Nadendla Manohar Press meetNadendla Manohar Press meet

జగన్ రెడ్డిని నాడు తిట్టిన ఉత్తరాంధ్ర మంత్రులే నేడు నోరెత్తడం లేదు!
అప్పుడు అవినీతిపరుడు కానీ ఇప్పుడెలా నాయకుడవుతాడు?
దశాబ్దాల పాటు పదవుల్లో ఉండి ఉత్తరాంధ్రకు చేసిందేమిటి..?
పవన్ కళ్యాణ్ జనవాణిని అడ్డుకుంటామని చెప్పడం అవివేకం
రాష్ట్రానికి ఒక్క ఐటీ పరిశ్రమ తీసుకురావడం మంత్రికి చేతకాదు
మూడు రాజధానులపై వైసీపీవీ దొంగ నాటకాలు
విశాఖ భూ కుంభకోణాలపై సిట్ రిపోర్ట్ బయట పెట్టగలరా?
పవన్ కళ్యాణ్ పర్యటనను సమష్టిగా విజయవంతం చేద్దాం
జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

జగన్ రెడ్డి (Jagan Reddy) అవినీతిని (Corruption) నాడు తూర్పార బత్తిన ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు (YCP Senior Leaders), మంత్రులు నేడు మెచ్చుకోవడం, పొగడడం పచ్చి అవకాసవాదమని నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) విమర్శించారు. బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana), ధర్మాన ప్రసాదరావులు (Dharmana Prasada Rao) నాడు శాసన సభ సాక్షిగా జగన్ రెడ్డిని విమర్శ చేసారు. కానీ ఇప్పుడు అదే మంత్రులు అందుకు భిన్నంగా పదవులను కాపాడుకోవడం కోసం అదే వ్యక్తిని పొగడటం విడ్డూరమని జనసేన పార్టీ (Janasena Party) రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ (Political affairs Committee Chairmen) నాదెండ్ల మనోహర్ అన్నారు.

ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా ఆలోచిస్తాడు.. తన సొంతం కోసం ఎలా మాట్లాడతాడు.. సామాన్యుడిని ఎందుకు పట్టించుకోడనే విషయాల గురించి లోతుగా మాట్లాడిన ఇద్దరు నేతలు ఇప్పుడు వింతగా మాట్లాడు తున్నారని నాదెండ్ల చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో సందేశం ఇచ్చారు.

ఉత్తరాంధ్ర అవకాశవాద రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వైసీపీ నాయకులుపైన ఉత్తరాంధ్ర రాజకీయాలపైనా కీలకమైన వ్యాఖ్యలు చేసారు. ‘‘ముందుగా చెప్పినట్లుగా జనవాణి (Janavani) కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర పరిధిలో విశాఖలో (Visakhapatnam) నిర్వహిస్తున్నాం. దీన్ని వాయిదా వేసుకోవాలని, ఆపాలని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. జనవాణి కార్యక్రమం గురించి వారికి అంతగా తెలిసి ఉండదు. వందల కిలోమీటర్ల నుంచి వచ్చి జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్’ని (Pawan Kalyan) కలిసి తమ సమస్యలను చెప్పుకోవడానికి మహిళలు, దివ్యాంగులు, పేదలు వస్తున్నారు. ఆయనకు తమ సమస్యను చెబితే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి బయటకు వస్తుందని సామాన్యులు భావిస్తున్నారు. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని అడ్డుకోవాలని, ఆపాలని కోరడం వివేకం కాదు. దీన్ని మంత్రులు, ప్రజాప్రతినిధులు గుర్తించాలి. ప్రభుత్వం పరిష్కరించని ఎన్నో సమస్యలు జనసేన దృష్టికి వస్తున్నాయి. దాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా విని, వాటిని పరిష్కరించేందుకు ఆయా శాఖలకు లేఖలు రాస్తున్నారు. ఇదో గొప్ప ప్రజా కార్యక్రమం. దీన్ని అడ్డుకోవడం వివేకము అనిపించుకోదు అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

పదవులు పొంది.. ఉత్తరాంధ్ర కు చేసిందేమిటి?

ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు, కీలక శాఖలను నిర్వర్తించారు. ప్రభుత్వంలో కీలక పదవులు పొందారు. అయినా ఈ నేతలకు ప్రజల అభ్యున్నతి, ప్రాంత అభివృద్ధి గుర్తు లేదు. ఇన్ని పదువులు అనుభవించి ఏ ప్రయోజనం..? ఇక్కడి ఉద్దానం ప్రాంత కిడ్నీ రోగుల సమస్యను అంతర్జాతీయంగా తీసుకెళ్ళారు. ఎందరో నిపుణులను తీసుకొచ్చి, ప్రజలకు ఆరోగ్య భరోసా నింపిన నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. రాష్ట్రంలోనే 40 శాతం మంది మత్స్యకారులు ఉత్తరాంధ్రలో నివసిస్తారు. వారికి సరైన బతుకు భరోసా లేక వేరే ప్రాంతాలకు వెళ్లి వలస కూలీలుగా జీవిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో వేటకు వెళ్లి ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు.

గిరిజన యూనివర్శిటీ ఏదీ.. వలసలకు అడ్డుకట్టేది

రాష్ట్ర విభజన తర్వాత ఉత్తరాంధ్రకు వచ్చిన గిరిజన యూనివర్శిటీ (Tribal University) ఏమయింది..? రూ.834 కోట్లతో యూనివర్శిటీ నిర్మాణంపై నోరు మెదపరు ఎందుకు..? గత ప్రభుత్వం రూ.10 కోట్ల ఖర్చు చేసి ప్రహరీ నిర్మించినా, ఇప్పటి వరకు దాని కోసం నిధులు తీసుకు రాలేకపోయారు. సుమారు 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే ఉత్తరాంధ్ర సుజల-స్రవంతి ప్రాజెక్టుకు (Sujala Sravanthi Project) ముచ్చటగా మూడోసారి జగన్ శంకుస్థాపన చేశారు. ఆ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు అతీగతీ లేదు. సాగునీటి రంగ కేటాయింపులు ఉత్తరాంధ్రకు లేవు అని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

వైసీపీకి చిత్తశుద్ధి లేదు

మూడు రాజధానుల (Three Capitals) మీద వైసీపీ నాయకత్వానికి చిత్తశుద్ధి ఉందా? ఉంటే స్వయంగా ముఖ్యమంత్రి శాసనసభ వేదికగా తీర్మానాలు, చట్టాలను ప్రవేశపెట్టారు. వీటిని జగన్ ప్రభుత్వం ఎందుకు ఉపసంహరించుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రాంతాల మధ్య విబేధాలు సృష్టించి, ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చి దానిలో చలి కాచుకోవాలనేది వైసీపీ ప్రభుత్వ పన్నాగం. గతంలోనూ పచ్చటి అమలాపురంలోనూ ఇదే పద్ధతిలో విధ్వసం చేయాలని చూశారు. అక్కడి ప్రజలు దీన్ని గమనించారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా దీనిపై చైతన్యవంతులు కావాలి. ఎన్నో పోరాటాల వేదిక ఉత్తరాంధ్ర. ఎందరో గొప్ప నాయకులను అందించిన నేల. అలాంటి నాయకుల స్ఫూర్తిని ప్రజలు అందిపుచ్చుకొని వైసీపీ కుటిల పన్నాగాలను తిప్పికొట్టాలి అని నాదెండ్ల మనోహర్ ప్రజలకు పిలుపు నిచ్చారు.

అక్కడ భూములు, ప్రకృతి ప్రసాదించిన సహజ ఆస్తులపై కన్నేసి మాత్రమే వీరు కొత్తరాగం అందుకుంటున్నారు తప్ప మరేమీ కాదని గుర్తుంచుకోవాలి. ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. గత ప్రభుత్వం విశాఖ భూముల కుంభకోణంపై ఏర్పాటు చేసిన సిట్ రిపోర్టును బయటపెట్టాలి. మీలో మీరే గొడవలు పడి.. సామాన్యులకు సైతం విశాఖలో జరిగిన భూ కుంభకోణాల గురించి చెబుతున్నారు అంటూ మనోహర్ విస్మయాన్ని వ్యక్తం చేసారు.

అమరనాథ్ జనసేన మీద ప్రెస్ మీట్లు పెట్టడానికా మీకు మంత్రి పదవి?

చిన్న వయసులోనే మంత్రి పదవి పొందిన ఉత్తరాంధ్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnadh) మొదట తన శాఖ పనితీరు మీద దృష్టి పెట్టాలి. రోజువారీ ప్రెస్ మీట్లు పెట్టి జనసేన పార్టీని తిట్టడానికి మాత్రమే మీకు పదవి ఇచ్చారా..? కీలకమైన ఐటీ శాఖ మంత్రిగా ఉన్న అమర్నాథ్ అనవసర విమర్శలు చేయడం పద్ధతి కాదు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం మీద దృష్టి నిలపాలి. గతంలో ఏపీఐఐసీ పరిశ్రమల కోసం రైతుల నుంచి తీసుకున్న భూములను నేడు హౌసింగ్ ప్రాజెక్టుల కోసం అమ్ముతామని, రూ.400 కోట్ల రూపాయలు సేకరిస్తామని చెబుతుంటే ఎందుకు మీరు స్పందించరు..? అంటూ జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.

