రైతుల కోసం చివరి రక్తంబొట్టు వరకూ పోరాటం
సాగు చట్టాలపై జాతీయ స్థాయిలో ఉద్యమిస్తాం
ఉత్తరాది రాష్ట్రాల రైతులను కలుపుకొని పోతం
ఇది రాజకీయ సమస్య కాదు.. రైతుల జీవన్మరణ సమస్య
బీజేపీ సర్కారుపై నిప్పులు చెరిగిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana Chief Minister) కెసిఆర్ (KCR) కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై (BJP Government) నిప్పులు చెరిగారు. బీజేపీని దేశం నుంచి వేళ్ళకొట్టాలి. లేదంటే దేశం నాశనమై పోతుంది అంటూ సీఎం కేసీఆర్ (CM KCR) విరుచుకు పడ్డారు. బీజేపీ మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నది అని కేసీఆర్ ఆరోపించారు.
భారత రైతాంగ సమస్యల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి లీడర్‌షిప్ తీసికొంటుంది. అవసరం అయితే ముందుకు పోయి పోరాడుతుంది. మీ మెడలు గ్యారంటీగా వంచుతుంది. మీ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా చివరి రక్తపు బొట్టు దాకా పోరాటం చేయాలి. మిమ్ములను వదిలిపెట్టం.ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే. మన హక్కులు సాధించే వరకు, మన రైతాంగం ప్రయోజనాలు పరిరక్షించే వరకు కొనసాగిస్తాం. ఉత్తర భారత రైతాంగం చేస్తున్న పోరాటాలను కలుపుకొని మేము ముందుకు వెళ్తాం అంటూ కేసీఆర్ విరుచుకు పడ్డారు.
ఆకలి కేకలు.. సిగ్గు చేటు
గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లోని 116 దేశాల్లో భారత్ స్థానం 101 ఉండటం సిగ్గుచేటు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, పాకిస్థాన్ కంటే కిందిస్థాయిలో భారత దేశం (India) ఉంది. దేశాన్ని పాలించిన పార్టీల వైఫల్యమే దీనికి ప్రధాన కారణం. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎవరి కోసం నిర్లక్ష్యం చేస్తున్నరు? అసలు కేంద్రం పాలసీ ఏమిటి? అని బీజేపీని కేసీఆర్ ప్రశ్నించారు.
ఎలక్షన్ వచ్చినప్పుడల్లా మాత విద్వేషాలు?
ఎలక్షన్ వచ్చినప్పుడల్లా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ప్రజల మధ్య పోరాటాలు పెట్టి.. సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకొని రాజకీయాలు నడుపుతున్నారు. మీకు కాలం చెల్లిపోయింది అని కేసీఆర్ అన్నారు
5 లక్షల టన్నుల వడ్లు బీజేపీ ఆఫీసుపై గుమ్మరిస్తం
మీరు తీసుకొంటమని చెప్పి ఎఫ్‌సీఐ (FCI) లెటర్ ఇస్తే మీకు గత యాసంగిలో 50 లక్షల టన్నుల బియ్యం ఇచ్చాం. ఇంకా 5 లక్షల టన్నులు అక్కడే ఉన్నయ్.. మీరు తీసుకోకపోతే మా రైతుల మీద చుట్టూ తిప్పి దిష్టి తీసినట్టు చేసి, ఆ బియ్యం తెచ్చి మీ బీజేపీ ఆఫీసు మీద కుమ్మరిస్తం జాగ్రత్త అంటూ కేసీఆర్ బీజేపీని దుయ్యబట్టారు.
రైతుల సంక్షేమం (Farmers welfare) కోసం కచ్చితంగా ఉద్యమ జెండా లేవాల్సిందేనని కేసీఆర్ రణ నినాదం చేశారు. రైతాంగ ప్రయోజనం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం రగలాల్సిందేనన్నారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతి ఇంటికీ చేర్చాలి. ఇందుకు తెలంగాణ నాయకత్వం వహించాలని, మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రం దిగి వచ్చి మన రైతాంగానికి న్యాయం చేసేవరకు పోరాటం ఆగదు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఆలోచింపచేసి, దిగి వచ్చే వరకు మన పోరాటం కొనసాగుతుంది అని కేసీఆర్ గర్జించారు.
