Modi Pawan and babuModi Pawan and babu

జనసేనాని (Janasenani) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ని బీజేపీ అధినాయకులు (BJP Leaders), ఎన్డీయే మిత్రపక్షాలు (NDA Meeting) ఆత్మీయ సమావేశం పేరుతో ఢిల్లీ (Delhi) పిలిపించుకోవటం జరిగింది. దీనితో రాబోయే ఎన్నికలలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో పవన్ చరిష్మాను ఉపయోగించుకోవటం ద్వారా లబ్ధిపొందాలనేదే బీజేపీ ధ్యేయమనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా చెప్పవచ్చు. ఈ మీటింగుతోబీజేపీ, జనసేన పొత్తు అధికారంగా ఖాయమైనట్లే అని భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో జనసేన పొత్తు బీజేపీతో పెట్టుకుంటే లాభమా లేక నష్టమా? బీజేపీతో పొత్తు పెట్టుకోవటం కంటే తెలుగుదేశంతో పొత్తు లాభమా? లేక ఒంటరిగా వెళ్ళితే లాభమా అనేదే ఒక్కసారి చర్చిద్దాం. ఇదే నేటి రాజకీయ విశ్లేషణ.

జనసేన బీజేపీ పొత్తు పొత్తు పెట్టుకొంటే…

బీజేపీతో ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రయాణం కొనసాగించదలచుకొంటే వచ్చే లాభనష్టాలను మొదటిగా బేరీజు వేసుకుందాం.

2019 ఎన్నికలలో వివిధ పార్టీలకు పడిన ఓట్లశాతం పరిశీలిస్తే బీజేపీకి 1శాతం ఓట్లులోపుమాత్రమే పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో కూడ బీజేపీకి ఓట్లశాతం అంత పెరిగినట్లు లేదు. ఈ ఎన్నికలలో జనసేన బీజేపీతో పొత్తువలన రెండుపార్టీల ఓట్ల బలం మరో రెండు శాతం పెరగవచ్చు. ఓట్లు పెంచుకోటానికి గాని, జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించటానికి గాని బీజేపీ రాష్ట్ర శాఖ చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రమే.

రాష్ట్ర బిజెపి పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓడించాలనే పట్టుదలతో పనిచేయకపోటానికి ముఖ్యకారణాలలో ఒకటి జగన్మోహన్రెడ్డితో కేంద్రంతో ఉన్న సత్సంభంధాలు మాత్రమే అనాలి. అయితే నీతివంతమైన పరిపాలన అందిస్తున్న ప్రధానమంత్రి మోడీ కి దేశంలో ఉన్న పరపతి కొంతవరకు బీజేపీ జనసేన కూటమికి ఉపయోగపడే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం నేరుగా రాష్ట్రాలకు అందిస్తున్న సహకారం, ఉపాధి, గ్రాంట్ల పేర ప్రతి సంవత్సరం రాష్ట్రానికి అందుతున్న ఆర్ధిక సహకారం ప్రచారం చేసుకోగల్గితే కొంతవరకు లబ్ధికలిగే అవకాశం ఉంది.

జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో దేశంలో మరోసారి మోడీగారి ప్రభుత్వం గద్దె నెక్కే అవకాశం ఉండటం వలన 2024లో ఏర్పడే రాష్ట్ర ప్రభుత్వం బీజేపీతో సఖ్యత కలిగి ఉంటే కేంద్రప్రభుత్వ సహకారాన్ని పొంది రాష్ట్రాన్ని అభివృద్ధిపరచటానికి వీలవుతుంది.

