సంచలనం సృష్టిస్తోన్న అమిత్ షా వ్యాఖ్యలు
జగన్ పాలన అవినీతి మయం అన్న షా!
వైసీపీ పాలనలో విశాఖ అరాచక శక్తుల అడ్డగా మారింది!
జగన్ ప్రభుత్వం (Jagan Government) ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) గడిచిన నాలుగేళ్లలో అవినీతి, కుంభకోణాలు తప్పితే ఇంకేమీ చేయలేదు. జగన్ రెడ్డి పాలనలో విశాఖని (Visakha) అరాచక శక్తులకు అడ్డాగా మార్చేశారు అని కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్‌షా (Amit Shah) తీవ్రంగా విమర్శించారు. విశాఖలో వైకాపా నాయకులు భూ దందాలు, అక్రమ మైనింగ్, నకిలీ మందుల వ్యాపారం చేస్తున్నారని అమిత్‌షా మండిపడ్డారు. విశాఖ రైల్వే మైదానంలో ఆదివారం సాయంత్రం బీజేపీ నిర్వహించిన మహాజన్ సంపర్క్ అభియాన్ (BJP mahajan sampark abhiyan) సభలో అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
నిధులన్నిటినీ జగన్ అవినీతి క్యాడర్ స్వాహా
పదేళ్ల యూపీఏ పరిపాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగింది. తొమ్మిదేళ్ల మోదీ పాలనలో ఎవరూ ఒక్క అవినీతి ఆరోపణ చేసే సాహసం చేయలేదు. యూపీఏ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి 2009-14 మధ్య రూ.78వేల కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇదే మోదీ హయాంలో ఆంధ్రకి రూ.2.30 లక్షల కోట్లు కేటాయించిందని అమిత్ షా చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులన్నింటినీ జగన్ అవినీతి నాయకులు స్వాహా చేస్తోందని షా తీవ్రంగా దుయ్యబట్టారు. అందుకే కేంద్రం ఇస్తున్న నిధుల ప్రభావం ఏపీలో కనిపించట్లేదని అయన తెలిపారు. ‘
విశాఖ రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు రూ.450 కోట్లు కేటాయించాం. కడప విమానాశ్రయం పునఃనిర్మాణం, కర్నూలు కొత్త విమానాశ్రయంతో పాటు, భోగాపురం విమానాశ్రయానికీ అన్ని అనుమతులూ మంజూరుచేశాం. ఏపీకి సికింద్రాబాద్-విశాఖ, సికింద్రాబాద్-తిరుపతి మధ్య రెండు వందేభారత్ రైళ్లను కేంద్రం ఇచ్చింది. తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం, అమరావతి, నగరాలను స్మార్ట్‌సిటీలుగా కేంద్రం అభివృద్ధి చేస్తుంది అని కేంద్ర మంత్రి తెలిపారు.
కాకినాడలో బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటు చేస్తున్నాం. అనంతపురం విశాఖలో బహుళ వినియోగ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తున్నాం. ఇవే కాకుండా ఏపీలో అనేక విద్యాసంస్థలను భాజపా హయాంలోనే ఏర్పాటుచేశాం అని అమిత్ షా అని ఆయన అన్నారు.
ఎక్కడికి వెళ్లినా మోదీని మెచ్చుకొంటున్నారు
మోదీ నామస్మరణ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా వినిపిస్తోంది. ఇది భారత ప్రజలు అందుకునే గౌరవమని షా వివరించారు. మోదీ పాలనలో అంతర్గత రక్షణతో పాటు, సరిహద్దుల్లోనూ భద్రతను పటిష్ఠం చేశాం. పుల్వామాలో దాడి జరిగిన పది రోజుల్లోనే పాకిస్థాన్‌లోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ చేసి బుద్ధి చెప్పాం. రూ.5 లక్షల వరకు ఉచిత బీమా, ధాన్యానికి మద్దతుధర పెంచాం. కొవిడ్ సమయంలో 230 కోట్ల వ్యాక్సిన్లు ఉచితంగా ఇచ్చాం. ఒకప్పుడు జాతీయ రహదారులు 4వేల కి.మీ. ఉండేవి. కానీ నేది వాటిని 9వేల కి.మీలకు విస్తరించాం.
కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తీసేస్తే రక్తం ఏరులై పారుతుందని రాహుల్‌గాంధీ అన్నారు. కానీ ఎలాంటి అరాచకాలు జరగకుండా మోదీ ఆ ఆర్టికల్‌ను రద్దు చేశారు’’ అని అమిత్‌షా వివరించారు.
ఉచిత బియ్యంపై జగన్ రెడ్డి ఫొటోలా?
రైతుసంక్షేమ ప్రభుత్వం నడుపుతామని జగన్ చెబుతున్నారు. కానీ జగన్ రెడ్డి రైతుల ఆత్మహత్యల్లో ఏపీని మూడోస్థానంలో నిలిపారు. దీనికి జగన్ సిగ్గుపడాలి. దేశంలో 11 కోట్ల మంది రైతులకు ఏటా మోదీ రూ.6వేల చొప్పున పంపిస్తున్నది. కానీ ఏపీలో రైతుభరోసా పేరుతో తాను ఇస్తున్నట్లుగా రైతులను జగన్ మభ్యపెడుతున్నారు అని జగన్ ప్రభుత్వంపై అమిత్ షా తీవ్రంగా విరుచుకు పడ్డారు.
కొవిడ్ సమయంలో 80 కోట్ల మందికి ప్రతి నెలా, ప్రతి ఒక్కరికీ కేంద్రమే 5 కిలోల ఉచితంగా బియ్యం అందించింది. ఉచిత బియ్యం పధకంపైనా కూడా జగన్ రెడ్డి తన ఫొటో వేసుకుని ప్రచారం చేసుకున్నారు అని షా అన్నారు.
దేశంలో 300 సీట్లతో మోదీ తిరిగి ప్రధాని అవ్వడం తథ్యం. ఏపీ నుంచి 20 ఎంపీ సీట్లలో భాజపాని గెలిపించాలి అని అమిత్ షా తెలుగు ప్రజలను కోరారు.
కనక మహాలక్ష్మి, సింహాద్రి అప్పన్నకు నమస్సులతో….
అమిత్‌షా సింహాద్రి అప్పన్నస్వామి, కనక మహాలక్ష్మిలకు ప్రణామం చేస్తూ ప్రసంగం ఆరంభించారు. అల్లూరి సీతారామరాజు, తెన్నేటి విశ్వనాథం, విజయనగర రాజు పీవీజీ రాజులను స్మరించుకున్నారు. భారత్ మాతాకీ జై అంటూ ఉత్సాహంతో నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు, విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.