ఉమ్మడి కృష్ణా జిల్లా కు చెందిన ప్రముఖ న్యాయవాది మత్తి వెంకటేశ్వరరావుకు (Mathi Venkateswara Rao) ఉత్తమ న్యాయవాది (Best advocate) పురస్కారం లభించింది. ఆల్ ఇండియా తెలగ, కాపు, బలిజ సంఘం లోయర్ ట్యాంక్ బండ్ హైదరాబాద్ ఈ పురస్కారం ప్రకటించింది. ఈ అవార్డును ఆదివారం హైదరాబాద్లో అందచేయనున్నారు.
1959 జులై 1 న బీద వ్యవసాయ కుటుంబంలో దివిసీమలోని పెదప్రోలులో లక్ష్మి నరసయ్య సీతా మహాలక్ష్మి దంపతులకు జన్మించారు.పెదప్రోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తి చేసారు. అనంతరం మోపిదేవి, అవనిగడ్డ లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న చందాన బాల్యం నుంచి వెంకటేశ్వరరావు ఏక సంధాగ్రహి. చదువుకునే రోజుల్లోనే బంగారు పతకాలు సాధించారు.
అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఏ.పూర్తి చేసారు.బి.ఎల్., ఎం. ఏ., ఆంధ్రా విశ్వ విద్యాలయంలో పూర్తి చేసారు. మచలీపట్టణంలో సనక చలపతిరావు, బ్రహ్మయ్య నాయుడుల వద్ద జూనియర్ గా పని చేసారు. వేకనూరు లో జరిగిన ఐదు హత్యలు కేసులో వాదించారు.
అప్పట్లో ఈ కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఉమ్మడి హైకోర్టులో టి.బాలరెడ్డి, జస్టిస్ కె.సురేష్ రెడ్డిలతో సంయుక్తంగా ప్రాక్టీస్ చేసారు. స్వాతంత్ర సమర యోధుడు, మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు, ఆయన కుమారుడు మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్’లకు ఎన్నికల చీఫ్ ఏజెంట్’గా పనిచేసారు.
చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి కృష్ణా జిల్లా లీగల్ సెల్ చైర్మన్’గాను మరియు అవనిగడ్డ అసెంబ్లీ ఇన్చార్జిగా పని చేసారు. తదుపరి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా మత్తి వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ప్రస్తుతం జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు గా సేవలందిస్తున్నారు.
— టి వి గోవిందరావు, హై కోర్టు అడ్వకేట్, హైదరాబాద్