అయితే రాష్ట్ర విభజనల హామీ ప్రకారం రాష్ట్రానికి కేంద్రాన్నుండి దక్కవలసియున్న ప్రత్యేకహోదా, వెనకబడియున్న ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్యాకేజీలు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం చేయటానికి పూనుకోటం, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణం యొక్క నత్తనడక అనే అంశాలుపై ఎన్నికలలోపు పాజిటివ్ గా స్పందించకపోతే ఇతర ప్రతిపక్షాలు అధికారపక్షంతో సహా బీజేపీ వైఫల్యాలను ఎండగట్టటం ద్వారా బీజేపీ జనసేన కూటమికి నష్టం కలుగజేసే అవకాశం ఉంది. బీజేపీ మత రాజకీయాలు కూడ నష్టం కలుగజేస్తాయి. లాభనష్టాలు రెండూ బేరీజు వేసుకుంటే రాష్ట్రంలో అధికారం చేబట్టడానికి బీజేపీతో పొత్తు జనసేనకు ఎంతవరకు తోడ్పడుతుంతో కాలమే చెబుతుంది. జనసేన, బీజేపీల పొత్తు, జనసేన కన్నా బీజేపీయే లబ్ధిపొందే అవకాశమే ఎక్కువ అని చెప్పక తప్పదు.

జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకొంటే…

ఇక తెలుగుదేశంతో పొత్తు విషయానికి వస్తే గత 14 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వకాలంలో చేబట్టియున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వల్ల తెలుగుదేశంపై కొంతవరకు ప్రజలకున్న సంతృప్తి, మీడియా సపోర్టు, చంద్రబాబునాయుడుకున్న అనుభవం, ఎలక్షనీరింగు, ఆర్ధిక సహకారం లాంటి అంశాలన్నీ తెలుగుదేశంతో పొత్తువలన జనసేనకు లాభం కలుగచేయవచ్చు, ముఖ్యంగా తెలుగుదేశంతో పొత్తువలన ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా చేయటం వలన జనసేన అభ్యర్థులను కొంతవరకు నెగ్గించుకోగలిగి, శాసనసభాసభ్యులుగా తీర్చిదిద్దటం ద్వారా కొద్దిమంది జనసైనికులను సంతృప్తిపరచవచ్చు.

అయితే 14 సంవత్సరాల తెలుగుదేశం పరిపాలనాకాలంలో తెలుగుదేశంపై పడిన అవినీతి ముద్ర, కులముద్ర, రంగా హత్యాలాంటి హత్యా రాజకీయాలు మూలంగా తెలుగుదేశంపై పడిన నీలినీడ పొత్తులో భాగస్వామి అయిన జనసేనపై కూడ పడే అవకాశం ఉంది. చంద్రబాబునాయు వయోభారం, నారా లోకేష్ యొక్క అనుభవరాహిత్యం కొంతవరకు నష్టాన్ని చేకూరుస్థాయి.

కాపులకు రిజర్వేషన్స్ కల్పించటంలో చిత్తశుద్ధి లోపించటం, బి.సి.లకు వారి జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్స్ కల్పించాలనే వారి చిరకాల డిమాండుపై స్పందించకపోవటం, ప్రధానమంత్రి మోడీకి బద్ధశత్రువుగా మిగిలిపోవటం కూడ తెలుగుదేశంతో పొత్తు నష్టాన్నే చేకూరుస్తాయి.

వైసీపీ పార్టీ లబ్ధిపొందే ప్రమాదం

పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని జనసైనికులు కోరుకుంటుంటే చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు. పొత్తులో భాగంగా అధికారాన్ని జనసేన తెలుగుదేశంపార్టీలు మధ్య సమానంగా పంచుకోనిచో, అసంతృప్తిదార్లయిన రెండుపార్టీల మద్దతుదార్ల ఓట్లు అటునుండి యిటు, యిటు నుండి అటు ట్రాన్స్ఫర్ కాక మధ్యస్థలంలో వైసీపీ పార్టీ లబ్ధిపొందే ప్రమాదాన్ని కాదనలేం.

