Pawan on IppatamPawan on Ippatam

ఇప్పటం కూల్చివేతలు కచ్చితంగా కక్ష పూరితమే
30 ఏళ్లు పాలించాలనేది వైసీపీ నాయకుల కోరిక
30 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వాలనేది జనసేన ఆశయం
జనసేన రౌడీ సేన కాదు విప్లవ సేన
వైసీపీ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలు కొడతాం.
హత్యా రాజకీయాలు ప్రోత్సహించే వైసీపీ ఉగ్రవాద సంస్థా?
అండగా నిలచిన గ్రామాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం
2024లో అంతకంత బదులిస్తాం.. అప్పుడు మీరంతా మాజీలవుతారు.
రాజకీయ ప్రమేయం.. లంచాలు లేని వ్యవస్థలు స్థాపిస్తాం.
ఇప్పటం గ్రామస్తులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్

వైసీపీ నాయకులు (YCP Leaders) ఇప్పటం (Ippatam) గ్రామ ప్రజల గడపలు కూల్చారు. వైసీపీ గడపలు కూల్చే వరకు జనసేన పార్టీ (Janasena party) నిద్రపోదని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. ఇప్పటం గ్రామానికి తగిలిన దెబ్బ నా గుండెల మీద గాయం చేసిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పటం కూల్చివేతలు కచ్చితంగా కక్షపూరిత చర్యేనని జనసేనాని (Janasenani) తెలిపారు. జనసేన పార్టీ సభకు స్థలం ఇచ్చి అండగా నిలబడిన మీ కష్టంలో జనసేన పార్టీ కచ్చితంగా అండగా ఉంటుందని ఇప్పటం రైతులకు భరోసా ఇచ్చారు. మీకు మేము చేదోడు వాదోడుగా ఉంటాం.. మీరు భయపడవద్దని పవన్ కళ్యాణ్ ధైర్యం చెప్పారు.

ప్రజల కన్నీళ్ల మీద కడుతున్న ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలు కొట్టి తీరుతామని. 2024 ఎన్నికలు మీకు గుర్తుండేలా చేస్తామని జనసేనాని సవాలు విసిరారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇళ్ల కూల్చివేతకు గురైన ఇప్పటం గ్రామస్తులకు పార్టీ తరఫున ప్రకటించిన రూ. లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. 39 మందికి జనసేనాని ఆర్థిక సాయం చేశారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేసారు. “జనసేన పార్టీకి అండగా నిలబడి నా హృదయానికి దగ్గరైన ఇప్పటం గ్రామ పెద్దలకు పాదాభివందనాలు. మార్చి 14న సభ నిర్వహించుకోవడానికి స్థలం ఇస్తామంటే వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు అంతా అడుగు వెనక్కి వేశారు. ఇప్పటం ప్రజలు మాత్రం వైసీపీ అయితే ఏంటి.. ఇంకొకరైతే మాకేంటి? అని ధైర్యంగా స్థలం ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసిన సభకు సహకరించిన మీరు కష్టాల్లో ఉన్నప్పుడు.. మీ ఇళ్లు కూల్చేసినప్పుడు నాకు అండగా నిలబడిన ఇప్పటం గ్రామానికి నేను అండగా నిలబడుతాను. అందుకే విషయం తెలియగానే ఆఘమేఘాల మీద వచ్చాను. ఇప్పటంలో మన గడపలు కూలిస్తే నాకు ఎంతో ఆవేదన కలిగిందని జనసేనాని అన్నారు.

