Nadendla Press meetNadendla Press meet

వారాహి వాహనంలో సభా ప్రాంగణానికి పవన్ కళ్యాణ్
సభా వేదికకు పొట్టి శ్రీరాములు పేరు
శ్రీ పింగళి వెంకయ్య, నేతాజీల స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తాం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి జనసేన శ్రేణులు పని చేయాలి

వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజల్ని కంకణ బద్ధుల్ని కావాలి
ముఖ్యమంత్రి ఐ ప్యాక్ లేకుండా ఎన్నికలకు?
మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ (Janasena Formation day) కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో నిర్వహించనున్నట్టు జనసేన పార్టీ (Janasena Party) రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ప్రకటించారు. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు కోసం, వైసీపీ ప్రభుత్వాన్ని (YCP Government) ఇంటికి పంపేందుకు ప్రజల్ని కంకణ బద్దుల్ని చేసే వేదిక ఈ ఆవిర్భావ సభ (Janasena Formation meeting) అని నాదెండ్ల అన్నారు. సభా వేదికపై రైతుల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు.

తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు పేరిట సభా వేదికను ఏర్పాటు చేస్తాం. జాతి గర్వించే మహానుభావుడు శ్రీ పింగళి వెంకయ్య, స్వతంత్ర సమర సాయుధ పోరాట యోధుడు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్’ల త్యాగాలను స్మరించుకునే విధంగా సభ ప్రాంగణం ఉంటుందని తెలిపారు.

మార్చి 14వ తేదీన జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి వారాహిలో బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకుంటారని చెప్పారు. రాబోయే పది రోజుల్లో సభ కోసం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు వైసీపీకి వ్యతిరేంగా పాల్గొనాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో సామాన్యుడి గళం వినిపించే విధంగా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రతి ఒక్కరినీ సమానంగా చూస్తూ.. గత 9 సంవత్సరాలుగా జనసేన పార్టీ చేస్తున్న కృషి ప్రజలందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ 9 సంవత్సరాల క్రితం పార్టీని స్థాపించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ సహనం కోల్పోకుండా ఉంటూ వచ్చారు. జనసేనాని రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల కోసం ముందుకు వెళ్తున్నారు. జన సైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులు… పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చిన ప్రతి సందర్భంలో ప్రతి కార్యక్రమాన్ని పవిత్రంగా భావించి ముందుకు తీసుకువెళ్తున్నారు.

కనీవినీ ఎరుగని రీతిలో ఆవిర్భావ సభ

ఇప్పుడు పార్టీ 10వ ఆవిర్భావ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని పవన్ కళ్యాణ్  ఆదేశించడం జరిగింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్వహించే ఈ సభ కోసం వచ్చే జనసైనికులు, వీర మహిళలు, నాయకులకు తగు రీతిన సౌకర్యాలు కల్పించమని సూచించారు. గత ఆవిర్భావ సభలో రాష్ట్ర భవిష్యత్తు కోసం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని ఇచ్చిన పిలుపు రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు తెచ్చింది. రేపటి సభలో జనసేన పార్టీ భవిష్యత్ కార్యచరణ పవన్ కళ్యాణ్ వివరిస్తారు.

ఇప్పటం మాదిరి కూల్చేందుకు ఇక్కడ ఇళ్లు లేవు

పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని మచిలీపట్నంలో నిర్వహించబోతున్నాం. నివర్ తుపాను సమయంలో పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించారు. కష్టాల్లో ఉన్న రైతుల్ని ఆదుకోమని, ఆర్ధిక సాయం చేయమని కోరినా జగన్ రెడ్డి ప్రభుత్వం స్పందించలేదు. పైగా రైతుల్ని మరింత కష్టపెట్టే విధంగా కాలం గడుపుకుంటూ వచ్చింది. ఆ సందర్భంలో చాలా మంది రైతులు పవన్ కళ్యాణ్ గారిని కలసిన సందర్భంగా పార్టీ బలోపేతం కోసం తమ ప్రాంతంలో ఓ చక్కని కార్యక్రమం చేయమని కోరారు.

