వైసీపీ కోసం సోము వీర్రాజుకు ఉద్వాసన?
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమిస్తున్నట్లు బీజేపీ పార్టీ అధిష్టానం ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరిని నియమిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో ఆ పార్టీ అధ్యక్షులను మార్చేస్తూ అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు అధిష్టానం ఉద్వాసన పలికారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోము వీర్రాజుకు ఫోన్ చేసి అధ్యక్ష పదవి మార్పు గురించి తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సోము వీర్రాజుకు జేపీ నడ్డా ఆయనకు హామీ ఇచ్చారు. అయితే ఈ విషయంపై సోము వీర్రాజు ఇంకా స్పందించలేదు. 1978 నుంచి సోము వీర్రాజు బీజేపీలోనే కొనసాగుతున్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో 2020 జులై 27న ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయిన విషయం తెలిసిందే. అయితే ఏపీ అధ్యక్షుడిని మార్చాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
దీంతో పాటు సోము వీర్రాజుపై రాష్ట్రానికి చెందిన కొంత మంది నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు కొన్ని రోజులుగా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు.. వివిధ రాష్ట్రాల అధ్యక్షుల మార్పుపై బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.
ఏపీలో మరో 9 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడితోనే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ అధినాయకత్వం భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోము వీర్రాజును తప్పించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఏపీ బీజేపీ నూతన సారథిగా కేంద్ర మాజీ మంత్రి, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పారు.
బీజేపీ చేసిన ఈ మార్పులు బీజేపీ పురోభివృద్ధికా లేక వైసీపీని అధికారంలోకి తేవడం కోసమా అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతున్నది.