Tenali Janasena PartyTenali Janasena Party

ఓటేసిన పాపానికి ప్రజలకు కరెంటు షాకులా
సంక్షేమం పేరుతో ఇచ్చేది గోరంత. వాసులు చేసేది మాత్రం రెట్టింపు
వైసీపీ ప్రభుత్వంలో 35 శాతం నిరుద్యోగిత
రైతుల వద్ద నుంచీ లంచాలు గుంజుతున్నారు
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి
వైసీపీ పాలనకు చరమ గీతం పాడే సమయం వచ్చింది
తెనాలి బహిరంగ సభలో నాదెండ్ల మనోహర్

‘ప్రజలను కలవడు.. సమస్యలు తెలుసుకోడు.. హెలికాప్టర్ లో వస్తాడు.. పరదాల మాటున పర్యటన చేసి వెళ్ళిపోతాడు. ఇదే ఏపీ ముఖ్యమంత్రికి (AP CM Jagan) తెలుసు అని జనసేన పార్టీ (Janasena Party) పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) విమర్శించారు. రాష్ట్ర ప్రజలు మనస్ఫూర్తిగా నమ్మి వైసీపీకి (YCP) ఓటేస్తే.. పదే పదే కరెంట్ షాక్ లు కొట్టిస్తోంది. విద్యుత్ ఛార్జీల బాదుడుకు సామాన్యులు నలిగిపోతున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు ఏదో చేస్తాడని నమ్మి ఓట్లు వేసిన జనానికి ఈ పాలనలో నరకం కనిపిస్తోంది అని నాదెండ్ల మనోహర్ జగన్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

ఇక నమ్మింది చాలు.. మోసపోయింది చాలు. ఇక ఈ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి రామలింగేశ్వరపేటలో ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు జనసేనలో చేరారు. తెనాలి మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్, తెనాలి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాసు గౌరీ శంకర్, తెనాలి తాలూకా తాపీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దొడ్డంపూడి నాగరాజు, వైకుంఠపురం ఆలయ ట్రస్టు మాజీ బోర్డు మెంబర్లు పాలడుగు లక్ష్మీనారాయణ, కేతావత్ బాలు నాయక్, అత్తోట గ్రామ వైసీపీ అధ్యక్షులు యర్రు వెంకటేశ్వరరావు తదితరులు మనోహర్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి మనోహర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం పని చేయాలని కోరారు.

ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేసారు. “ప్రతిపక్ష నాయకుడిగా తెనాలిలో 13 రోజులు పాటు పాదయాత్ర లో జగన్ రెడ్డి తిరిగితే ఆశ్చర్యం వేసింది. ముఖ్యమంత్రి అయ్యాక ఇదే వ్యక్తి 23 కిలో మీటర్ల దూరంలోని తెనాలికి హెలికాప్టర్ లో వచ్చారు. కనీసం ప్రజలను కలుసుకున్నది, మాట్లాడింది కూడా లేదు. ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి, బటన్ నొక్కుతున్నామని చెబుతూ కరెంట్ షాక్ కొట్టిస్తున్న ప్రభుత్వం ఇది అని మనోహర్ అన్నారు.

రైతులు దగ్గర లంచాలు డిమాండ్ చేస్తున్న సర్కారు ఇది. పంట అమ్ముకుందామన్నా, ఈ క్రాప్ నమోదు చేసుకుందామన్నా లంచాలు డిమాండ్ చేస్తున్నారు. సంక్షేమం పేరుతో ఒక చేత్తో ఇచ్చి, పన్నుల పేరుతో రెండు చేతులతో లాగేసుకుంటున్న ప్రభుత్వం గురించి ప్రజలు ఆలోచించాలి. ప్రజల దగ్గర్నుంచి చెత్త పనులు కూడా వసూలు చేస్తూ, ఆ డబ్బులను పక్కదారి పట్టిస్తున్నారు అని నాదెండ్ల విమర్శించారు.