ఐటీ టవర్లన్నీ ఖాళీ.. ఇదీ మీ ప్రొగ్రెస్ రిపోర్ట్ (YCP Progress Report)

మధురవాడలోని మిలీనియం టవర్ – ఎ ప్రాంగణంలో 2 లక్షల చదరపు అడుగులు నిర్మిస్తే, కేవలం లక్ష చదరపు అడుగులే ఉపయోగిస్తున్నారు. అలాగే మిలీనియం ‘టవర్ బీ’లో 1.13 లక్షల చదరపు అడుగులు నిర్మిస్తే, ఒక చదరపు అడుగు ఉపయోగించు కోవడానికి ఐటీ కంపెనీలు రాలేదు. కాకినాడలోనూ 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇంక్యూబేషన్ సెంటర్ ఏర్పాటు చేసినా ఫలితం లేదు. అంతా ఖాళీగా ఉంది. తిరుపతిలో ఐటీ టవర్ 50 వేల చదరపు అడుగులతో ఏర్పాటు చేసినా అక్కడకు ఎవరూ రాలేదు. అచ్యుతాపురంలో 5,500 చదరపు అడుగులతో ఏర్పాటు చేసిన భవనం ఖాళీగా ఉంది. బొబ్బిలిలో 27 వేల చదరపు అడుగులతో భవన నిర్మాణం జరిగితే, అక్కడా ఒక ఐటీ పరిశ్రమ ఇప్పటికీ రాలేదు. ఖాళీగా ఉందని ఆ బిల్డింగ్ ను వాడుకొంటామని రెవెన్యూ శాఖ అడగలేదా? శ్రీకాకుళం 2,500 వేల చదరపు అడుగులతో నిర్మించిన భవనాన్ని ఎవరికీ కేటాయించలేదు అని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

అక్టోబరు 1వ తేదీ నుంచి విశాఖకు ఇన్ఫోసిస్ వస్తుందని ప్రచారాలు చేశారు.. ఈ రోజు అక్టోబరు 13. ఇన్ఫోసిస్ రాలేదు. వేయి మంది ఉద్యోగులతో ఇన్ఫోసిస్ ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు. అందులో ఏదీ కొత్త ఉద్యోగం కాదు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ఇన్ఫోసిన్ అక్కడ తాత్కాలిక కార్యాలయం ప్రారంభించాలి అనుకుంటే.. దానికి కూడా ప్రభుత్వం తగిన విధంగా స్పందింకపోతే, వారు దాన్ని ప్రారంభించలేదు. ఇదీ మీ ప్రొగ్రెస్ రిపోర్టు గుడివాడ అమర్నాథ్ గారు. వీటిపై ముందు మీరు దృష్టి నిలపండి అంటూ నాదెండ్ల మనోహర్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసారు.

క్షేత్రస్థాయికి పవన్ కళ్యాణ్

ప్రజల సమస్యలను, వారి వేదనలు వినడానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయికి వస్తున్నారు. ఆయన ఉత్తరాంధ్ర సమస్యల మీద ప్రత్యేక దృష్టి నిలుపుతారు. సామాన్యుల కోసం ఆయన నిలబడతారు. ఇక్కడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా, ప్రజలకు అండగా మాట్లాడతారు. మీ పార్టీ కార్యక్రమాలను మీరు చేసుకోండి.. జనసేన పార్టీ కార్యక్రమాలను మేం చేసుకుంటాం. రెచ్చగొట్టేలా మట్లాడటం ఎవరికీ మంచిది కాదు. సామాన్యుడికి అండగా నిలబడి… మీ భూదందాలు, దౌర్జన్యాలు మేం ప్రజలకు వివరిస్తాం. ప్రజల తరఫున పోరాటం చేస్తాం.. 15వ తేదీన వైసీపీ గర్జన చేయబోయే ముందు… సిట్ రిపోర్టు (SIT Report) బహిర్గతం చేయాలని ముఖ్యమంత్రిని వైసీపీ ప్రజాప్రతినిధులు కోరాలి’’ అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

వైసిపి మంత్రులకు మాకినీడి శేషుకుమారి స్ట్రాంగ్ కౌంటర్!!

మరణించిన జనసైనికుని కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేత