దర్శక రత్న (Darshaka Ratna), నిర్మాత, కధా రచయత, మాటల రచయిత, పాటల రచయిత, నటుడు, నిర్మాత, జర్నలిస్ట్, పత్రికాధిపతి, మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర సహాయ మంత్రి స్వర్గీయ డాక్టర్ దాసరి నారాయణ రావు (Dasari Narayana Rao) జన్మదినం సందర్భంగా చిరు జ్ఞాపిక.
సాధారణంగా సినీ రంగంలోగాని, రాజకీయ రంగంలోగాని లేదా మరే ఇతర ప్రముఖ వ్యక్తిని కలవాలన్నా రికమండేషన్, అప్పోయింట్మెంట్ వైగారా ప్రాసెస్ కొండవీటి చాంతాడులా ఉంటుంది. కానీ గురువు దాసరి గారిని కలవడానికి ఎటువంటి అప్పోయింట్మెంట్ సామాన్యులకు కూడా అవసరం ఉండేది కాదు. సామాన్యులకు, అభాగ్యులకు, అన్నార్తులకు దాసరి ద్వారములు ఎప్పుడు తెరిచే ఉండెడివి.
దాసరి ఇంటిలో నిత్యాన్నదానం
దాసరి గారి ఇంటికి వెళితే టిఫిన్ గాని, భోజనం గాని ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అక్కడ ఎవ్వరికి అడ్డు చెప్పరు అని చాలామంది దాసరి ఇంటికి వెళ్లి తినేవారు. వారి ఆఫీస్ స్టాఫ్ కూడా అటువంటి వారికి అడ్డు చెప్పేవారు కాదు. ఎవరైనా అడ్డు చెప్పిన దాసరి ఒప్పుకొనే వారు కాదు. భోజనాలు కోసం డబ్బు లేకపోతే అప్పు చేసి మరే తెచ్చి ఇస్తుండే వారు. ఇంటికి వచ్చిన వారికి లోటులేకుండా ఉండడం కోసం చేబదుళ్ళు చేసి వండి పెట్టిన రోజులు ఎన్నో ఉన్నాయి.
తాను ఎన్ని రకాలు తింటే అక్కడ ఉండే వారికి కూడా అన్ని రకాలు సమానంగా పెట్టమని గురువు గారు చెబుతూ ఉండేవారు. దాసరి గారి చివరి రోజుల వరకు కూడా తనతో పాటు కనీసం ఒక పది మందితో కలిసి భోజనం చేస్తుండే వారు. ఆయన ఎప్పుడు ఒక్కరే తినేవారు కాదు.
దాసరి గారి సతీమణి (Dasari Padma) గాని, వారి బిడ్డలు గాని వారి ఇంటిలో జరిగే నిత్య అన్నదాన కార్యక్రమానికి ఎప్పుడు అడ్డు చెప్పేవారు కాదు. దాసరి దగ్గర డబ్బులు లేని రోజుల్లో కూడా అప్పు చేసి అయన ఇస్తుండేవారు. మన ఇంటికి వచ్చినవారికి ఎప్పుడు ఏమి పెట్టకుండా పంప వద్దు అని ఆయన నిరంతరం చెబుతూ ఉండేవారు. అన్నదానం విషయంలో పొదుపు చేయకయ్యా. రేపటి రోజున నిన్ను కాపాడేది అన్నదానమే అని దాసరి గారు నాతో అనేక మార్లు అంటుండేవారు.
ఏ కష్టం వచ్చినా గురువు దాసరికి చెప్పుకొనే వారు
ఎవరికీ ఏమి కష్టం వచినా దాసరికి వెళ్లి చెప్పుకొంటూ ఉండేవారు. గురువుగారు వెంటనే తన సూట్ కేసు నుండి డబ్బులు తీసి అటువంటి వారికి ఇస్తుండేవారు. గురువు దాసరి మాకు డబ్బులు వద్దు అని అంటే ఉంచవయ్యా అని వారిని వారించి పంపిస్తుండేవారు. మొహమాటంతో ఎవరైనా చెప్పుకోలేక పోయినాగాని, ఆయనే స్వయంగా తెలిసికొని అటువంటి వారి అవసరాల కోసం డబ్బులు వారి ఇంటికి పంపిస్తూ ఉండేవారు.
సినీ, రాజకీయ, పత్రికారంగం లేదా సామాన్య ప్రజానీకంలో ఎవ్వరికైనా ఏ కష్టం వచ్చిన దాసరి గారి ఇంటికి వెళితే సరిపోతుంది అనే భరోసా అందరికి ఉండేది. దాసరి కూడా ఆవిధంగానే స్పందిస్తూ ఉండేవారు.
