నేరం నాది కాదు – నా స్వార్దానిది?
సంక్షేమ పధకాల (Welfare Schemes) ముసుగులో సంక్షోభం పొంచి ఉన్నదా? దీని ప్రజలు, ప్రభుత్వాలు (Governments) గమనించడం లేదా? జగన్ ప్రభుత్వం (Jagan Government) నెరవేర్చిన హామీలను ఒక డాక్యూమెంటు రూపంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ఇటీవల ఆవిష్కరించారు. వైసీపీ ప్రభుత్వ (YCP Government) రెండేళ్ల పాలనలో 1,31,725 కోట్ల రూపాయిలను రాష్ట్రంలో 86% గడపలకి ఏదో ఒక పథకం ద్వారా ప్రయోజనం కలిగేలా చర్యలు తీసికొన్నాం అని ఆంధ్ర ఆప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.
ప్రభుత్వాలు పంచుతున్న ఇన్ని లక్షల కోట్లు ఏమైపోతున్నాయి. ప్రజల పేదరికాన్ని ఎంతవరకు పోగొడుతున్నాయి. సంక్షేమ పధకాల వెనుక ఉన్న అసలు వాస్తవం ఏమిటి ఎనేది లోతుల్లోకి వెళ్లి చర్చించాలి.
రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో సుమారు 12,00,000 కోట్ల రూపాయిలు వరకూ బాబు ఖర్చు పెట్టారు. అయినా మన రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉన్నదో లేదో కూడా నేటికి తెలియదు.
మనకి ఇక ఇల్లు లేక పోతే ఎలా ఉంటుందో అలానే రాష్ట్రానికి రాజధాని లేకపోతే అలానే ఉంటుంది అనే వాస్తవం రాష్ట్ర పాలకులకి గాని, వారిని ఎన్నుకొంటున్న ప్రజలకి గాని తెలియడం లేదు. తెలియక పోవచ్చు కూడా. మనకి ఇల్లు ఎటువంటితో రాష్ట్రానికి రాజధాని అటువంటిదే అనేది కూడా అప్రస్తుత చర్చగానే నేడు మిగులఁగలదు.
అలానే శ్రీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 5,00,000 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తున్నది. రాబోయే సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులు మరో 2 . 24 లక్షల కోట్లుగా తెలుస్తున్నది.
రాష్ట్రము విడిపోయిన తరువాత ఇప్పటివరకు సుమారు 19 లక్షల కోట్ల రూపాయిలు వరకు ఖర్చు చేశారు. అయినా రాష్ట్ర రాజధాని ఎంత వరకు వచ్చిందో తెలియదు. పోనీ ఎప్పటికి రాజధాని వస్తుందో కూడా తెలియదు.
అయినా రాష్ట్ర రాజధాని వచ్చినా రాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రులకు గాని, లేదా వారిని ఎన్నుకొంటున్న ఓటరులకి గాని నష్టం లేదు అని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నా పెన్షన్ నాకొస్తే చాలు అనుకొనే విధంగా ప్రజలు తయారు అయినప్పుడు రాజధాని గురించి మాట్లాడుకోవడం అప్రస్తుతమే అవుతుంది.
తలా పాపం తిలా పేడేకడు అన్నట్లు?
రాష్ట్ర పరిపాలన ఎలా ఉండాలి అంటే శ్రీ రాజశేఖర్ రెడ్డి పరిపాలనలా ఉండాలి అని ప్రజలు ఇప్పటికీ చెబుతుంటారు. ఎందుకంటే ఆయన రాష్ట్రంలోని సుమారు 86 – 89 శాతం ప్రజలకి సంక్షేమ పధకాలను అందించారు. తద్వారా సుమారు 97000 కోట్లకు రూపాయిల అప్పుని రాష్ట్రము నెత్తిమీద పెట్టారు. ఈ అప్పుని ప్రజలు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే నా పెన్షన్ నాకొస్తే చాలు అనే స్థాయికి ప్రజలు దిగజారి పోయారు.
నాటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అప్పులను విమర్శించి బాబు అధికారంలోకి వచ్చాడు. బాబు ధికారంలోకి వచ్చిన తరువాత అప్పుచేసి అవే సంక్షేమ పధకాలను కొనసాగించాడు. తద్వారా రాష్ట్రము నెత్తిమీద అప్పుల భారాన్ని 259928 కోట్లకి పెంచారు. అయినా తడిచి మోపెడు అవుతున్న అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజలు పట్టించు కోవడం లేదు. తలా పాపం తిలా పేడేకడు అన్నట్లు రాష్ట్రంలో ఉన్నది.
ప్రజల సంక్షేమం కోసమా లేక పాలకుల సంక్షేమం కోసమా?
