జనసేనపై వైసీపీ విష ప్రచారాలు
వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మడం మానేశారు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడినా, ప్రజలు అవాక్కు చేశారు
అధినేత పవన్ కళ్యాణ్ అడుగులే మనకు మార్గదర్శకం
నాయకుడిని నమ్మి బలంగా అడుగేద్దాం
జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
విశాఖపట్నం జిల్లా జనసేన కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల మనోహర్
రాబోయే ఎన్నికల్లో గెలిచేది కచ్చితంగా జనసేన ప్రభుత్వమే (Janasena Government). దీనిలో ఎవరు సందేహ పడాల్సిన అవసరం లేదు. అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేని, ఒక్క పొరపాటు కూడా చేయని జనసేన (Janasena Party) ప్రభుత్వాన్ని తీసుకువస్తాం. వ్యవస్థలన్నీ పటిష్టంగా పనిచేసే, ప్రజలు బాగోగులు చూసే బ్యూరోక్రసిని తయారు చేస్తాం అని నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) స్పష్టం చేసారు.
జన సైనికుల్లో (Janasainiks) ఉన్న చిన్న చిన్న అరమరికలు చక్కదిద్దుకుంటే జనసేన పార్టీ అంతా అద్భుతమైన పార్టీ మరొకటి కనిపించదు. జనసేన పార్టీలో పనిచేసే ప్రతి జనసైనికుడు నిస్వార్ధంగా దేశం కోసం ఏదో చేయాలి అన్న తపనతో పని చేయడం గొప్ప విషయం. నాయకుడి సిద్ధాంతాలను బలంగా ఆచరించే ఒక గొప్ప సమూహం జనసేన పార్టీకే సొంతం అని నాదెండ్ల మనోహర్ అన్నారు.
రాజకీయాల్లో ఒక నిర్దిష్టమైన మార్పు, ప్రజలు బతుకుల్లో వెలుగులు నింపాలనే ఆశయం కోసం పని చేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న మనమంతా ప్రజా క్షేమం కోసం ఆయన తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. ఎవరో ఏదో చెప్పారని… ఏదో వాట్సప్ గ్రూపులో సమాచారం వచ్చిందని గాభరాపడొద్దు’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి లాంటి గొప్ప మనసున్న నాయకుడు ఎవరూ కనిపించరు. అలాంటి గొప్ప నాయకుడుని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది.. కీలకంగా జనసైనికులపై ఉందని నాదెండ్ల తెలిపారు.
ఆదివారం విశాఖపట్నంలో నగర నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఎన్నికలు సమీపించే తరుణంలో అధికార పార్టీ సోషల్ మీడియా వేదికగా అనేక పుకార్లు పుట్టిస్తారు. జనసేన పార్టీ రాజకీయ విధానాలపై గందరగోళం సృష్టించడానికి ఇప్పటికే భారీగా నెల వేతనాలకు ఉద్యోగులను నియమించింది. జనసేన పార్టీ మీద బలమైన విష ప్రచారం జరగబోతోంది. కార్యకర్తల్లో గందరగోళం సృష్టించే అవకాశం ఉంది. దీనిని ఇప్పటి నుంచే ప్రతి జన సైనికుడు తిప్పి కొట్టాలి. నిలువరించాలి అని నాదెండ్ల మనోహర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు మాత్రమే ప్రతి జనసైనికుడికి వేదవాక్కు కావాలి. పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్న అది పూర్తిస్థాయిలో పార్టీ బలోపేతం మీద, ప్రజా క్షేమం మీద మాత్రమే ఉంటుంది. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తు ఉంచుకోండి అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ప్రతి నెలా ఉత్తరాంధ్ర జిల్లాల సమావేశాలు
ఉత్తరాంధ్ర జిల్లాల్లో సమస్యల మీద, పార్టీ స్థితిగతుల మీద పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ నాయకత్వాన్ని బలంగా తీర్చిదిద్దాలి అన్నది ఆయన అభిమతం. ఉత్తరాంధ్రలోని కుటుంబ పాలనను మార్చాలి అన్నది పవన్ కళ్యాణ్ సంకల్పం. దీనిలో భాగంగా జనసేన పార్టీ బలంగా కృషి చేస్తుంది. ఇకనుంచి ప్రతి నెల ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ స్థితిగతులు, సమస్యల మీద ప్రత్యేక సమావేశం ఉంటుంది. ప్రతి జన సైనికుడు, వీర మహిళ ఏం చేస్తున్నారు అన్నది కచ్చితంగా పవన్ కళ్యాణ్ గమనిస్తున్నారు. అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
జనసేన పార్టీ క్రమక్రమంగా బలం పుంజుకుంటుంది అని రాజకీయ పార్టీలకు అర్ధం అవుతోంది. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు సైతం ఉత్తరాంధ్రలో గణనీయంగా పెరిగాయి. జనసేన పార్టీకి క్రమశిక్షణే బలం. దానిని ప్రతి ఒక్కరూ స్వీయ ప్రమాణాలతో పాటించాలి. పార్టీని అస్తిత్వపరిచే శక్తుల మీద జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సమష్టిగా పోరాడాలి అని మనోహర్ అన్నారు.
