ఎస్ఎస్‌బీఎన్ కళాశాల వద్ద ఉద్రిక్తత
ఆందోళన చేస్తున్న కళాశాల విద్యార్ధుల (College Students)పై పోలీసులు (Police) లాఠీచార్జి చేసారు. ఎస్ఎస్‌బీఎన్ కళాశాల (SSBN College) విద్యార్థి సంఘాలు (Students Organizations) ఎయిడెడ్ కళాశాలలు (Aided Colleges), పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో (Ananthapuram) ఆందోళన చేపట్టాయి. అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల వద్ద విద్యార్థులతో ఎస్‌ఎఫ్‌ఐ (SFI), ఏఐఎస్‌ఎఫ్ (AISF) విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల, పాఠశాల విలీనాన్ని ఉప సంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. యాజమాన్యాలు ఇప్పటికే విలీనానికి అంగీకరించాయి. అందుకు సంబంధించిన పత్రాన్ని విద్యాశాఖ అధికారులకు కూడా సమర్పించింది. దీన్ని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రైవేటు పరం చేయడం వలన ఫీజుల భారం (Fee burden) అధికం అవుతుంది అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే విద్యార్థులు ఇవాళ ఆందోళనకు దిగారు.
కళాశాల వద్దకు చేరుకొన్న పోలీసులు ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టారు. పోలీసులు, విద్యార్థుల మధ్య జరిగిన తోపులాటలో కొంతమంది విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో వారు విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసినట్లు తెలుస్తున్నది. దీంతో ఒక విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసికొన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు అని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.