శ్రీ జగన్ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పధకాల జోరు మరింత పతాక స్థాయికి చేరుకొన్నట్లు అర్ధం అవుతున్నది. ఇప్పటివరకు జగన్ ప్రభుత్వం చేసిన కొత్త అప్పులతో రాష్ట్ర అప్పుల భారం 373000 కోట్లకి చేరుకొన్నట్లు తెలుస్తున్నది. రాబోయే మూడు సంవత్సరాలతో కలిపితే రాష్ట్ర అప్పుల భారం 8 లక్షల కోట్లకి పెరిగినాగాని ఆశ్చర్య పోనవసరం లేదు.
2004 లో అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నుండి నేటి జగన్ ప్రభుత్వం వరకు సుమారు 16 సంవత్సరాలు అయ్యింది. ఈ 16 సంవత్సరాల్లో సుమారు 35 – 40 లక్షల కోట్ల రూపాయిలను వివిధ రూపాల్లో ఖర్చు చేశారు. రాష్ట్ర అభివృద్ధి చెప్పుకోతగ్గ విధంగా జరగలేదు అనేది అందరికీ తెలిసిందే.
మరి ఈ లక్షల కోట్లు ఏమైపోతున్నాయి అభివృద్ధికి కాకుండా కేవలం సంక్షేమ పథకాలకు మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తున్నది. 86 % ప్రజలకి సంక్షేమ పధకాలు అందుతున్నట్లు నేటి ఆంధ్ర ప్రభుతం ఇస్తున్న లెక్కలు చెబుతున్నాయి. అంటే దీని అర్ధం నూటికి 86 పేదవారు నేటికీ మన రాష్ట్రంలో ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
2009 లో సంక్షేమ పధకాలు తీసుకొంటున్న వారి శాతం 86 – 89 ఉంది. 2021 లో సంక్షేమ పధకాల తీసికొంటున్న వారి శాతం 86 నే ఉంది. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఖర్చు పెడుతున్న ఇన్ని లక్షల కోట్లు ఏమైపోతున్నాయి. పేదరికాన్ని కనీసం ఒక్క శాతాన్ని అయినా తగ్గించగలిగాయా? లేనట్లే లెక్కలు చెబుతున్నాయి.
ప్రపంచములో ఉన్న అతి పేద దేశాల్లో కూడా పేదవారి (బీపీల్) శాతం 65 % దాటడం లేదు. ఆఫ్రికన్ దేశాల్లో కూడా పేదవారి శాతం ఇంత లేదు. ప్రపంచములో ఎక్కడా లేని పేదవారి సంఖ్య మన రాష్ట్రంలో ఉన్నదా?
2011 -12 లెక్కల ప్రకారం భారత దేశంలోని బీపీఎల్ రేషియో 21 %. తలసరి ఆదాయంలో ఆంధ్ర 8 వ స్థానంలో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మన కంటే పేద రాష్ట్రాలు మనదేశంలో ఎన్నో ఉన్నాయి. అక్కడ కూడా బీపీఎల్ రేషియో 86 లేదు. ప్రపంచంలో గాని, దేశంలో గాని లేని పేదవారిని మనరాష్ట్రంలో ఎందుకు చూపుతున్నారు. ఒక వేళ వారు పేదవారు కాకపోతే సంక్షేమ పధకాలను వారికి ఎందుకు ఇస్తున్నారు. ప్రజల సంక్షేమం కోసమా లేక పాలకుల సంక్షేమం కోసమా?
పాలకుల మెడలో గంట కట్టేది ఎప్పుడు?
ప్రభుత్వాలు ఇస్తున్నవి సంక్షేమ పధకాలు అయితే ప్రజలు అభివృద్ధి చెందుతున్నారా? నేటికీ 86 శాతం కుటుంబాలు పేదవారు గాని ఉన్నట్లు చూపుతుంటే వీరు ఎప్పుడు అభివృద్ధి చెందుతారు?
మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నవి సంక్షేమ పధకాల లేక అధికారాన్ని కొనుక్కొనే పధకాల అని అడిగేవారు గాని, వ్యవస్థలు గాని ఎక్కడ ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాలతో పోటీ పడి సంక్షేమ పధకాలను అమలు జరుపుతున్న కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రాన్ని అడిగే సాహసం చేయగలదా? సాహసం చేస్తే అడిగే నైతిక హక్కు కేంద్ర ప్రభుత్వాలకు ఉందా?
ఇంకా ఎవరు అడగ గలరు. పాలకుల పెరట్లో తిరిగే వ్యవస్థలు అడిగే సాహసం చేయగలవా? లేదా నా రెండవు వేలు పెన్షన్ నాకొస్తే చాలు అనుకొనే ఓటరు అడిగే సాహసం చేయగలడా?
ఎవ్వరు అడగలేక పోతే అడిగే వారు ఎవరు? ఎక్కడున్నారు? సంక్షేమ పధకాల మోజులో తరుముకొస్తున్న సంక్షోభాన్ని పాలకులకు చెప్పేది ఎప్పుడు? పాలకుల మెడలో గంట కట్టేది ఎప్పుడు? ఆలోచించండి