ఇప్పుడు సభ కోసం రైతులు తమవంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. అద్భుతంగా 34 ఎకరాల స్థలాన్ని సభా ప్రాంగణానికి అందించారు. సభా ప్రాంగణం వద్ద రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే జనసైనికులు, వీర మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నాం. మచిలీపట్నంకి కిలోమీటర్ దూరంలో జాతీయ రహదారిపై సభా వేదిక ఉంటుంది. అదృష్టవశాత్తు అక్కడ ఇప్పటం మాదిరి ప్రభుత్వం కూలగొట్టడానికి ఇళ్లు లేవు. సభ కోసం 34 ఎకరాల భూమిని అక్కడ రైతులు ఆశీర్వదించి ఇచ్చారు అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ గారి మాట ఇదీ

మార్చ్ 14వ తేదీ సాయంత్రం జరగబోయే ఆవిర్భావ సభకు మంగళగిరి రాష్ట్ర కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనంలో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు అద్భుతమైన సభ నిర్వహిస్తారు. దారి పొడవునా గ్రామాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతారు. ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచే విధంగా జనసేన పార్టీ కార్యక్రమం ఉంటుంది. సభలో రైతాంగానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం. జనసేన పార్టీ ప్రజల కోసం ఎలా అంకితభావంతో నిలిచింది అనే అంశాలు ప్రతి ఒక్కరు అర్ధం చేసుకోవాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ పాల్గొనడం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పాల్గొనే జనసైనికులు, వీర మహిళలకు ఒక అభ్యర్ధన చేయమన్నారు.

వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని, ఓటర్లుగా రిజిస్టర్ చేసుకున్న వారు వైసీపీ అభ్యర్ధులకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పాల్గొనాలని పార్టీ నుంచి కోరుతున్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం వైసీపీని ఓడించాలి అని నాదెండ్ల తెలిపారు.

100 మందికి పైగా సలహాదారులు.. కాగితం లేకుండా ప్రసంగించలేరు

పెట్టుబడుల పేరిట రెండు రోజుల సమ్మిట్ కోసం ప్రభుత్వం రూ.175 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తోంది. పెట్టుబడులు ఆహ్వానించేందుకు, ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తే తప్పకుండా జనసేన మద్దతు ఇస్తుంది. విశాఖలో జరుగుతున్న తంతు కేవలం ఆ ప్రాంతాన్ని ముస్తాబు చేసి హడావిడి చేస్తూ ముఖ్యమంత్రి త్వరలో విశాఖ తరలి రానున్నారన్న ఆందోళన రేపే కార్యక్రమం.

రాష్ట్రానికి రాజధాని ఎక్కడో తెలియదు. పెట్టుబడిదారులకు నమ్మకం ఎలా వస్తుంది. ఆహ్వానించిన అతిధులకు కార్లు ఇచ్చేందుకు టాక్సీ డ్రైవర్లు కూడా ముందుకు రాని పరిస్థితి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం బిల్లులు ఇవ్వదని భయం. ఈ పరిస్థితుల్లో లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని చెబుతున్నారు. రెండు లక్షల 12 వేల చదరపు అడుగుల భవనాలు విశాఖలో ఖాళీ ఉన్నాయి. ముందు వాటిని నింపి తర్వాత ఇలాంటి సమ్మిట్ లు పెట్టుకోండి.

100 మందికి పైగా సలహాదారుల్ని పెట్టుకున్నారు. కాగితాలు లేకుండా ప్రసంగించలేరు. చుట్టుపక్కల కొంత మందిని పెట్టుకుని పెట్టుబడులు వస్తున్నాయని సంతకాలు చేసుకునే కార్యక్రమం. ఇది దావోస్ మాదిరి మభ్యపెట్టే కార్యక్రమం. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని నాదెండ్ల మనోహర్ అన్నారు.

దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో రోడ్లు వేయండి

ముఖ్యమంత్రి మాటల్ని ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. దమ్ముంటే ఆయనని 175 నియోజకవర్గాల్లో రోడ్లు వేయమనండి. దమ్ముంటే ఐ ప్యాక్ లేకుండా ఎన్నికలకు రమ్మనండి. దమ్ముంటే హెలీకాప్టర్ లేకుండా 175 నియోజకవర్గాల్లో రోడ్డు మార్గాన తిరగమనండి. ఆయన వ్యూహం అది. పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటో మార్చి 14వ తేదీన పవన్ కళ్యాణ్ వివరిస్తారు.

వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధమైపోయారని ముఖ్యమంత్రికి అర్ధమైపోయింది. అందుకే సహనం కోల్పోయి మాట్లాడుతున్నార”ని నాదెండ్ల అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన మహేష్, కార్యక్రమాల నిర్వహణ విభాగం రాష్ట్ర కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్, చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, పార్టీ నాయకులు అక్కల రామ్మోహన్ రావు, అమ్మిశెట్టి వాసు, బండి రామకృష్ణ, షేక్ రియాజ్, సయ్యద్ జిలానీ, నయూబ్ కమాల్, బేతపూడి విజయ్ శేఖర్, నేరెళ్ల సురేష్, తాడిశెట్టి నరేష్, పులిపాక ప్రకాష్, పీతల మూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖ నుంచే పోటీ చేస్తా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