సీఎం బటన్లు నొక్కితే అవినీతి ఆగుతుందా?
ముఖ్యమంత్రి ప్రతి సమావేశంలోనూ బటన్లు నొక్కుతున్నాను అని గొప్పలు చెప్పుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం వైసీపీ నాయకుల అవినీతి దెబ్బకు ప్రజలు అల్లాడుతున్నారు. ప్రతి పనికి రేటు కట్టి, అధికార పార్టీ నాయకులు, సిబ్బంది ప్రజల వద్ద అందిన కాడికి దోచుకుంటున్నారు. విశాఖ సమ్మిట్ కోసం ప్రభుత్వం రూ. 300 కోట్లు ఖర్చుపెడితే కొత్త పరిశ్రమలు వచ్చింది ఏమీ లేదు. నిధులను తాత్కాలిక పనులకు ఇష్టానుసారం వాడి అవినీతికి పాల్పడ్డారు. ప్రజాధనాన్ని ఈ ప్రభుత్వం ఇష్టానుసారం దుబారా చేస్తోంది. ప్రతి పనిలోనూ అంతులేని అవినీతి జరుగుతోంది. దీనిపై ఎక్కడికక్కడ జనసైనికులు, వీర మహిళలు చేస్తున్న పోరాటం గొప్పది. వారికి జనసేన పార్టీ కచ్చితంగా అండగా నిలుస్తుంది అంటూ వైసీపీ ప్రభుత్వంపై నాదెండ్ల విరుచుకు పడ్డారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినా… అవాక్కయ్యారు
ఇటీవల జరిగిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలు అన్ని ఇన్ని కావు. డ్రైవర్లను, తోట పని చేసుకునే వాళ్లను, కూలీలను సైతం ఉపాధ్యాయులుగా చూపించి ఓటర్లుగా నమోదు చేయించింది. అయినా ఇక్కడి ప్రజలు ఇచ్చిన ఫలితం వైసీపీ నాయకులను అవాక్కు చేసింది. ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత పెరిగిపోయిందో చూసి వైసీపీ పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. బలమైన మార్పు కోసం కొత్త నాయకత్వం కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నం కచ్చితంగా విజయం సాధిస్తుందని నాదెండ్ల తెలిపారు.
పార్టీలో పని చేసేందుకు ఎవరు వచ్చినా ఒక ఎన్నిక కోసం వద్దు.. 25 సంవత్సరాల రాజకీయ ప్రయాణం కోసం అయితే రండి అని ఖరాకండిగా చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్. పార్టీలో మేమే నాయకులం.. మాదే ఈ సీటు అంటూ చెప్పుకునే వారి మాటలను జనసైనికులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి నియోజకవర్గం మీద పవన్ కళ్యాణ్’కి ప్రత్యేకమైన విజన్ ఉంది. పవన్ కళ్యాణ్ ఎవరిని నిలబెట్టినా, వారిలో పవన్ కళ్యాణ్’ని చూసుకొని పని చేసే గొప్ప జన సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ” అని నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఈ ఆత్మీయ సమావేశంలో విశాఖపట్నం జిల్లా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బలంగా నిలబడిన వీర మహిళలకు సన్మానం
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖపట్నంలో వైసీపీ నాయకులు పోలింగ్ స్టేషన్లు ఆక్రమించి, దుర్మార్గానికి పాల్పడిన చర్యను బలంగా ఎదుర్కొని తిప్పికొట్టిన వీర మహిళలను మనోహర్ సన్మానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అగ్రనేతల
దురగాతాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం, తర్వాత వీర మహిళలంతా కోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదుకు ఆదేశించడంతో వారి న్యాయపోరాటాన్ని మనోహర్ నిండు మనసుతో అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. వీర మహిళలు శ్రీమతి అమరారపు దుర్గ, శ్రీమతి వై. కళ, శ్రీమతి వి. యజ్ఞశ్రీ, శ్రీమతి తెలుగు లక్ష్మిలను మనోహర్ శాలువలు కప్పి సన్మానించారు.
జనసేన పార్టీలో పలువురి చేరిక
మన్యం జిల్లా నుంచి వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు అరకు పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ గంగులయ్య ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. వారిని సాదరంగా మనోహర్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ మన్యం జిల్లా అధ్యక్షులు నిమ్మక సింహాచలంతోపాటు పలువురు గిరిజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నేతలు, కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ నుంచి పలువురు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు పనిచేయాలని నాదెండ్ల మనోహర్ వారికి
సూచించారు.