పార్టీ సంస్థాగత నిర్మాణానికి తొలి ప్రాధాన్యం
పొత్తుల విషయంలో ఎవరి మైండ్ గేమ్ లో పావులు కావొద్దు
అందరికీ ఆమోదయోగ్యమైన ఆలోచనతోనే ముందుకు వెళ్దాం
జనసేన స్వలాభం కోసం వచ్చిన గుంపు కాదు
రైతాంగం సమస్యలపై ప్రణాళికాబద్ధమైన పోరాటం
పార్టీ కార్యనిర్వాహక సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్’లో (Tele Conference) జనసేన పార్టీ (Janasena Party) అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దిశా నిర్ధేశం చేశారు. పలు పార్టీలు మనతో పొత్తులు కోరుకున్నప్పటికీ మనం మాత్రం ముందుగా సంస్థాగత నిర్మాణంపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారిద్దామని జనసేనాని (Janasenani) స్పష్టం చేసారు. పార్టీ కార్యనిర్వాహక సమావేశంలో పలు విషయాలపై పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే బీజేపీతో (BJP) పొత్తులో ఉన్నాం. ఈ వ్యవహారంలో అంతా ఒకటే మాట మీద ఉందాం. ఎవరు ఏం మాట్లాడినా.. మైండ్ గేములు ఆడినా మనం మాత్రం పావులు కావద్దని జనసేనాని పార్టీ కార్యకర్తలకు వివరించారు.
సంస్థాగత నిర్మాణం మీదనే దృష్టి
సంస్థాగత నిర్మాణం మీద దృష్టి సారిద్దామని సేనాని చెప్పారు. తన ఒక్కడి నిర్ణయం మీద ముందుకు వెళ్లనని, పూర్తి ప్రజాస్వామ్యబద్దంగా అందరికీ ఆమోదయోగ్యమైన ఆలోచనే ముందుకు తీసుకువెళ్తానన్నారు. అప్పటి వరకు ఎవరేం మాట్లాడినా సంయమనంతోనే ఉండాలని పార్టీ నాయకత్వానికి జనసేనాని సూచించారు. కరోనా మూడో వేవ్ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జనసేన పార్టీ కార్యనిర్వాహక సభ్యుల సమావేశం నిర్వహించారు. పార్టీ పి.ఏ.సి. ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. పి.ఏ.సి సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు… అనుబంధ విభాగాల చైర్మన్లు, రాష్ట్ర కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జనసేన పార్టీ రోజు రోజుకీ బలం పుంజుకుంటోంది
“క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ రోజు రోజుకీ బలం పుంజుకుంటోంది అని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అన్నారు. అయితే పార్టీ నిర్మాణం అనేది కష్టసాధ్యమైన పని. సంస్థాగత నిర్మాణం లేదు అంటూ ప్రతి ఒక్కరు తేలిగ్గా చెప్పేస్తున్నారు. ఆ మాట మాట్లాడే వారు ఎవరూ పార్టీని స్థాపించలేదు. చిన్నపాటి సంస్థను నడిపించలేని వ్యక్తులే అలాంటి మాటలు అంటూ ఉంటారు. జనసేన పార్టీ అంటే స్వలాభం కోసం, స్వప్రయోజనం కోసం వచ్చిన గుంపు కాదు అని సేనాని స్పష్టం చేశారు. ఒక కట్టుదిట్టమైన ఆలోచనా విధానంతో వ్యక్తిగత అజెండాలు లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించకుండా వచ్చిన పార్టీ జనసేన. అలానే డబ్బు కోసం కాకుండా కేవలం ప్రజల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం నిలబడేలాగా పార్టీని ముందుకు తీసుకువెళ్లడం ఎంతో కష్టసాధ్యమైన విషయం. అలాంటిది ఇన్ని సంవత్సరాలు ఈ విధంగా ముందుకు తీసుకు వెళ్లగలుగుతున్నామంటే సామాన్య విషయం కాదు అని జనసేనాని వివరించారు. ఈ రోజు ఏ మూలకు వెళ్లినా ఒక జనసేన జెండా (Janasena Janda) రెపరెపలాడుతుంది.