ఎందాకైనా వెళ్తాం
తెలంగాణ రైతు ప్రయోజనాలు కాపాడేందుకు, వ్యవసాయ రంగాన్ని రక్షించేందుకు మంత్రి నిరంజన్‌రెడ్డి అనేకసార్లు ఢిల్లీకి వెళ్లారు. వెళ్లి కేంద్రానికి మన రైతు గోసను, గోడును వినిపించారని కెసిఆర్ గుర్తుచేశారు. పంజాబ్‌లో కొంటున్నట్లే మన రైతులు పండించే పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని దండం పెట్టి ప్రార్థించి వచ్చారని కేసీఆర్ అన్నారు.
ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలి
కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసుకొంటూ, వ్యవసాయరంగాన్ని చక్కదిద్దుకున్నామని సీఎం కేసీఆర్ వివరించారు. ఆ ధాన్యాన్ని సేకరించాల్సిన బాధ్యత, నిల్వచేయగలిన సామర్థ్యం కేంద్రం వద్దనే ఉన్నదని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
పచ్చి అబద్ధాల బీజేపీ
బీజేపీ ప్రభుత్వం (BJP Government) పచ్చి అబద్ధాలతో దేశాన్ని పాలిస్తున్నదని కేసీఆర్ ధ్వజమెత్తారు. మాట్లాడితే అబద్దాలు.. వాట్సప్, ఫేస్‌బుక్కుల్లో వితండవాదాలు, వ్యక్తుల క్యారెక్టర్‌ను కించపరిచేలా ప్రచారాలు బీజేపీ చేస్తున్నదని కెసిఆర్ నిప్పులు చెరిగారు. ఏడేండ్లుగా తెలంగాణను అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేసిందని కేసీఆర్ మండిపడ్డారు.
నీళ్ల విషయంలో తగవు పెడుతున్నారు
మన దేశానికి ప్రకృతి ఇచ్చిన సంపద 65 వేల టీఎంసీల నీళ్లున్నాయని కేసీఆర్ అన్నారు. ఇందులో దేశం మొత్తం వాడుకునేది 35 వేల నుంచి 36 వేల టీఎంసీలు కూడా లేదు. ఇంకో 30 వేల టీఎంసీలు సముద్రం పాలు అవుతున్నాయి. దేశంలో ఉండే వ్యవసాయ భూమి మొత్తం 40 కోట్ల ఎకరాలు. ప్రతి ఎకరానికీ నీళ్లిచ్చినా ఇంకా 25 వేల టీఎంసీలు మిగిలే ఉంటాయి. ప్రతీ ఇంటికి నీళ్లు ఇచ్చి.. 10 వేల టీఎంసీలు వాడుకొన్నా, ఇంకా 15 వేల టీఎంసీల మిగులు ఉంటుంది. అప్పుడు మరో వందేండ్ల దాకా ఈ దేశానికి నీళ్ల గురించి ఢోకానే ఉండదని కేసీఆర్ చెప్పారు.
మరో పోరాటానికి సిద్ధం కావాల్సిందే
కరెంటు ఉన్నా వాడలేని అసమర్థులకు, దేశంలో నీళ్లున్నా ప్రజలకు ఇవ్వలేని అసమర్థులకు చరమగీతం పాడితేనే మన దేశానికి నిష్కృతి లభిస్తుందని కేసీఆర్ అన్నారు. మన సమస్యలకు పరిష్కారం చిప్ప పట్టుకొని బిచ్చమెత్తుకుంటేనో, బతిమిలాడితేనో దొరకదని కెసిఆర్ చెప్పారు. పంట పండించి దేశానికి అన్నం పెడతామంటే తీసుకొనే తెలివి లేక గోల్‌మాల్ చేస్తున్నారని కేంద్రాన్ని దుయ్యబట్టారు. వీరి చర్యలతో దేశం మూగబోతున్నదన్నారు. ఏమి కేసులు పెడతారో పెట్టండని కేంద్రానికి కేసీఆర్ సవాల్ (KCR Challenge) చేశారు.