నాకు కుటుంబ రాజకీయ నేపథ్యం లేదు

ఇప్పటం గ్రామ ప్రజలు గడపలు మీరు కూల్చారు.. వైసీపీ గడప కూల్చే వరకు జనసేన నిద్రపోదు. నేను పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాలేదు. కాని ప్రజలకు కష్టం వస్తే, కన్నీరు వస్తే, ఆ కన్నీరు తుడుస్తాం. ఎప్పుడో మేము ప్రభుత్వంలోకి వచ్చాక మేము అండగా నిలబడతాం.. న్యాయం చేస్తామని కొంత మంది మాట్లాడుతారు. నేను మాత్రం ప్రభుత్వంలోకి వచ్చినా రాకపోయినా నా వంతు సహకారం ఏం చేయాలో అది చేస్తా. నాకు నిలబడ్డ నా ఇప్పటం గ్రామ ప్రజలకు రూ.లక్ష చొప్పున ఇద్దామని నిర్ణయించుకున్నాను. మీరు నాకు నిలబడినప్పుడు నా వంతు సహాయం చేయకపోతే నేను ఎన్ని మాటలు చెప్పినా ప్రయోజనం లేదు అనిపించింది. మాకు నిలబడ్డ మా తల్లులు, ఆడపడుచులు, సోదరులకు అండగా నిలబడడానికే ఈ సాయం చేస్తున్నాను అని జనసేనాని అన్నారు.

వైఎస్ఆర్ విగ్రహాలు ఎందుకు వదిలేశారు

రాజకీయాల్లో పట్టువిడుపులు ఉండాలి. వైసీపీ ప్రభుత్వం ఇప్పటం గ్రామ ప్రజలు జనసేన సభకు స్థలం ఇచ్చి అండగా నిలబడ్డారన్న కారణంతోనే రోడ్డు విస్తరణ పేరిట విచక్షణా రహితంగా ఇళ్లు కొట్టేశారు. రూల్స్ అందరికీ వర్తించాలి. 20 అడుగుల రోడ్డు ఉన్న చోట కొట్టకుండా 40 అడుగులు ఉన్న చోట కొట్టేసి.. వైఎస్ఆర్ విగ్రహాలు వదిలేయడం ఏంటి? నిజంగా త్రికరణశుద్ధిగా చేయాలంటే చాలా పద్ధతిగా చేయొచ్చు. ఇది చాలా కక్షపూరితంగా చేశారు. అందుకే నేను మీకు నిలబడ్డా. నేను మీకిస్తున్న భరోసా ఒక్కటే మీ కష్టాల్లో మేమున్నాం. ఇప్పటం గ్రామ ప్రజలు చూపిన తెగింపు.. తెగువ.. అమరావతి రైతులు చూపి ఉంటే రాజధాని ఇక్కడి నుంచి కదిలేది కాదు. వీళ్లకి భయపడకూడదు.. భయపడితే మనుషుల్ని చంపేస్తారు. ప్రభుత్వం ప్రజలకు సహకరించాలి. భయపెట్టే పరిస్థితులు ఉండకూడదు. నన్ను ఒక బిడ్డలాగా ఆదరించిన ఎంతో మంది తల్లులు మా సభకి నిలబడ్డారు. అదే నన్ను కదిలించింది.. ఇప్పటం గ్రామానికి జరిగిన దెబ్బ నా గుండెల మీద గాయం దానికి మందు జనసేన రాస్తుంది. వాళ్లు దెబ్బ కొడితే మందు మేమిస్తాం. నా బిడ్డ కోసం ఇస్తున్నానన్న ఆ తల్లులు వారి గుండెల్లో నాకిచ్చిన స్థానం ముందు ఏ పదవి అయినా చాలా చిన్నది.

రాజ్యాంగ పదవి సాధించడం అసాధ్యం కాకపోవచ్చు. మీ గుండెల్లో సాధించిన ఈ స్థానం మాత్రం అసాధ్యం. అలాంటి స్థానం ఇచ్చిన తల్లులకు ధన్యవాదాలు. కృతజ్ఞత లేని సమాజం ముందుకు వెళ్లదు. నాకు జీవితం పట్ల చాలా కృతజ్ఞత ఉంది. పిడికెడు అన్నం పెడితే నా గుండె చాలా బరువెక్కుతుంది. నేను గ్రామీణ ప్రాంతానికి చెందిన మట్టి మనిషిని. మట్టిని పట్టుకునే చేతులు, మట్టి నుంచి వచ్చే సువాసన ఎంత ఖరీదైన సెంట్లు కూడా ఇవ్వవు. అలాంటి మనుషులకు నమస్కారాలు అని పవన్ కళ్యాణ్ అన్నారు.