ముఖ్యమంత్రి పదవి పూర్తికాలం చంద్రబాబుకి కట్టబెట్టినచో చంద్రబాబు దగ్గర పవన్ కల్యాణ్ ప్యాకేజీ తీసుకొని, కాపుకులాన్ని తాకట్టుపెట్టాడనే వైసీపీ యొక్క దుష్టప్రచారానికి బలం చేకూరటంవలన జనసేన నష్టపడే అవకాశం ఉంది. అధికారంలో భాగంగా ఎక్కువ అసెంబ్లీ సీట్లు తెలుగుదేశం కైవసం అయినచో, సదరు సీట్లలో సంవత్సరాల తరబడి జనసేనను నమ్ముకుని పనిచేస్తున్న జనసైనికులు, తాము ఆశిస్తున్న సీట్లు దక్కక, అసంతృప్తితో ధిక్కరించి పొత్తు ధర్మానికి గండికొట్టటం వలన కూడ జనసేన కూటమి నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది.

రాబోయే ఎన్నికలలో అధికారం, పదవులు ఉభయులకు గౌరవప్రదంగా పంచుకోగల్గి శాసనసభా స్థానాలు, జనసేన, తెలుగుదేశం చెరిసమానంగా పంచుకోగలిగి, లేక మరో ఆచరణ యోగ్యమైన ప్రతిపాదనను (Alternative Proposal) ను పరిశీలించి అమలు జరిపినపుడే ఇటు జనసైనికులు, అటు తెలుగుదేశం కార్యకర్తలు సమానంగా సంతృప్తిపొందగల్గినప్పుడు మాత్రమే ఓట్ల ట్రాన్స్ఫర్ సక్రమంగా జరిగి ఈ కూటమి విజయాన్ని సాధించి వైసీపీని ఓడించగల్గుతుంది. లేనిచో పొత్తు నష్టమే కాని లాభించదు.

అవినీతి చక్రవర్తిగా జగన్ రెడ్డి

ఇప్పటికే వైసీపీపై ప్రజలలో అసంతృప్తి పెరిగి, గ్రాఫ్ పడిపోయి, ఓట్లశాతం 51శాతం నుండి 40శాతం వరకు పడిపోయి ఉన్నమాట వాస్తవం. ప్రభుత్వధనాన్ని దోచుకో దాచుకో అంటూ అవినీతి చక్రవర్తిగా జగన్మోహన్రెడ్డి ప్రజలలో ముద్రపడిన మాట నిజం. పన్నులు పెరిగి, నిత్యావసర వస్తువులు ధరలు మిన్నంటి సతమతమవుతున్న మిడిల్ క్లాస్వారు ఒక ప్రక్క, నవరత్న సంక్షేమ ఫలాలు సరిఅయిన టైములో అందడం లేదు.

ఉపాధి కరువై, అర్హులైన చాలామందికి అందక సతమతమవుతున్న అణగారిన వర్గాలు, సరిఅయిన కిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఉన్నారు. అలానే రిజర్వేషన్స్ సౌకర్యం అందక నష్టపోతున్న కాపులు, ఇలా అన్ని వర్గాలలోను అసంతృప్తితో ఉన్నారు. వీరు అంతా పరిపాలకులలో మార్పు కోరుకుంటున్న ప్రజానీకానికి తోడు, పవన్ కల్యాణ్ యొక్క నీతివంతమైన, వామపక్ష భావాలుతో కూడిన వ్యక్తిత్వం నచ్చి, సంక్షేమం, అభివృద్ధి సమానపాళ్ళలో అందిస్తామనే భరోసాతో జనసేన ఒంటరిగా వెళ్లాలని కోరుకొంటున్నారు. జనసేన ఒంటరిగా పోటీకి వెళ్ళినా ప్రజలు జనసేనానిని నెగ్గించటానికి సిద్ధంగా ఉన్నమాట నిజం.

