Nadendla at VizagNadendla at Vizag

గెలుస్తామన్న ధీమా ఉంటే చీకటి జీవోలు ఎందుకు?
విపక్షాలు ప్రజలకు చేరువ కావడంతో సీఎంకి భయం
అభద్రతా భావంతోనే నిరంకుశ జీవోలు
ప్రజా సమస్యలపై గళం విప్పే అంశంలో జనసేన వెనక్కి తగ్గేదేలే
యువశక్తి సభకు గత నెలలోనే అనుమతి కోరాం
జగన్ రెడ్డికి సహకారం- జనసేన ఓటు చీల్చేందుకే బీఆర్ఎస్
విశాఖలో మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్

ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు చేరువ కావడంతో వైసీపీ ప్రభుత్వానికి (YCP Government) నష్టం వస్తుందని గ్రహించి జగన్ ప్రభుత్వం (Jagan Government) చీకటి జీవోలు తెస్తున్నది. ఈ చీకటి జీవోలతో విపక్షాల సభలు, సమావేశాల మీద వైసీపీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నదని జనసేన పార్టీ (Janasena Party) పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) స్పష్టం చేశారు. 175 స్థానాలు గెలిచేస్తామన్న నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి ఎందుకు నిరంకుశ జీవోలు తీసుకు వస్తున్నారని నాదెండ్ల ప్రశ్నించారు. సీఎం అభద్రతా భావంతో, భయంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి (CM) అనుమతి కావాలంటే మనం ఏ దేశంలో ఉన్నామో అర్ధం కావడం లేదన్నారు. బాధ్యతగల ప్రతిపక్ష పార్టీలుగా (Opposition parties) ప్రజా సమస్యలపై గళం విప్పీ బాధ్యత మాకుందని.. ఆ విషయంలో జనసేన పార్టీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి (Jagan Reddy) సహకారం అందించి.. జనసేన పార్టీకి వచ్చే ఓటు చీల్చేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ ముసుగులో డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. రణస్థలంలో జరిగే జనసేన యువశక్తి సభ ఏర్పాట్ల పర్యవేక్షణ నిమిత్తం విశాఖ చేరుకున్న నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 

ముఖ్యమంత్రి హెలీకాప్టర్లతో తిరుగుతారు. ప్రజలుక ట్టిన పన్నుల డబ్బుతో సభలు ఏర్పాటు చేసి ఆ సభల్ని రాజకీయ వేదికగా వాడుకుంటారు. ప్రజల్లో విపక్షాలకు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక.. ప్రతిపక్షాల ప్రస్థానాన్ని ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నాం అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

ప్రజల దృష్టి మళ్ళించడం కోసమే జీవో

ఈ ముఖ్యమంత్రిది డైవర్షన్ విధానం. పెన్షన్లు లక్షల్లో తొలగించారు.. లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చి ఆందోళనకి గురి చేస్తున్నారు. ఎక్కడ చూసినా ప్రజలకి మౌలిక సదుపాయాల కల్పన లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక స్థితి దిగజారింది. వీటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు జీవో 1 తెచ్చారు. ముఖ్యమంత్రి ప్రజల గురించి ఆలోచించే వ్యక్తీ అయితే ఎందుకు ప్రజల వద్దకు రాడు. వేల మంది పోలీసుల్ని పెట్టుకుని కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? లబ్దిదారులతో నిర్వహించే సభలకు లబ్దిదారుల్ని బలవంతంగా తరలించే పరిస్థితి ఏంటి అని నాదెండ్ల ప్రశ్నించారు?