దాన్నే ఆధిపత్య అహంకార ధోరణి అంటారు

నాకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకు వచ్చి అడిగితే ఆదుకునే విధంగా ఉండే పాలనా వ్యవస్థకు అడుగులు వేయాలని కోరుకుంటున్నాం. ఒక రాజకీయ నాయకుడు తెలిస్తేనో.. అధికారికి లంచం ఇస్తేనో తప్ప ఇప్పుడు పని అవ్వడం లేదు. ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే అలాంటి పరిస్థితులు లేకుండా పని అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఇంత మంది యువతను వాడుకుని వదిలేయడం కాదు. వైసీపీ నాయకులు 30 సంవత్సరాలు పాలించాలనుకుంటారు. నేను మాత్రం మీకు 30 సంవత్సరాలు బంగారు భవిష్యత్తు ఉండాలని కోరుకుంటాను. వైసీపీ 30 సంవత్సరాలు తామే ఉండాలని కోరుకుంటుంది. జనసేన 30 సంవత్సరాలు మీకు అండగా ఉండాలని కోరుకుంటుంది అని జనసేనాని అన్నారు.

సజ్జల రామకృష్ణా రెడ్డి ప్లానింగ్

ఇప్పటం కూల్చివేతల వెనుక డి-ఫ్యాక్టో సీఎం సజ్జల రామకృష్ణా రెడ్డి ప్లానింగ్ ఉందని తెలిసింది. సజ్జల నేను ఒకసారి ఆయనది ఆధిపత్య ధోరణి అని మాట్లాడితే బాధపడ్డారు. ఆధిపత్య ధోరణి అంటే అహంకారం అని అర్థం చేసుకోగలరు. మీరు పెట్టి. ? పుట్టారా మిగతావాళ్లు కాదా. మిగతా వాళ్లు బానిసలు.. మీరు పడేస్తే తినేవాళ్లు అన్న ఆలోచనా ధోరణిని ఆధిపత్య అహంకారం అంటారు. మీ ముందు ఎవ్వరూ నోరు తెరిచి మాట్లాడ కూడదు అనుకొంటారు. ఆధిపత్య అహంకారం అంటే రెండు కళ్లు లేని వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఇంటికి వాలంటీర్లను పంపి బెదిరించడం. కడపలో దివ్యాంగుడైన ఒక కుర్రాడిని.. జనసేన రైతు భరోసాకి వస్తుంటే వెళ్లకూడదు అని చెప్పడం. దాన్ని ఆధిపత్య అహంకారం అంటారు. రాజకీయం మేమే చేయగలం మిగతా వారు చేయకూడదు అనడం ఆధిపత్య అహంకారం అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

మేము సంస్కారవంతంగా రాజకీయాలు చేస్తున్నాం

సజ్జల రేపటి నుంచి నన్ను తిట్టించుకోండి.. దాడులు చేసుకోండి. నేను అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను. మీ ఉడత ఊపులకు జనసేన పార్టీ భయపడదు. పవన్ కళ్యాణ్ భయపడడు. మాకు అండగా ఉన్న గ్రామాల ప్రజల్ని ఒక్కరిని ఇబ్బంది పెట్టినా 2024లో మా ప్రభుత్వం వచ్చిన రోజున మీరు ఏ కారణం చూపి మా వాళ్ల ఇళ్లు కూల్చారో.. మీరు చెప్పిన ఆ లీగల్ విధానంతోనే మేము బదులిస్తాం. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలంతా మాజీలు అవుతారు. మీరు ఒక్కరేనా రాజకీయాలు చేసేది. కోడి కత్తులతో గీయించుకుని డ్రామాలు ఆడటం మాకు తెలియదు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్, గాంధీజీ, నేతాజీ, కన్నెగంటి హనుమంతు గార్ల స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాం. కాబట్టే సంస్కారవంతంగా రాజకీయాలు చేద్దామనుకుంటున్నాం. మీకు అన్నిసార్లూ సంస్కారం పనికి రాదని అర్ధం అయ్యింది. వైసీపీ వారికి మంచిమర్యాద పనికి రాదు. మీరు నాయకుల్లా ప్రవర్తిస్తే మేము నాయకుల్లా మాట్లాడుతాం. మీరు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తే మేము అలాగే ఉంటాం అని పవన్ కళ్యాణ్ అన్నారు.

