భావితరాల మార్పు కోసం అంటూ మొదలు పెట్టిన సాగర మధనం (Sagara Madhanam) నుండి వచ్చిన గరళాన్ని (కాలకూట విషాన్ని) పరమేశ్వరుడు (గరళకంఠుడు) తీసికొన్నాడు. తదనంతరం వచ్చిన ఐరావతం, కామధేనువు, కల్పవృక్షం, అమృతం లాంటి వాటికోసం రాక్షసులు, దేవతలు మధ్య జరిగిన కొట్లాటల అనంతరం అది దేవతలు వశం అయ్యింది.
అయితే గరళాన్ని శివుడు ఇష్టపూర్వకంగా తీసికొన్నాడు కాని కష్ట పూర్వకంగా కాదు. ఒకరు చేయలేని పని, ఒకరు చేయలేని కార్యం చేసి సృష్టిని కొనసాగించడమే శివతత్వం. ఆదిభిక్షువు ఎప్ప్పుడు ట్రెండ్ ని సెట్ చేస్తాడు గాని ట్రెండ్ ని ఫాలో కాడు.
మార్పు కోసం ఎన్డీయే (NDA) కూటమి అంటూ వచ్చిన ప్రభుత్వంలోని అప్రాధాన్య శాఖలను (ప్రజల దృష్టిలో) గరళకంఠుడి తత్వాన్ని పుణికి పుచ్చుకొన్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీసికొన్నారు. తతిమ్మా హోమ్, ఫైనాన్స్, భారీ పరిశ్రమలు, రెవిన్యూ, భారీ జలవనరులు లాంటి కీ పోస్టులను టీడీపీ సోదరులు తీసికొన్నారు.
అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ తన శాఖలను తాను ఇష్టపూర్వకంగా తీసికొన్నాడు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా; అటవీ – పర్యావరణం, శాస్త్ర & సాంకేతికత శాఖలను ఎంచుకొని మరీ తీసికొన్నారు. ఇక్కడ చంద్రబాబు తప్పు ఉన్నట్లు ఏమీ లేదు. నాటి పరమేశ్వరుడులా నేటి పవనేశ్వరుడు కూడా ఒకరికి ఇష్టం లేనివి తీసికొని మార్పు కోసం మౌనం వహించడమే పవన్ లో ఉన్న శివతత్వం.
సహజంగా ఫైనాన్స్, రెవిన్యూ, హోమ్, రోడ్లు భవనాలు, భారీ పరిశ్రమలు లాంటి శాఖలు మంచి డిమాండ్ ఉన్న పోర్టుఫోలియోలు. గతంలో వైస్సార్ నుండి గ్రామీణాభివృద్ధి శాఖ తీసికొన్న డి శ్రీనివాస్ గాని, కిరణ్ కుమార్ రెడ్డి నుండి గ్రామీణాభివృద్ధి తీసికొన్న కన్నా లక్ష్మీనారాయణలు నిత్యం అసంతృప్తితో ఉండేవారు అని విన్నా. వారు ఇద్దరే కాదు మరెవ్వరు కూడా గ్రామీణ నేపధ్యం ఉన్న శాఖలను తీసికోవడానికి ఇష్టపడరు.
కాని జనసేనాని పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో కాడు. గ్రామీణ నేపధ్యం ఉన్న శాఖలను కావాలని తీసికొని ట్రెండ్ సెట్ చేసాడు. గ్రామీణ ప్రజలకు ఏదో చేయాలి. పంచాయితీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. చిక్కి శల్యమవుతున్న పర్యావరణాన్ని ఎంతో కొంత కాపాడాలి, అడవులను మింగే రాక్షస మూకలను అంతం చెయ్యాలి అనే తపనే పవన్ లో కనపడుతున్నది. పవన్ కళ్యాణ్ లో ఉన్న శివతత్వంనే గరళం లాంటి గ్రామీణ శాఖలను తీసుకోవడానికి స్ఫూర్తి నిచ్చింది.
గ్రామీణ నేపధ్యం ఉన్న కీలక శాఖలను తీసికోవడం ఉత్తమం. వ్యహాత్మకమే. అయితే ఈ తీసికొన్న శాఖల ద్వారా మీరు తీసికొచ్చే విప్లవాత్మక మార్పు ద్వారా మాత్రమే జనసేన పునాదులను పటిష్టం అవ్వే అవకాశం ఉంది. అప్పుడే రేపటి సంపూర్ణ మార్పుకోసం వచ్చే జనసేనకు దిక్చుచి అవుతుంది.
ఆలోచించండి… సేనాని చేతిలో ఉన్న గ్రామీణ శాఖలతో అడవులు, పర్యావరణం, గ్రామాలూ సంపూర్ణ సుభిక్షం కావాలి. అప్పుడే గరళకంఠుని చేతిలో గ్రామీణం సుభిక్షం అవుతుంది. (It’s from Akshara Satyam)