ప్రజా సమస్యలపై గళం విప్పే హక్కు మాకుంది

ప్రతిపక్ష పార్టీలుగా ప్రజా సమస్యలపై గళం విప్పే బాధ్యత మాకుంది. ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. ఎన్ని ఒత్తిడులు తీసుకువచ్చినా.. చట్టాలను గౌరవిస్తాం.. ప్రజల్ని గౌరవిస్తాం.. ప్రజల తరఫున గొంతు వినిపించడం మా బాధ్యతగా ముందుకు వెళ్తాం. బటన్లు నొక్కేసి అభివృద్ధి జరిగిపోతోందని చెప్పడం.. ప్రజలు సభలకు రాకపోతే ఫించన్లు తీసేస్తాం అని బెదిరించడం. ఈ మధ్య ముఖ్యమంత్రిని కలిస్తే లక్ష వస్తాయని కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. దివ్యాంగులు కారాపితే రూ. లక్ష ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారు… ఇదే ముఖ్యమంత్రి మూడున్న రేళ్లుగా వారి సమస్యల మీద ఎందుకు స్పందించలేదని నాదెండ్ల మనోహర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు?

అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ రూ. లక్ష ఆర్ధిక సాయం చేస్తుంటే సభలపై ఆంక్షలు ఎందుకు? మీటింగులు రద్దు చేసుకోవాలి.. అనుమతులు లేవు అని జిల్లా ఎస్పీలతో ఫోన్లు చేసి బెదిరింపులు ఎందుకు.. మీరేం చేసినా జనసేన పార్టీ వెనుకడుగు వేయదని నాదెండ్ల మనోహర్ స్పష్టంగా చెప్పారు.

ముఖ్యమంత్రి భయంతోనే ఇలా చేస్తున్నారు

ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి సిద్ధమయ్యారు. అది చూసి అభద్రతా భావంతో ముఖ్యమంత్రి ఇలా ప్రవర్తిస్తున్నారు. జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేసినా జాగ్రత్తగా చేస్తుంది. ప్రతి ఒక్కరినీ ఇంటికి పంపి విధంగా ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వ పని తీరు పట్ల ప్రజల్లో ఆందోళన మొదలయ్యిందనే అలాంటి డ్రైవర్షన్లకు పాల్పడుతున్నారు. జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేసినా చట్టానికి లోబడే చేస్తుంది. యువశక్తి కార్యక్రమానికి అనుమతి కోరుతూ డిసెంబర్ 23వ తేదీన డీజీపీకి లేఖ రాశాం. డిసెంబర్ 24వ తేదీన మా నాయకులు శ్రీకాకుళం జిల్లా ఎస్పీని కలిసి అనుమతి కోరారు. రూట్ మ్యాప్స్, భద్రత ఏర్పాట్లు, సౌకర్యాల వివరాలు తెలియచేశాం. మా కార్యక్రమానికి పోలీసులు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండదని నమ్ముతున్నాం.

25 ఎకరాల ప్రైవేటు భూమిలో ఏర్పాట్లు చేస్తున్నాం. చట్టానికి లోబడి, చట్టాన్ని గౌరవించే విధంగా ఎక్కడా ఎవరికీ ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. యువశక్తి వేదికపై దాదాపు 100 మంది యువతకు ఉపన్యసించే అవకాశం కల్పిస్తున్నాం. ఈ ప్రాంత సంస్కృతి, కళాకారులు, నైపుణ్యం గల యువతకు ఇది మంచి అవకాశం. ఒక్క రోజులో ‘ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,400 ఫోన్ కాల్స్ వచ్చాయి. 1200 మెయిల్స్ వచ్చాయి. అందులో రాయలసీమ ప్రాంతానికి చెందిన రైతులు, డాక్టర్లు సైతం ఉన్నారు. వీరందర్నీ ప్రోత్సహించే ఏర్పాటు చేస్తున్నాం. యువశక్తి కార్యక్రమాన్ని అద్భుతమైన యూత్ ఫెస్టివల్ లాగా నిర్వహిస్తాం. వారం రోజుల పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటించి అందుకు సంబంధించిన ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షిస్తాం అని నాదెండ్ల మనోహర్ వివరించారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్దంగా పాలన లేదు

బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం.. యువతకు భరోసా నింపే విధంగా యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఉత్తరాంధ్ర నుంచి యువత వలసలు పోని పరిస్థితులు తీసుకురావాలి. ఉత్తరాంధ్ర ప్రాంతానికి అభవృద్ధి తీసుకురావాలి. కేవలం ఈ ప్రాంత వెనుకబాటుపై నాయకులు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి ప్రణాళికాబద్దంగా జరగడం లేదని తెలుస్తోంది. యువత నూతనోత్సాహంతో కార్యక్రమాన్ని నిర్వహించుకునే విధంగా మా నాయకులు అద్భుతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు అడుగడుగునా సమస్యలే దర్శనమిచ్చాయి. ఉపాధి అవకాశాల కోసం యువత వలసలుపోతున్నారు. తీర ప్రాంత ప్రజలు ఇప్పటికీ తాగునీటి కోసం అల్లాడుతున్న పరిస్థితి. లక్షల సంఖ్యలో మత్స్యకారులు గుజరాత్ లాంటి ప్రాంతాలకు వలసలు పోవడం బాధ కలిగించింది. ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యాలు, అక్రమ మైనింగ్, క్షేత్ర స్థాయిలో ప్రజలు పడుతున్న కష్టాలపై ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తున్నారు. కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన సాగడం లేదు. ప్రతిపక్షంగా మా కార్యక్రమాలు మేము చేసుకుంటుంటే ప్రభుత్వం అడుగడుగునా అడ్డు పడే ప్రయత్నాలు చేస్తోందని నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేసారు.

జగన్ రెడ్డి కోసమే బీఆర్ఎస్

రాజకీయాల్లో నిజాయితీతో కూడిన ఆలోచనా విధానం ఉండాలి. మీటింగులు పెట్టుకుని జాయినింగులు చేసుకుంటే అయిపోదు. చాలా అంశాల్లో స్పష్టత అవసరం. కేసీఆర్ పార్టీ ఏర్పాటు చేసి రాష్ట్రంలో చీలిక తీసుకువచ్చారు. 2014 నుంచి వారి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. జగన్ రెడ్డి చేసిన అతి పెద్ద మోసం విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కి దక్కాల్సిన ఎన్నో ఆస్తులు ఆ ప్రభుత్వానికి ధారాదత్తం చేయడం. అందుకే జనసేన పార్టీకి వస్తున్న ఆదరణ చూసి వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి సహకారం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారు బంగారు తెలంగాణ కోసం నిలబడ్డారు. బంగారు ఆంధ్రప్రదేశ్ కోసం కాదు. రాజకీయాల్లో నిజాయతీతో కూడిన ఆలోచనా విధానం ఉండాలి.. మీటింగులు పెట్టుకుని జాయినింగులు చేసుకుంటే అయిపోదు అని నాదెండ్ల మనోహర్ విరుచుకు పడ్డారు.

కృష్ణా-గోదావరి జలాల విషయంలో మీ ప్రణాళిక ఏంటో చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి ఆలోచనతో వచ్చి సేవా కార్యక్రమాలు చేయగలరో చెప్పాలి. కేసీఆర్ గారు ఓవర్ నైట్ పార్టీ పెట్టి దేశంలో ఉన్న అన్ని సమస్యల మీద పోరాడుతాను అంటున్నారు. మీ విధానాల్లో నిజాయతీ ఏది? ఆంధ్రప్రదేశ్ కి మీరు ఎలా ఉపయోగపడతారో చెప్పాలని నాదెండ్ల మనోహర్ అన్నారు.

మీడియా సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, నియోజక వర్గాల ఇంచార్జీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, వీర మహిళ ప్రాంతీయ సమన్వయ కర్తలు పాల్గొన్నారు.

బ్రిటిష్ కాలం నాటి చట్టం ద్వారా ఆంక్షలా: నాదెండ్ల మనోహర్

Spread the love