S V PrasadS V Prasad

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ (Chief Secretary) ఎస్వీ ప్రసాద్‌ (S V Prasad) కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఏస్వీ ప్రసాద్ ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తరువాత ఆయన 1975 ఐఏఎస్‌ బ్యాచ్‌కు ఎన్నిక అయ్యారు.

నెల్లూరు జిల్లా సబ్‌కలెక్టర్‌గా ఎస్వీ ప్రసాద్‌ తన ఉద్యోగాన్ని ప్రారంభించారు. ఆ తరువాత 1982లో కడప, 1985లో విశాఖపట్నం జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత పలు ప్రభుత్వ శాఖలు, విభాగాలకు ఛైర్మన్‌, కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి స్థాయి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు ఎదిగారు.

2010లో రోశయ్య (Rosaiah) సీఎంగా ఉన్నప్పుడు సీఎస్‌గా (CS) పనిచేశారు. తన కంటే 20 మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులున్నా ఎస్వీ ప్రసాద్‌నే సీఎస్‌ పోస్టు వరించింది. కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) సీఎంగా ఉన్నప్పుడు కూడా ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఆ తరువాత చీఫ్ విజిలెన్సు కమీషనర్ గా కూడా పనిచేశారు.

పదేళ్లకు పైగా ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద ఎస్వీ ప్రసాద్‌ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి (Nedurimalli Janardhan Reddy), కోట్ల విజయభాస్కర్‌రెడ్డి (Vijaya Bhaskara Reddy), చంద్రబాబు (Chandra babu) హయాంలో ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు.

ఏస్వీ ప్రసాద్ గొప్ప మేధావి. నిగర్వి. గొప్ప మానవతావాది. అన్నిటికీ మించి నిజాయితీ పరుడు. మచ్చ లేని జీవితాన్నిఏస్వీ ప్రసాద్ చివరి వరకు కొనసాగించారు.

ఎస్వీ ప్రసాద్‌ మృతిపట్ల పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నారు.

One thought on “మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్వీ ప్రసాద్ మృతి”

Comments are closed.