రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చలేని ఈ సన్నాసి, పనికిమాలిన, దగుల్బాజీ ప్రభుత్వం రోడ్లు విస్తరిస్తుందట? బస్సు సౌకర్యం లేని గ్రామానికి వంద అడుగుల రోడ్డును వేస్తుందట… దానికి అత్యవసరంగా ఇళ్లను పడగొట్టి పేదల బతుకులతో ఆడుతోందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. శనివారం ఇప్పటం గ్రామ సందర్శన అనంతరం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి జనసేనాని మాట్లాడారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై పలు కీలక ఆరోపణలు చేసారు. “జనసేన పార్టీకి ఇప్పటం గ్రామం అండగా నిలబడిందనే కక్షతో ఇల్లు కూల్చేసింది. ఫాక్షన్ కు అలవాటుపడిన ముఖ్యమంత్రి.. కావాలని కుట్రతో పేదల ఇళ్లు కూలగొడుతున్నారు. ఇంకెన్ని రోజులు ఈ దాష్టికాలు చేస్తారో చేయండి.. ప్రజల్లో తిరుగుబాటు వస్తే మిమ్మల్ని కాపాడడం ఎవరి తరం కాదు. ప్రజలకు మీ మీద కోపం కాదు.. ఆగ్రహం వస్తోంది. మీ చేతలతో వారి ఆగ్రహానికి గురి అయ్యి భస్మం అవుతారు జాగ్రత్త అంటూ జనసేనాని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
15 అడుగుల రోడ్ల విస్తరణకు మీకు మనసు రాలేదు గానీ..70 అడుగుల రోడ్డును 100 అడుగులు చేయడానికి మాత్రం మీకు అత్యవసరంగా అభివృద్ధి గుర్తుకు వచ్చిందా..?ఇప్పటం గ్రామం జనసేన పార్టీకి అండగా నిలబడింది. వారికి కష్టమొస్తే మేము మా ప్రాణాలకు తెగించి అయినా వారిని కాపాడుకుంటాం. ప్రతికూల పరిస్థితుల్లో మనకు తోడుగా నిలిచే వారిని ఎట్టి పరిస్థితిలో వదులుకోను. కచ్చితంగా ఇప్పటం గ్రామస్తులకు చివరి వరకు తోడుంటాం. ఎన్ని కేసులు, మరెన్ని నిర్బంధాలు ఎదురైనా ఈ పోరాటం ఆగదు. కచ్చితంగా ఇప్పటం గ్రామస్థుల తరఫున న్యాయపోరాటం చేస్తాం అని పవన్ కళ్యాణ్ అన్నారు.
సజ్జల గారూ… మీకు మీ భాషలోనే సమాధానం చెబుతాం
మీరు నన్ను ఏదో చేయడానికి రెక్కీలు, సుపారీలు, సున్నాలు, కన్నాలు ఏవేవో ప్లాన్ చేస్తున్నారు. మీరు ఎన్ని బెదిరింపులకు దిగినా ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టంలో ఉన్న పేదవాడికి జనసేన పార్టీ తోడుగా నిలుస్తుంది. ఇక నుంచి జన సైనికులకు చెబుతున్నా. వైసీపీ నాయకులు ప్రజాస్వామ్య భాషలో మాట్లాడితే అలాగే మాట్లాడండి… కాదు కూడదు అంటే వారి భాషలోనే మాట్లాడండి. కేసులు, బెదిరింపులు, దౌర్జన్యాలు చేస్తామంటే వాటిని ఎదుర్కోవడానికి మీతో పాటు నేను సిద్ధంగానే ఉన్నాను. ఎంతకాలం వీరి అరాచకాలకు భయపడితే అంతకాలం వీరి రాక్షసత్వానికి అంతుండదు అని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదనతో అన్నారు.
కేవలం జనసేన పార్టీ ఆవిర్భావ సభ పెడితే స్థలం ఇచ్చిన వారిపై దౌర్జన్యానికి దిగుతున్న మీరు.. రేపు మరి ఏమైనా మీకు సమస్య వచ్చే పరిస్థితి ఉంటే మనుషుల్ని ఉండనిస్తారా? ప్రజలంతా మీ పరిపాలన అసలు నైజాన్ని, మీ గూండాయిజాన్ని భరిస్తున్నారు. ప్రతి లెక్కకు మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కచ్చితంగా జనసైనికులు సమష్టిగా ఉండి… రాజ్యం పెట్టే బెదిరింపులకు ఏ మాత్రం లొంగకుండా ఇదే పద్దతిలో తెగింపుతో ముందుకు వెళ్దాం. మీకు మీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు” అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.