వివేకా హంతకులకు మద్దతు ఇచ్చే పార్టీ వైసీపీ

జనసేన కాదు రౌడీ సేన అన్నారు. మీరు చేతిలో తల్వార్లు పట్టుకుని వివేకానందరెడ్డిని చంపేస్తే.. అలాంటి హంతకులకు మద్దతు తెలుపుతారు. వారిని కాపాడుతారు. అత్యాచారం జరిగితే ఒక రేప్’కే ఏంటి ఇంత గోల చేస్తారనే స్థాయి కుసంస్కారం మీది. ఎమర్జెన్సీ రోజుల్లో శ్రీమతి రమీజాబి అత్యాచార కేసు నిందితుల్ని శిక్షించండి అని అప్పట్లో గోడల మీద రాసేవారు. శ్రీమతి రమీజాబి భర్తను చంపేసి ఆమెపై సామూహిక అత్యాచారం చేస్తే.. నాలుగేళ్ల పాటు పోరాటం చేశారు. ఇప్పుడున్న అధికార పార్టీ వ్యక్తుల్లాంటివాళ్ళు అప్పుడు ఉంటే ఆ రోజుల్లో న్యాయం ఏం జరిగేది. ఈ నాయకులకు తోలు మందం వచ్చేసింది. నాకు అన్యాయం జరిగే వరకు నేను ఆగి చూసేందుకు జనసేన పార్టీ పెట్టలేదు. ముక్కుముఖం తెలియని ఒక బిడ్డకు అన్యాయం జరిగినా నేను స్పందిస్తా. నా ఇంటి గోడ కూల్చే వరకు ఆగలేదు. హైదరాబాద్ లోని భీమ్ రావ్ బాడా కూల్చగానే బయటకు వచ్చా. నా సాటి మనుషుల ఇళ్లు కూలిస్తే ఇప్పుడు వచ్చా. మీరు ఓట్లు వేసినా, వేయకపోయినా గుండెల మీద చెయ్యి వేసుకుని చెబుతున్నా నన్ను బిడ్డగా స్వీకరించిన తల్లి సాక్షిగా మీకు నేను అండగా నిలబడతా. అమెరికాకి చెందిన ఓ రెడ్ ఇండియన్ మాటల్లో ఆఖరి నీటి బొట్టు దాగని పరిస్థితి వచ్చాక తెలుస్తుందని పవన్ అన్నారు.

మాది రౌడీ సేన కాదు విప్లవసేన

ఇంత మంది కన్నీళ్ల మీద మీరు ఫ్యూడలిస్టిక్ కోటలు కడుతున్నారు. యువతను వాడుకోవడం తప్ప వారి కోసం ఆలోచించే పరిస్థితులు లేవు. మాట్లాడితే రౌడీ సేన అంటారు. ఆ పెద్ద మనిషికి చెబుతున్నా.. మాది రౌడీ సేన కాదు విప్లవసేన.. రౌడీయిజం గూండాయిజం చేసే వారికి ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో మీకు తెలియదు కాబట్టి మేము రౌడీల్లా కనబడుతున్నాం. ప్రజల దృష్టిలో మేము విప్లవకారులం. మీరు పిచ్చి వేషాలు వేస్తూ.. హత్యా రాజకీయాలు చేయగలం అనుకుంటున్నారు. ఆ హత్యా రాజకీయాలు ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఆయనపై కూడా చేయించేయగలం అనుకుంటున్నారు అని జనసేనాని అన్నారు.