దాసరి భోళాశంకరుడు (Bhola Shankar). దాసరి సంపాదనలో ఎక్కువ భాగం మీడియా (Dasari Media) వల్ల వచ్చిన నష్టాలకి, తన దగ్గరికి వచ్చిన వారికి కస్టాలు తీర్చడానికి వెచ్చించారు అని చెప్పడం తప్పు కాదేమో. దాసరి దగ్గర లక్షలకి లక్షలు తీసికొని తమ అవసరాలు తీర్చుకొన్న వారు కూడా ఉన్నారు. తిరిగి ఇచ్చారా లేదా అనేది ఆ పంచభూతాలకు మా మేస్త్రి ఆత్మకే తెలుసనుకొంటా.
దాసరి గారి జాతకమో లేక పూర్వ జన్మ ఫలమో తెలీదు గాని. దాసరి పుట్టినది మే 04, అలానే ఆయన చని పోయినది కూడా మే 30. ఆయన చివరి పుట్టిన రోజున ఉదయం 6 గంటల నుండి ప్రారంభం అయ్యింది. ఉదయం ప్రారంభం అయిన భోజన, ఫలహారాలు రాత్రి 11 గంటల వరకు కొనసాగాయి అని ఉటంకించడం తప్పు కాదు అనుకొంటా.
ఆయన జీవితం చివరి వరకు మహారాజు వలే సాగిపోయింది. అనుబంధాలు, ఆప్యాయతలు అంతా భూటకం అంటూ దాసరి సినీ జీవితం ప్రారంభం అయ్యింది. బంధాలు, అనుబంధాలు అంతా బూటకమే అన్నట్లే తన చుట్టూ ఉన్న “పంచ భూతాలకు” లొంగి దాసరి నారాయణరావు (తనని వశపరచుకొన్న ఆ పంచ భూతాల పేర్లు అడగవద్దు), మేఘాలలో కలిసిపోయారు.
విష సర్పాల మధ్య దాసరి?
“నేను విష సర్పాల మధ్య సేదతీరుతున్నాను. నేను ఆ సర్పాలను ఆడిస్తున్నంత సేపు ఆ విషసర్పాలు నన్ను ఏమి చేయలేవు. నేను ఏ రోజునైతే వాటిని ఆడించలేని స్థితిలో ఉంటానో ఆరోజున అవి నన్ను కాటేస్తాయి.”– ఇది దాసరి “పిచ్చోడి చేతిలో రాయి” సినీమాలోని ఒక డైలాగ్. ఈ డైలాగ్’ని’ని నేను గురువు గారి అవసాన దశకి కొద్దీ రోజులు ముందు గురువు గారికి గుర్తు చేసాను. ఇది విని గురువు గారు నవ్వుకొన్నారు గాని తిరిగి సమాధానం చెప్పలేక పోయారు. ఆయనకి ఇది అర్ధం అయ్యింది అనుకొంటా. కానీ అర్ధం కానట్లు మౌనం వహించారేమో.
పవన్ ఎదో ఒక రోజు సీఎం అవుతాడు
గురూజీ ఆసుపత్రి పాలు అవ్వడానికి కొన్ని రోజులు ముందు ఢిల్లీ వచ్చారు. ఢిల్లీలోని రాజధాని హోటల్’లో జరిగిన మా ఇద్దరి ఏకాంత సమావేశంలో ఎన్నో విషయాలు చర్చించారు. అణగారిన వర్గాల్లో కష్టపడే తత్త్వం పెరగాలి. సహనం అస్సలు లేదు. నిజమైన నాయకుడిని అస్సలు నమ్మరు. కానీ వీటిని అధికమించి ఏదో ఒక రోజున పవన్ కళ్యాణ్ సీఎం (CM Pawan Kalyan) అవుతాడయ్యా. నువ్వు చూస్తూ ఉండు అన్న దాసరి గారి నాటి మాటలు నాకు ఇప్పటికీ గుర్తుకొస్తున్నాయి.
గురువు గారు చేసిన ఆ పుణ్యఫలం ఆయన బిడ్డలను మరియు అయన శిష్య మరమాణువులందరినీ ఎల్లవేళలా కాపాడాలని ఆ భగవంతుడిని, గురువు గారి ఆత్మను సదా ప్రార్ధిస్తూ…
తాత మానవుడు సృష్టికర్త, మా“బహుదూరపు బాటసారి’కి నమఃసుమాంజలితో
— Akshara Satyam