చట్టం లేని దిశ యాప్ ని ప్రజల మీద రుద్దుతున్నారు
ప్రతి అడుగులో ప్రజల్ని ఇబ్బందిపెట్టే కార్యక్రమాలు చేస్తోంది
మహిళలు షేర్ ఆటో ఎక్కాలన్నా భయపడే పరిస్థితి తెచ్చారు
ఈసారి వేసే ఓటు రాష్ట్ర భవిష్యత్తు కోసం వేయాలి
జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేసినా మహిళాభివృద్ధి కోసమే చేస్తుంది
మార్పు కోసం చేస్తున్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ కలసి రావాలి
తెనాలి నియోజకవర్గ వీర మహిళలతో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
బటన్లు నొక్కే ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అదే బటన్ తో బుద్ధి చెప్పాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఈసారి వేసే ఓటు అందరి భవిష్యత్తు కోసం వేయాలని కోరారు. ప్రజలు రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీకి ఇవ్వనంత మెజారిటీ ఇస్తే పరిపాలన చేతకాక ఇచ్చిన అవకాశాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు. ప్రతి అడుగులో ప్రజల్ని ఇబ్బందిపెట్టే కార్యక్రమాలు చేస్తోంది అని నాదెండ్ల మనోహర్ అన్నారు.
ప్రభుత్వం మారిన తర్వాత జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా మహిళల అభివృద్ధి కోసమే చేపడుతుందని భరోసా ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వీర మహిళలతో సమావేశం అయ్యారు. వైసీపీ పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగనన్న కాలనీల దగ్గర నుంచి చెత్త పన్ను వరకు, అక్రమ మద్యం అమ్మకాల నుంచి గంజాయి అమ్మకాల వరకు మనోహర్ గారి ఎదుట మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారులకు అందడం లేదు. ధరలు పెరిగిపోయి మహిళలకు ఇంటి నిర్వహణ భారంగా మారిపోయింది. ఏ దశలోనూ ప్రజలకు ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదు. పొదుపు సంఘాల్లో ఇప్పుడు పేరుకి మాత్రమే గ్రూపులు మిగిలాయి. డ్వాక్రా గ్రూపుల ద్వారా ఉపాధి కల్పించే పరిస్థితులు లేవు. పాడి పశువుల పేరిట రూ. 2,287 కోట్లు దోచేశారు. 3 లక్షల 94 వేల పశువులు కొన్నామని చెప్పి, 8 వేల పశువులు మాత్రమే ఇచ్చారు. ఇంటింటికీ రేషన్ అన్నారు. అదీ లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామ గ్రామానికీ గంజాయి పాకించారు. ఎన్నికలప్పుడు చేయాల్సిన ఓట్ల రాజకీయాన్ని పరిపాలనలో ప్రతి అడుగులో చేస్తున్నారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీతో పొత్తు
రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయి. మహిళలు షేర్ ఆటోల్లో ఎక్కాలన్నా భయపడే పరిస్థితి తీసుకువచ్చారు. దిశ చట్టం చేసింది లేదు. యాప్ తీసుకొచ్చి ప్రజల నెత్తిన రుద్దుతున్నారు. మహిళలు కోరుకునే గౌరవం, ఆత్మరక్షణ ఈ ప్రభుత్వంలో కరవయ్యాయి. కనీస మౌలిక సదుపాయాలు లేవు. వేల కోట్ల రూపాయిలు దుర్వినియోగం అయ్యాయి. వడ్డీకి తీసుకువచ్చిన డబ్బు ఏ కుటుంబానికీ ఉపయోగపడడం లేదు. పనికి వెళ్దామంటే పనులు లేవు. ఏ పని కావాలన్నా లంచాలతో సామాన్య ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు. రేషన్ కార్డులు లేవు. ఫించన్లు ఇవ్వరు. ఎన్నడూ లేని విధంగా విద్యుత్ బిల్లులు వేస్తున్నారు. చెత్త పన్నుతోపాటు, మరుగు దొడ్డికి కూడా పన్నులు వసూలు చేస్తున్నారు.
ఈ ప్రభుత్వంలో అర్హత ఉన్న వారికి అన్యాయం జరుగుతోంది. జనసేన పార్టీ ప్రభుత్వం మహిళల కోసం నిలబడుతుంది. వారి ఆర్ధిక అభివృద్ధికి తోడ్పడుతుంది. రాష్ట్ర భవిష్యత్తు కోసమే శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత, మార్పు కోసం జనసేన పార్టీ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిన అవసరం ఉంది. మార్పు కోసం చేస్తున్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ కలసిరావాల”ని నాదెండ్ల మనోహర్ పిలుపు నిచ్చారు.
సమావేశంలో వీర మహిళలు శ్రీమతి చట్టు వెంకటేశ్వరి, శ్రీమతి పసుపులేటి వెంకటేశ్వరమ్మ, శ్రీమతి వెలివెల నాగలక్ష్మి, శ్రీమతి నాగినేని నాగమణి, శ్రీమతి తిన్నలూరి విజయలక్ష్మి, శ్రీమతి ఎగ్గోలు మౌనిక, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, పార్టీ నేతలు పసుపులేటి మురళీకృష్ణ, హరిదాసు గౌరీశంకర్, షేక్ జాకిర్ హుస్సేన్, ఇస్మాయిల్ బేగ్, చదలవాడ వేణుమాధవ్, దివ్వెల మధుబాబు, యర్రు వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.