వైసీపీ పార్టీనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషనా? వైసీపీ ఉగ్రవాద సంస్థా? సజ్జల హత్యా రాజకీయాలు చేయలేమా అంటారు. ప్రభుత్వానికి మీరిచ్చే సలహాలు ఇవా? మాకు చేతకాక చేతులు ముడుచుకు కూర్చున్నా మనుకుంటున్నారా? రాజకీయం మీరే చేయాలా? మేం చేయకూడదా? ఏం మాట్లాడుతున్నారు. రాజకీయం చేయాలంటే పెట్టిపుట్టాలా? మా వల్ల కాదా? మేమూ చేసి చూపుతాం. మీ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలు కొట్టి చూపుతాం. మీ తాటాకు చప్పుళ్లకు మేము బెదరం అని పవన్ కళ్యాణ్ అన్నారు.

అదే నా లక్ష్యం

నెల్లూరు జిల్లాలో ఓ ఎస్సీ యువకుడు నామినేషన్ వేద్దామంటే బెదిరించారు. కొన్ని రోజుల తర్వాత అతను ఓ ఆటో యాక్సిడెంట్ లో చనిపోయాడు. అతను చెప్పిన చివరి మాటలు పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప. ఏ వాళ్లే రాజకీయాలు చేయాలా? అధిక సంఖ్యాకులు రాజకీయాల్లో ఉండాలి. రెల్లి కులస్తుడు నామినేషన్ వేయాలి. గెలవొచ్చు గెలవకపోవచ్చు. గుంటూరులో నూర్ బాషాలు.. దూదేకుల కులాల మాకు ఏ పథకం రాలేదు అంటున్నారు. మీకు మీరే ఇచ్చుకునే స్థితిలో అది ఉండాలి. అన్ని కుల సమూహాలు దేహి అనే ధోరణి నుంచి బయటకు రావాలి. మేమే రాజకీయాలు చేయాలన్న ధోరణికి జనసేన వ్యతిరేకం. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో సగటు మనిషి ఎలాంటి ప్రభావితం చేయకుండా.. లంచాలు ఇవ్వని పరిస్థితుల్లో వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే నా లక్ష్యం. కులబలం, అర్థబలం లేకపోయినా ఒక యువకుడు, యువతి నామినేషన్ వేస్తానంటే వేసే అవకాశం కల్పించే పరిస్థితులు రావాలి. నేను కులాల్ని వేరు చేయడం లేదు. కలుపుతున్నాను అని పవన్ కళ్యాణ్ వివరించారు.

మేమేం మాట్లాడామో చెవిలో అయితే చెబుతా

వైసీపీ నాయకుడు నన్ను ఒక మాట అంటే ఆయన కులం మొత్తం అన్నట్టు కాదు. నేను ఎప్పుడు మాట్లాడినా నేను పుట్టిన కులం ద్వారా ఆ కులంలో పుట్టిన నాయకులతో నన్ను తిట్టిస్తారు. నిజంగా నేనే తప్పయితే, మీ 0లోపల ఎలాంటి వికృత ఆలోచన లేకపోతే నా కులంతోనే నన్ను ఎందుకు తిట్టిస్తావు? బ్రిటీష్ వారు వెళ్లిపోయారు. విభజించి పాలించే వారు వెళ్లిపోయారు. వారి గుణగణాలు మాత్రం వీరి లోపలికి వెళ్లిపోయాయి. ఇంకా మనల్ని విభజిస్తూనే ఉన్నారు. 2024 మనకి కీలక ఎన్నికలు. మీరు కలలు కంటున్నారేమో. మా ఇప్పటం గ్రామస్తుల గడపలు కూల్చారు మీరు. నా గుండెల్లో గుణపం దించారు. మా ఇప్పటం గ్రామంలో కొట్టిన ప్రతి గడప నా గుండెల మీద కొట్టినట్టే. శ్రీ సజ్జల గారు మీకు ఛాలెంజ్ చేస్తున్నా మీరు ఎలా గెలుస్తారో మేము చూస్తాం. మేము మీలా ఢిల్లీకి వెళ్లి చాడీలు చెప్పం అని జనసేనాని అన్నారు. మేము మీలా ఢిల్లీకి వెళ్లి చాడీలు చెప్పం. ప్రధాన మంత్రి గారిని నేను మూడు నాలుగు సందర్భాల్లో కలిశాను. మేము ఏం మాట్లాడింది మీకెందుకు చెప్పాలి. మేము ఏం మాట్లాడామో కావాలంటే నా దగ్గరికి వస్తే మీ చెవులో చెబుతాం. నేను ఎప్పుడు మాట్లాడినా దేశ భవిష్యత్తు, సమగ్రత, సగటు మనిషి రక్షణే కోరుకుంటా. అదే మాట్లాడుతా అని జనసేనాని అన్నారు.

మా యుద్ధం మేమే చేస్తాం

వైసీపీని దెబ్బ కొట్టాలి అంటే ప్రధాన మంత్రి గారికి చెప్పి చేయను. నేనే చేస్తా. ఇది నా నేల.. నేను ఆంధ్రుణ్ణి. ఆంధ్రలో పుట్టా.. ఆంధ్రలోనే తేల్చుకుంటా. మాట్లడితే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయం. మా యుద్ధాలు బీజేపీ పెద్దలను అడగం. నా యుద్ధం నేనే చేస్తా. మా ఇప్పటం గ్రామానికి ఇబ్బంది వస్తే ఢిల్లీ వెళ్లి మద్దతు అడగం. మేమే వస్తాం. వీరు ఢిల్లీకి వెళ్లి చాడీలు చెప్పేస్తున్నారని తెలిసిన వారు చెబుతున్నారు. అధికారం లేని వాడిని.. గొంతేసుకుని అరవడం తప్ప ఏం చేయలేను. పోలీసులు ఇఫ్పటం వస్తుంటే ఆపేస్తారు. మీరు నా మీద పడి ఏడుస్తారేంటి? మీరు అర్ధం చేసుకోవాల్సింది సత్తాను.

ఈ మధ్య కేసులు పెట్టారంట.. ఇప్పటం గ్రామానికి బయలుదేరితే నువ్వు రాకూడ దన్నారు. విశాఖలో హోటల్ లో బంధిస్తారు. కార్లో ఎక్కి నమస్కారం చేద్దాం మంటే దిగమంటారు. మావాళ్ల ఇల్లు కూల్చేస్తారంటే వెళ్లకూడదంటారు. అప్పుడే బండి మీద ఎక్కి వస్తానని చెప్పాను. బండి ఎక్కనివ్వరు.. నడిచి వెళ్లనివ్వరు.. తమాషాగా ఉందా.. మీరు మర్యాదగా ప్రవర్తిస్తే మేము పద్దతిగా ఉంటాం. మీరు నీచంగా మాట్లాడితే మా అంత విప్లవకారులెవరూ ఉండరు. ఇప్పటి దాకా చేసిన బానిసతనం చేయం. 175కి 175 వచ్చేయాలంట. మేము నోట్లో వేళ్లు పెట్టుకుని కూర్చుంటామా?. 175 స్థానాలు గెలిచేసి మిగతా గడపలు కూల్చేయమని చెబురా? మీరు ఓట్లు వేయడం వల్లే గడపలు కూల్చారు అని జనసేనాని అన్నారు.

