భారాస ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేసిన సుదీర్ఘ విచారణ అనంతరం బయటకు రావడంతో ఉత్కంఠకు తెరపడింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సోమవారం పది గంటలపాటు మద్యం కేసులో భారాస (BRS) ఎమ్మెల్సీ కవితను విచారించింది. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా విచారించింది. అలా సాగిన విచారణలో అధికారులు ఆమెకు 14 ప్రశ్నలు సంధించినట్లు సమాచారం వస్తున్నది. మంగళవారం ఉదయం 11 గంటలకు మళ్లీ విచారణకు రావాలని ఈడీ కవితని ఆదేశించింది.
దిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారు చేయించుకొని అనుచిత లబ్ధి పొందేందుకు దక్షిణ గ్రూపు ద్వారా AAP నేతలకు రూ.100 కోట్ల ముడుపులు చెల్లించారని.. అలానే ఇండోస్పిరిట్ సంస్థ రూ.192 కోట్ల ప్రయోజనం పొందిందన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
ఇవే ఆరోపణలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్నది. ఇందులో అరుణ్ రామచంద్రపిళ్లైను కవితకు బినామీగా వ్యవహరించారన్న ఆరోపణతో అరెస్ట్ చేసి 14 రోజులపాటు కస్టడీలోకి తీసుకొని విచారించింది. తర్వాత ఎమ్మెల్సీ కవితను ఈ నెల 11న తొలిసారి 8 గంటలపాటు విచారణ చేసింది మరల సోమవారం 10 గంటలపాటు ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు.
మళ్లీ మంగళవారం హాజరుకావాలని పేర్కొన్నారు. దీంతో ఆమె సోమవారం ఉదయం కేసీఆర్ అధికారిక నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి కవిత వచ్చారు. కవిత వెంట ఆమె భర్త అనిల్ కూడా ఈడీ కార్యాలయం వరకు వచ్చారు. పలు విషయాలపై కవిత నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ విచారణ అనంతరం కవిత్తా బయటికొచ్చి విజయచిహ్నం చూపుతూ అభిమానులకు అభివాదం చేశారు.