ప్రియమైన ముద్రగడ పద్మనాభం గారికి,
మీ అక్షర సత్యం విలపిస్తూ మీకు రాస్తున్నది ఏమనగా….
గురువు గారు (Mudragada Padmanabham)! నేను గుర్తు రావడం లేదా. గత రెండు నెలల్లో అనేక పర్యాయాలు మీ గుమ్మాలు చుట్టూ ప్రదక్షణలు చేసి, చేసి మీతో చర్చలు జరిపి జరిపి, విఫలుడిని అయ్యి వెనుతిరిగి వచ్చిన వాడిని (Akshara Satyam). నేను మీ ఇంటి చుట్టూ తిరిగింది మీ కుటుంబం ఆహ్వానం మేరకే అనేది మీరు మరిచి పోతారు అని నేను అనుకోవడం లేదు. గురూజీ తప్పు చేస్తున్నారు. మీకు మనః సాక్షి ఉంటే మరొక్క సారి ఆలోచించండి.
మీరు ఉత్తరం రాయడానికి రెండు రోజులు ముందు కూడా మీ ఆఫీస్ లో సుమారు మూడున్నర గంటలపాటు మీ ప్రతిరూపాలతో చర్చలు జరిపినవాడిని. అవ్వా! ఇంత స్థిరత్వం లేనివాడినా నీ జాతి నిన్ను గుండెల్లో పెట్టుకొని మోసింది.
నేను మీ చుట్టూ ప్రదక్షణలు చేసింది నా స్వార్ధం కోసం కాదండి అయ్యా. మీరు అంటుండేవారు కదా మీ జాతి మీ జాతి అని. ఆ మీ జాతి కోసమే నేను మీ గుమ్మాలు చుట్టూ తిరిగా.
అయినా మీ జాతి, నా జాతి ఒక్కటే అని నమ్మి, మీ అందరి చుట్టూ తిరిగి తిరిగి మోసపోయిన సత్తికాలపు అక్షర సత్యాన్ని. ఇంతకీ మీ జాతిని ఎక్కడ వదిలేసారో తెలుసా సార్ మీకు. ద్వారంపూడి ద్వారాలు, సప్లై చేసిన లారీలు, ప్రింట్ చేసిన పోస్టరులు తప్ప మీకు మీ జాతి నేడు కనిపించడం లేదు? సిగ్గు సిగ్గు అని నేడు అదే మీ జాతి కన్నీరు పెట్టుకొంటున్నది అనేది మీకు కనిపిస్తున్నదా?.
అయినా మీకు ద్వారంపూడి లాంటివారు తప్ప ఈ పేద జాతి ఎందుకు గుర్తు ఉండాలి లెండి? మీ జాతికి మీ పై ప్రేమతో కంచాలు కొట్టడం తప్ప లారీలు, కారులు సప్లై చేసే స్థోమత మీ జాతికి గాని నాకు గాని లేదుగా. గుర్తు ఉండదు లెండీ.
నేను గురువు గారు. మీరు ఉద్యమాలు చేసేటప్పుడు యూనివర్సిటీలో క్లాసులు ఎగ్గొట్టి మీ కూడా తిరిగివాడిని. మీ ఉద్యమానికి మద్దతుగా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి బాబు ప్రభుత్వాన్ని తూర్పార పట్టిన సత్తెకాలపు సత్యాన్ని సార్. ఏదో ఆ చనువుతో, ఆవేదనతో మీకు రాస్తున్నా గురువు గారు.
నేను గుర్తు ఉన్నానా సార్…
అయినా మీకు మాలాంటివాళ్ళం ఎందుకు గుర్తు ఉంటాం సార్. మేము పేద కాపులమే గాని మీ అవసరాలకు ఆదుకొనే డబ్బున్నోళ్ళం కాదు కదా సారూ. ఇంతకీ మా ప్రేమని అవినీతి ద్వారాలకు తాకట్టు పెట్టడం సబబేనా అని అనిపిస్తున్నది కానీ మీరు మా జాతికి తండ్రి లాటివారు అని భావిస్తున్నాం. అందుకే ఇప్పటికీ పెద్దాయన అనే మిమ్ములను సంబోధిస్తున్నాను. మారతారు అని విశ్వసిస్తున్నాం.
మీరు నాలాంటి సత్తికాలపు సత్యాన్ని ఎప్పుడో మరిచి పోయే ఉంటారు సార్. గుర్తు పెట్టుకోవడానికి మేము ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, భూమన కరుణాకర రెడ్డి, లేదా బొడ్డు భాస్కర రామారావు లేదా మాగంటి రవీంద్రనాధ్ చౌదరి లాంటి పెద్దవాళ్ళం కాదు కదా.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మీరు రాసిన ఉత్తరం గురించి మాట్లాడడం కోసం ఈ అక్షర విలాపం రాస్తున్నా సార్. పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ అధినేత అంటే మీకు కోపం వస్తుంది అనుకొంటా. ఎందుకంటే మీరు తప్ప ఎవ్వరు రాజకీయ నాయకులూ కాదు కదా? సినిమా నటుడు అని అనే అంటాను లెండి గురూజీ. లేక పోతే మీరు ఈ ఉత్తరం కూడా చదవరు. అయినా నా చాదస్తం గాని నా ఉత్తరాలు చదవడానికి నాకేమైనా తాడేపల్లిలో పాలస్’లు ఉన్నాయా సారూ?
