విశాఖపట్నంలో పాలకపక్షం పెట్టిన అక్రమ కేసుల (False police cases) వల్ల జైలు పాలైన తొమ్మిది మంది నాయకులు ఈ రోజు బెయిల్ ద్వారా (Bail to Janasena Leaders) బయటకు వచ్చారు. ఇది ఎంతో సంతోషించదగ్గ పరిణామని జనసేన పార్టీ (Janasena Party) అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జైలులో ఉన్న సమయంలో ఆ నాయకుల కుటుంబ సభ్యులు ఎంత ఆందోళనకు లోనయ్యారో నాకు తెలుసు.
తప్పుడు కేసు మూలంగా జైలుకు వెళ్ళిన కోన తాతారావు, సుందరపు విజయ్ కుమార్, సందీప్ పంచకర్ల, పి.వి.ఎస్.ఎస్.ఎన్.రాజు, పీతల మూర్తి యాదవ్, కొల్లు రూప, జి.శ్రీనివాస పట్నాయక్, చిట్టిబిల్లి శ్రీను, రాయపురెడ్డి కృష్ణలు మనోధైర్యంతో ఉన్నారు. వారి కోసం న్యాయ పోరాటం చేసిన పార్టీ లీగల్ సెల్ సభ్యులకు, వీరికి అండగా నిలిచిన న్యాయవాదులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ ఆ ప్రకటనలో తెలిపారు.
విశాఖపట్నంలో అక్రమాలు, తప్పుడు వ్యవహారాలకు పాల్పడుతున్నదెవరో ఆ నగర ప్రజలకే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ వాస్తవాలు బయటకు వస్తాయనే జనసేన పార్టీ చేపట్టిన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు విశాఖ విమానాశ్రయంలో (Vizag airport) ప్రభుత్వ ప్రాయోజిత డ్రామా సృష్టించారు. అక్కడి ఘటనల్లో మా పార్టీ నాయకులను, వీర మహిళలను, జన సైనికులను ఇరికించారు. అరెస్టులను కూడా నియమనిబంధనలకు నీళ్లొదిలి చేశారు. మహిళలను అర్థరాత్రి వేళ దౌర్జన్యంగా అరెస్టు చేశారు. ఈ అంశంపై కచ్చితంగా న్యాయపోరాటం చేయాలని, అందుకు అనుగుణంగా కేసులు దాఖలు చేయాలని లీగల్ సెల్ సభ్యులకు సూచించాము అని పవన్ కళ్యాణ్ వివరించారు.