దేశ భవిష్యత్తుకి యువతే నావికులని చెబుతారు. అలాంటి యువత మనవెంట బలంగా ఉన్నప్పుడు ఆ బలాన్ని మనం చూడగలగాలి. సంస్థాగతంగా, రాజకీయంగా మలచుకోవడానికి కొంత సమయం తీసుకుంటుంది. పార్టీ స్థాపించిన ఏడేళ్ల తర్వాత యువత ఈ రోజుకి నాయకుల స్థాయికి రాగలిగే పరిస్థితిలో ఉన్నారు. ఆ యువత మీ వెంట నిలబడతామన్న ధైర్యం నింపితే ఈ రోజుకి రాష్ట్రవ్యాప్తంగా 676 మండలాలకుగాను 403 మండలాల్లో అధ్యక్షులను నియమించుకున్నాం. అలా వేయగలిగామంటే యువత, జనసైనికులు, వీర మహిళలే మన బలం. ఈ బలాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ ఈ ఏడాది లోపే సంపూర్ణంగా 175 నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు నిర్మాణం చేసుకుందాం అని పవన్ కళ్యాణ్ వివరించారు.
ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు కమిటీ
గత సంవత్సరం కోవిడ్ పరిస్థితుల వల్ల పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని (Formation Day) ఘనంగా నిర్వహించుకోలేకపోయాం. ఆ సభను ఘనంగా జరుపుకోవాలన్నది నా ఆకాంక్ష. దాని కోసం అయిదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తాం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆవిర్భావ సభను ముందుకు ఎలా తీసుకువెళ్లాలో దిశానిర్దేశం చేస్తే ఆ విధంగా ముందుకు తీసుకువెళ్దాం. ఆ ఆవిర్భావ సభలో 2024 ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలి అనే అంశాలను ఒక ఆలోచనతో ముందుకు తీసుకువెళ్దాం అని సేనాని అన్నారు.
ప్రజా సమస్యలపై పోరు
ఏడాది పొడుగునా రైతుల కోసం పార్టీ శ్రేణులు (Party Cadre) వివిధ స్థాయిల్లో చేసిన పోరాటానికి పేరుపేరునా ధన్యవాదాలు. వరి, మిర్చి రైతులకు, తుపానుల వల్ల పంటను కోల్పోయిన రైతులకు అండగా నిలబడి ప్రభుత్వం నుంచి వారికి జరిగిన నష్టానికి పరిహారం ఎలా ఇప్పించాలి.. అందుకు ఏం చేయాలి అనే దాని మీద పార్టీ వద్ద ఒక బలమైన ప్రణాళిక ఉంది. ఈ నెలలో రైతాంగం కోసం చేసే పోరాటాన్ని ధర్నాల రూపంలో ముందుకు తీసుకువెళ్దామని భావించాం. కోవిడ్ వల్ల దాన్ని ముందుకు తీసుకువెళ్లలేకపోయాం. ఆ పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఆలోచన చేద్దాం అని సేనాని చెప్పారు.
జాబ్ క్యాలెండర్ (Job Calendar), ఇతర సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలోకి ఎలా తీసుకువెళ్దాం, ఏ విధంగా పోరాడాలి అనే అంశంపై సంక్రాంతి తరవాత ఒక సమావేశం నిర్వహించుకుని ముందుకు వెళ్దాం. అందరి సలహాలు సూచనల మేరకు మరో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా జిల్లాల పర్యటనలు, ప్రతి నియోజకవర్గం ప్రజలను కలిసేలా ప్రణాళిక సిద్ధం చేద్దాం అని జనసేనాని వివరించారు.
క్రియాశీలక సభ్యుల కోసం రూ.కోటి నిధి
పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని ఎంతో ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్లారు. క్రియాశీలక సభ్యులకు ప్రమాద బీమా కల్పిస్తున్నాం. బీమాకు సంబంధించి సభ్యులకు ఇబ్బంది కలుగకుండా రూ. కోటి పార్టీకి అందచేశాను. పార్టీ క్రియాశీలక సభ్యులకు నావంతుగా నేను ఎప్పుడూ అండగా ఉంటాను. మార్చి నెలలో నిర్వహించే సభ్యత్వ నమోదును మరింత ముందుకు తీసుకువెళ్లాలి. భారత దేశంలో మరే రాజకీయ పార్టీ క్రియాశీలక సభ్యుల్ని ఈ విధంగా కాపాడుకున్నది లేదు. క్రియాశీలక సభ్యత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్దాం. ఎన్నికల తర్వాత పార్టీ బలోపేతం కోసం బలమైన మద్దతు తెలుపుతూ పార్టీని ముందుకు తీసుకువెళ్తూ మీరిచ్చిన మద్దతుకు పేరు పేరునా ధన్యవాదాలు” అని పవన్ కళ్యాణ్ అన్నారు.