Pawan Kalyan with AmbedkarPawan Kalyan with Ambedkar

‘నేను, నా దేశం.. ఈ రెండింటిలో నా దేశమే అత్యంత ముఖ్యమైనది’ అన్న మహానుభావుడు అంబెడ్కర్. ఇటువంటి ఎంత గొప్ప మాటలు, ఇంత మంచి మాటలు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా గొప్పగా ఎవరు చెప్పగలరు? రాజ్యాంగమనే మహా సూత్రాలను భరత జాతికి అందించిన మేధావి మన అంబెడ్కర్. ఈ దేశం సమైక్యంగా.. సమున్నతంగా.. సమభావంగా.. శక్తిమంతంగా.. ముందుకు సాగడానికి పద నిర్దేశం చేసిన దేశ భక్తుడు మన అంబెడ్కర్. అంబేద్కర్ వంటి మహా జ్ఞాని కోటికొక్కరు ఉంటారు అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబెడ్కర్ జయంతిని పురస్కరించుకుని వినమ్రంగా ప్రణామాలు అర్పిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ముఖ్యంగా నాకు అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాత. ఆయన గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అధ్యయనం చేశాను. లండన్ లో ఒకప్పుడు ఆయన నివసించి, ఇప్పుడు స్మారక మందిరంగా రూపుదిద్దుకున్న గృహాన్ని సందర్శించాను. అదే విధంగా లక్నోలో గొప్పగా నిర్మితమైన ఆయన స్మారక మందిరాన్ని తిలకించాను. మరెన్నో విషయాలు తెలుసుకున్నాను. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.

విద్యావేత్తగా.. మేధావిగా.. న్యాయకోవిదునిగా.. పాత్రికేయునిగా.. రాజకీయ నాయకునిగా.. రాజ్యాంగ నిర్మాణ సారధిగా.. న్యాయశాఖామంత్రిగా ఆయన ఈ దేశానికీ చేసిన సేవలు వెలకట్టలేనివి. విమర్శలకు వెరవని శ్రీ అంబేద్కర్ ‘ఏ కారణం లేకుండా నీపై విమర్శలు వస్తున్నాయంటే.. నువ్వు విజయం సాధించబోతున్నావని అర్ధం’ అంటారు.

“మేకల్ని బలి ఇస్తారు, కానీ పులులను బలి ఇవ్వరు. కాబట్టి పులుల్లా బతకండి” అని అణగారిన వర్గాలలో దైర్యం నింపారు. అస్పృశ్యత, అంటరానితం నిర్మూలనకు తన జీవిత చరమాంకం వరకు అవిరళ కృషి చేసి అసామాన్యునిగా నిలిచినా మహోన్నతమైన వ్యక్తి మన అంబెడ్కర్ అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.

అందుకేనేమో ఆయన ‘భారత రత్న’గా ప్రకాశిస్తున్నారు. ఆ మహానుభావుని మూలసూత్రాలు ఆధారంగా జనసేన ప్రస్థానం నిరంతరంగా సాగుతుందని ప్రమాణం చేస్తున్నాను. ఆయన బోధించిన ‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’ అనే మాటలను మననం చేసుకుంటూ శాంతిమూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళి అర్పిస్తున్నాను. జై హింద్ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

పదవులు కోసం కాదు – సమాజం కోసమే రాజకీయాల్లోకి వచ్చా: జనసేనాని

Spread the love