట్లు వేయించే యాత్రముగా చూడకపోతే ఇప్పటికి ఆయనకి భారత రత్న వచ్చి ఉండేది కాదేమో?
అంబేద్కర్ విగ్రహాన్ని వూరు చివర మాలపల్లెల్లోపెట్టి, వసంతానికి ఒక్క రోజున ఒక గజమాల వేస్తే సరిపోతుంది అనుకొనే అగ్రవర్ణాల/పాలక వర్గాల నాయకులు, వారి పెరట్లో చేద తీరే అణగారిన వర్గాల నాయకులు ఉన్నంతకాలము, అంబేద్కర్ వాదము అందరి గుండెల్లో సజీవంగా ఉంటూనే ఉంటుంది. అలానే అగ్రవర్ణాల అణచివేత ఉన్నంత వరకు అంబేద్కర్ ఎప్పటికీ సజీవమే.
అంబేద్కర్ ఒక దళిత బిడ్డ కాదు భరతజాతి ముద్దుబిడ్డ అని తలిచి, మన అందరి గుండెల్లో నిలుపుకొనే రోజు రావాలి. అంబెడ్కర్ కలలు నిజం అవ్వాలి అంటే రాజ్యాధికార ఫలాలు అన్ని వర్గాలు అనుభవించాలి. అందుకు రాజ్యాధికారంలో మార్పు రావాలి అని చెప్పగలిగే ప్రసార సాధనాలు కూడా రావాలి. పవన్ కళ్యాణ్ లాంటి ప్రజా ప్రతినిధులు గెలవాలి.
భారతజాతి ముద్దుబిడ్డ. మహానుభావుడు అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ గారికి శతకోటి పాదాభివందనాలతో… జై భీం.
ఆలోచించండి!!! తరాలు మారుతున్నా తలరాతలు మారవా? ఇంకెన్నాళ్లు పల్లకీ మోత? (It’s from Akshara Satyam)