స్టిక్కర్ సీఎం

సమస్య తీర్చమని అడిగితే ఇంటికి స్టిక్కర్లు వేస్తున్నారు. మన ఇంటి ఆస్తులు మీద ముఖ్యమంత్రి ఫోటో అతికిస్తున్నారు. భూమి పాస్ పుస్తకాల మీద సీఎం ఫోటోనే.. సర్వే రాళ్ల మీద ముఖ్యమంత్రి ఫోటోనే. ఒక వ్యక్తి వల్ల ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో ప్రజలు ఆలోచించాలి. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా చంపేసి పాలన సాగిస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెట్టినందుకు వారం రోజులు పాటు నిర్బంధించి యువకులను హింస పెడుతున్నారు. తనకు వ్యతిరేకంగా ఉన్న వారిపై ప్రభుత్వం కక్ష కడుతోంది అని మనోహర్ అన్నారు.

యువతకు ఉద్యోగాలు ఎక్కడ?

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 35% రాష్ట్ర యువత నిరుద్యోగంలోకి వెళ్లిపోయారు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమ లేదు.. ఇచ్చిన ఉద్యోగం లేదు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఆ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో కూడా తెలియదు. ఇద్దరు ఆడపిల్లలు పుడితే గతంలో లక్ష రూపాయలు ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చాం. దానికి అప్పట్లోనే బాండ్లు తయారు చేసి లబ్ధిదారులకు ఇచ్చాం. మహిళలు దాచుకున్న సొమ్ముకే, ప్రభుత్వం మరికాస్త జోడించి ఆ డబ్బులు పిల్లల ఖాతాలో వేసేది. ఇటీవల మెచ్యూర్ అయిన బాండ్లకు డబ్బులు ఇవ్వమని అడిగితే అలాంటి పథకం ఏది లేదని ప్రభుత్వం చెబుతోంది. అంత గొప్ప పథకాన్ని ప్రభుత్వం ఎవరికి తెలియకుండానే ఆపేసింది అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

మేం ఎవరిని దూషించం.. తెనాలి అభివృద్ధిని మాత్రమే కోరుకుంటాం

మాకు ఎవరి మీద ద్వేషం లేదు. కోపం లేదు. అందరినీ కలుపుకొని వెళ్తాం. మాకు కావాల్సింది తెనాలి నియోజక వర్గం అభివృద్ధి మాత్రమే. పదవి ఒక బాధ్యత. ఆ బాధ్యతను మర్చిపోతే కచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. విజయవాడ, గుంటూరు వంటి నగరాలను తలపించేలా తెనాలిని అభివృద్ధి చేయాలని తలపోశాం. రూ.130 కోట్లతో తెనాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం కోసం నిధులు విడుదల చేయిస్తే, తర్వాత ఆ పనులను కనీసం చక్కబెట్టుకోలేకపోయారు. బకింగ్ హామ్ కెనాల్ సామర్ధ్యం 2000 క్యూసెక్కులు అయితే, దానిలో పూడిక పేరుకుపోయి కనీసం 600 క్యూసెక్కుల నీరు కూడా రావడం లేదు. తెనాలిలో గతంలో ప్రతి వార్డుకు రూ. 2 లక్షలు నిధులు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఏ వార్డుకు నిధులు వచ్చిందే లేదు. పెదరావూరు నుంచి మంగళగిరి వరకు నాలుగు లైన్ల రహదారి వచ్చేస్తోందని రూ.200 కోట్ల నిధులు విడుదలయ్యాయని చెప్పిన ఎమ్మెల్యే తర్వాత దాని గురించి మాట్లాడింది లేదు అని మనోహర్ తెలిపారు.

ఆటోనగర్ గతంలో ఎంతో సుందరంగా కనిపించేది. ఇప్పుడు ఆటోనగర్ లో వేస్తున్న రోడ్లు అక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే బాధ కలుగుతుంది. అమరావతి రాజధాని అవుతుందని ఒకప్పుడు తెనాలిలో ఎకరా రూ. కోటి పలికే భూములు సైతం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం కొనేవారు లేరు. అవసరం ఉండి భూములు అమ్ముదామని రైతులు భావించినా అసలు ధర లేదు. గతంలో నేను శాసనసభ్యుడుగా ఉన్న సమయంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేశాం. తెనాలికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలన్నదే నా అభిమతం. గతంలో జరిగిన అభివృద్ధి, ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధి ప్రజలు పరిశీలించాలి. మళ్లీ తెనాలిని అద్భుతమైన అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలి అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

బహిరంగ సభలో పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ బేగ్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవికాంత్, పార్టీ కొల్లిపర మండల అధ్యక్షుడు వెంకయ్య నాయుడు, తెనాలి మండల అధ్యక్షుడు మధుబాబు తదితరులు పాల్గొన్నారు.