ఎన్‌ఎస్‌యూఐ పిటిషన్ కొట్టివేత
పాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేం:హైకోర్టు
రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఓయూ (OU) పర్యటనకు రాష్ట్ర హైకోర్టు (Telangana High Court) అనుమతి నిరాకరించింది. దీనితో జాతీయ కాంగ్రెస్ పార్టీ (National Congress Party) మాజీ అధినేత రాహుల్‌గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి (Osmania University) తీసుకెళ్లాలన్న కాంగ్రెస్ పార్టీ నేతల (Congress Party Leaders) ఆశలకు అడ్డు వచ్చి పడింది. యూనివర్సిటీ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు (High Court) తెలిపింది. అనుమతి విషయంలో ఓయూ అధికారుల నిర్ణయమే అంతిమమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి వెకేషన్ బెంచ్ బుధవారం దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. భవిష్యత్తులోనూ యూనివర్సిటీలో రాజకీయ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకుండా ఆయా యూనివర్సిటీల రిజిస్ట్రార్లు జాగ్రత్తగా ఉండాలని కూడా పేర్కొంది. యూనివర్సిటీలో రాజకీయ కార్యక్రమాలు, సమావేశాల వంటివి నిర్వహించకుండా పూర్తిస్థాయి మార్గదర్శకాలు రూపొందించాలని ఉన్నత న్యాయస్థానము ఆదేశించింది.
రాహుల్‌గాంధీ ఓయూ పర్యటనకు అనుమతి ఇవ్వాలన్న తమ విజ్ఞప్తిపై ఓయూ అధికారులు (OU Officials) స్పందించడం లేదంటూ ఎన్‌ఎ్‌సయూఐ నేతలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలంటూ ఓయూ అధికారులకు హైకోర్టు ఈ నెల 2న ఆదేశాలు జారీ చేసింది. అయితే ఓయూ అధికారులు రాహుల్‌గాంధీ పర్యటనకు అనుమతిని నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎన్‌ఎ్‌సయూఐ నాయకులు బుధవారం మరోసారి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇరువురి వాదనలు విన్న హైకోర్టు యూనివర్సిటీ అధికారుల నిర్ణయమే అంతిమం అని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.