సంక్షేమం ప్రాతిపదికన కూడ నెగ్గలేని పరిస్థితి గ్రహించిన వై.ఎస్.ఆర్.పార్టీ ఆఖరు అస్త్రంగా ఓట్లకు నోట్లు యిచ్చి ఓటర్లను లొంగచేసుకోవటానికి ప్రయత్నం చేయవచ్చు. వై.ఎస్.ఆర్. పార్టీ యిచ్చే డబ్బులు తీసుకున్నా, జనసేన అభ్యర్థులు, కొద్దో గొప్పో యిచ్చినా, యివ్వకపోయినా జనసేనపార్టీ అభ్యర్థులుకు ఓట్లు వేయటానికే సిద్ధంగా ఉన్నారు మార్పు కోరుకుంటున్న ఓటర్లు. ఇది నిజం.

వారాహియాత్ర అన్నవరంలో మొదలయిన నుండి 2వ యాత్ర పూర్తయ్యేవరకు జనసేన బహిరంగసభలకు హాజరవుతున్న అశేష ప్రజానీకాన్ని చూసిన, పవన్కల్యాణ్ ఉపన్యాసాలకు వారి స్పందన చూసినా జనసేన ప్రభంజనం ఎలా ఉందో తెలుస్తూనే ఉంది. కాపులతో సహా బి.సి.లు, ఎస్.సి.లుకు దఫదఫాలుగా రాజ్యాధికారంలో ముఖ్యమంత్రి పదవులు దక్కాలనే పవన్ కల్యాణ్ నినాదం బి.సి., ఎస్.సి., ఎస్.టి. వర్గాల్లో
జోష్ నింపిన మాట వాస్తవం.

జోగయ్య చూపుతున్న ప్రత్యామ్న్యాయం ఏమిటి?

ఇలాంటి పరిస్థితులో ప్రజలు సరికొత్త ప్రత్యామ్యానాన్ని కోరుకుంటున్న సమయంలో ఇప్పటికే ఓటర్ల సంఖ్య 25శాతానికి దగ్గరలో ఉన్న జనసేన, బీజేపీ కూటమి ఇతర పార్టీలు పొత్తులపై ఆధారపడక, ఎస్సీ, బీసీలను కూడ కలుపుకుని ప్రయాణం చేసినా, సంస్థాగతంగా బలమైన చర్యలు తీసుకోగల్గి వారాహి యాత్ర ముగించేనాటికి ఓటర్ల సంఖ్య 40శాతం దాటుతుంది. అప్పుడు అధికారం చేజిక్కించుకోటం ఖాయమనే చెప్పాలి.

ప్రతిపక్షాల ఓట్లు చీలకూడదనే ఒకే ఒక ధ్యేయంతో కలిసి ప్రయాణం చేయటానికి అవకాశం ఉన్నట్టు జరుగుతున్న పరిణామాలు గమనించినా, కలిసి ప్రయాణం చేయాలని పవన్ కల్యాణ్ వీడని పట్టు చూసినా, ఉభయుల గౌరవానికి భంగం కలుగకుండా ఎన్నికల ముందే జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి ప్రయాణం చేయటం ద్వారా జనసేన కూటమి రాజ్యాధికారం చేజిక్కించుకోటం ఖాయమనే చెప్పాలి.

జనసేన స్థానం ఎలా ఉండాలి అంటే?

పొత్తులో భాగంగా జనసేన కనీసం 75 శాసనసభాసీట్లలో పోటీ పెట్టి 50 సీట్లను కైవసం చేసుకుని జనసేన, తెలుగుదేశం, బీజేపీ గౌరవప్రదమైన హోదాలతో అధికారాన్ని పంచుకుని ప్రజారంజకమైన హామీలతో కూడిన కామన్ మేనిఫెస్టోతో ప్రజా పరిపాలన ఏర్పాటుచేయటం ఖాయం. జనసైనికులు ధైర్యంతో ప్రయాణించటంతోనే ఈ పొత్తుల కథకు మంచి ముగింపు వస్తుందని ఆశించవచ్చు. శుభం భూయాత్.

కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో పవన్ కళ్యాణ్ భేటీ

 

Spread the love