రాజన్న, చంద్రన్న కుటుంబాలు తప్ప మరెవ్వరు కనిపించరా?
అయినా పవన్ కళ్యాణ్’ని నాయకుడిగా గుర్తించడానికి మీరు చిరంజీవి గారినే నాడు నాయకుడిగా గుర్తించలేదు? దాసరి నారాయణ రావు గారినే మీరు నాయకుడిగా గుర్తించలేదు? మీ జీవితంలో రాజన్న కుటుంబాన్ని, చంద్రన్న కుటుంబాన్ని తప్ప మరొక్కరిని నాయకుడిగా గుర్తించి మీరు కలిసి పనిచేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా సారూ?
మీ దృష్టిలో మీరు. మీ తరువాత వైస్సార్, వైస్సార్ తనయుడు, వైస్సార్ మనుమలు అలానే చంద్రబాబులు మాత్రమే నాయకులు? మిగిలినవారు పురుగులతో సమానం అనుకొంటా? మిమ్ములను బాధిస్తే క్షమించండి.
ఇంతకీ విషయం ఏమిటంటే గురువు గారు:
మీరు రాసిన ఉత్తరం వల్ల జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి నష్టం వచ్చింది అనేది నా బాధ కాదు సార్. నాలుగు దశాబ్దాల మన జాతి చరిత్ర ఉద్యమాల పేరుతో నాశనం అయ్యింది. ఇప్పుడిప్పుడే రాజ్యాధికారం విలువ తెలిసికోవడం మొదలు పెట్టారు మన అణగారిన వర్గాల వాళ్ళు. అయినా నా పిచ్చి గాని మీరు రాజన్న కుటుంబం గురించి తప్ప మీ జాతికోసం ఆలోచించింది ఎప్పుడు లెండి అని అందరూ అంటుంటే గుండె తరుక్కు పోతోంది పెద్దాయనా.
రాజ్యాధికార సాధనకు ఐక్యమవుతున్న ఈ తరుణంలో జనసేనానిని రిజర్వేషన్లు ఉద్యమాలు చేయమని ఉత్తరాలు రాసారు. గాని రాజ్యాధికార సాధనకు ప్రయత్నం చెయ్యి. నీ వెనుక నేను ఉన్నాను అని మీరు రాయలేక పోయారు. ఇది మా జాతి చేసికొన్న దురదృష్టం అని ఏడవడం తప్పు ఈ సత్తెకాలపు అక్షర సత్యం ఏమి చేయగలడు?
మీరు ఉద్యమాలు చేయమన్నప్పుడల్లా చేసాం సారూ. మీరు అడగకపోయినా ప్రెస్ మీట్లు పెట్టాం సార్. మీరు మంచాలు దిగిరమ్మన్నప్పుడల్లా దిగి వచ్చాము. కంచాలు కొట్టమంటే కొట్టాం. నాలుగు దశాబ్దాలు మీ చుట్టూ తిరిగాం. ఈ ఒక్కసారికి మా రాజ్యాధికార సాధనకు గాను మాకు మాట సాయం చేయండి అని మీ ఇంటి చుట్టూ తిరిగి, తిరిగి మోసపోయిన సత్తేకాలపు అక్షర సత్యాన్ని సార్.
నిన్నమీరు రాసిన ఉత్తరం ముమ్మాటికీ తప్పు సారూ. ఉత్తరం మీరే రాశారా లేక ఎవరో రాసిన ఉత్తరంపై మీరు చదవకుండా సంతకం చేసారో తెలీదు కానీ జాతిని మరో నలబై సంవత్సరాలు వెన్నక్కి మీ ఉత్తరం తీసికొని పోయింది. మీకు బాధ అనిపించక పోవచ్చు ఎందుకంటే మీ జాతి వేరు, మీ ద్వారాలు వేరు. మీ యజమాలు వేరు అయి ఉండవచ్చు?
మకిలి పట్టిన మన కీర్తిని ఎక్కడ పారేసుకొన్నారో తెలుసా?
ఉత్తరాలు రాసే హక్కు మీకు ఉంది. కానీ ఆ ఉత్తరాలపై సంతకాలు చేసేటప్పుడు అయినా మీ పిల్లలకు కాస్త అయినా చూపి సంతకం చేయడం మంచిదేమో. ఇది మకిలి పట్టిన మీ కీర్తిని కాపాడుకోవడం కోసం అని గమనించండి. అయినా ఇంకెక్కడి కీర్తి లెండి. కీర్తిని ద్వారంపూడి ద్వారాల వద్ద పారేసికొన్నారు అనుకొంటా?
గమనిక: అణగారిన వర్గాల నాయకులూ ఎవ్వరు అయినా సరే మీ పంధాలోనే వెళితే నేడు మీకు పట్టిన గతే రేపు వారికి కూడా రావడం తధ్యం. ఇదే అక్షర సత్యం.
ఆలోచించండి…. ఉత్తరం పేరుతో నిన్న మీరు రాసిన ఉత్తరాన్ని అణగారిన వర్గాలు క్షమిస్తాయేమోగాని చరిత్ర మాత్రం అస్సలు క్షమించదు.
ఇట్లు మీ వీరాభిమాని
సత్తెకాలపు అక్షర సత్యం