వైఎస్ఆర్ ఇండియా అని పెట్టేవారు

వైసీపీ నేత మాట్లాడితే ఎన్టీఆర్ గారితో పోల్చుకుంటున్నారు. ఆయన వైసీపీ నాయకుల్లా ఇళ్లు కూల్చేయలేదు. ఎన్టీఆర్ కిలో రెండు రూపాయలకు బియ్యం ఇచ్చారు. గొప్ప నాయకుడికి కుంచిత స్వభావం ఉన్న నాయకుడికీ తేడా ఉంటుంది. వైసీపీ నాయకుల కుటుంబం స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉంటే వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టినట్టు వైఎస్ఆర్ ఇండియా అని పెట్టేసేవారు. జగనన్న విద్యాదీవెన పథకం ఎందుకు? మీరు కష్టపడి రాళ్లు కొట్టి ఒళ్లు వంచి పని చేసి టాక్సులు కట్టి ఇస్తే అప్పుడు పెట్టుకోవాలి. మేము టాక్సులు కడితే ఆ డబ్బుతో పథకాలు పెట్టి మీ పేరు పెట్టుకోవాడం కుదరదు. శ్రీ గుర్రం జాషువా విద్యాదీవెన అని ఎందుకు పెట్టలేరు? శ్రీ కన్నెగంటి హనుమంతు ఫించను పథకం ఎందుకు పెట్టలేరు? శ్రీ పింగళి వెంకయ్య గారి క్యాంటిన్.. శ్రీమతి డొక్కా సీతమ్మ గారి క్యాంటిన్ ఎందుకు పెట్టలేరు అని వైసీపీ ప్రభుత్వాన్ని జనసేనాని ప్రశ్నించారు.

జాతీయ నాయకుల కంటే మీరు గొప్పవారా?

ఇప్పటం గ్రామానికి వెళ్తే అక్కడ జాతీయ నాయకులైన మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ, శ్రీమతి ఇందిరా గాంధీ విగ్రహాలు తీసేశారు. వైఎస్ఆర్ విగ్రహం మాత్రం ఉంది. జాతీయ నాయకుల కంటే ఆయన ఆయన గొప్ప నాయకుడా? మహాత్మా గాంధీ గారి కంటే పెద్ద వ్యక్తి కాదు అని జనసేనాని అన్నారు.

కట్ డ్రాయర్ల ఫ్యాక్టరీ వారి వద్ద కూడా డబ్బులు అడుగుతారా?

మీరు కనిపించిన వారినల్లా డబ్బులు అడుగుతారు. ఆఖరికి కట్ డ్రాయర్ల ఫ్యాక్టరీ వారి వద్ద కూడా డబ్బులు అడుగుతారు. ఈ రోజు కట్ డ్రాయర్లు, రేపు చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు. దీన్ని ఎక్కడో ఆపాలి. 2024-2029 ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. 2014లో రాజకీయాలను అర్ధం చేసుకోవడానికి పోటీ చేయలేదు. 2024లో జన సైనికుల మద్దతుతో నిలబడతాను. మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నా. గుడ్డిగా నన్ను నమ్మమని చెప్పడం లేదు. మీ భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఒకడు తెగించాలి అందుకే అన్నీ తట్టుకుని నిలబడుతున్నా. నేను బలంగా చెబుతున్నా అడ్డదారులు తొక్కను. అవినీతికి పాల్పడను. పాల్పడనివ్వను. ఇన్నేళ్లు అందర్నీ చూశారు ఈ సారి అన్ని అడుగులు ఆచితూచి వేస్తాను. దానికి మీ సంపూర్ణ సహకారాలివ్వాలి అని పవన్ కళ్యాణ్ కోరారు.

నా తర్వాత నా కొడుకు కాదు.. నా తర్వాత నేనున్నప్పుడే మీరుండాలని కోరుకుంటున్నా. ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలని ఏముంది. ఒక సగటు మనిషి ఎమ్మెల్యే అవ్వాలి. దానికి నేను బలంగా అడుగులు వేస్తా.. మీరు హత్యా రాజకీయాలు ప్రోత్సహించినా బెదిరింపులకు గురి చేసినా 2024 ఎన్నికల ఫలితాలు గుర్తు పెట్టుకోండి. మమ్మల్ని బెదిరించేవారు ఎవరైనా మీరు ఎల్ల వేళలా అధికారంలో ఉండరు. 2024 ఫలితాల తర్వాత పిచ్చి పిచ్చిగా వాగిన ప్రతి ఒక్కరికీ బదులు చెప్పే స్థితికి వస్తాం. మీరంతా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే సంతోషం” అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.

రాష్ట్ర భవిషత్తు శాసించడానికి బీసీలు ఐక్యం కావాలి: జనసేనాని
సేనాని సంచలన ప్రసంగం

Spread the love