Pawan Kalyan NominationPawan Kalyan Nomination

పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన జనసేనాని
వైసీపీ ప్రభుత్వ దమనకాండకు చరమగీతం పాడే సమయం వచ్చింది
భావి తరాల భవిష్యత్తుకు ఈ ఎన్నికలు ఎంతో కీలకం
రాష్ట్ర ప్రయోజనాల కోసమే త్యాగాలు చేసి కూటమిగా ముందుకెళ్తున్నాం
ఎన్డీఏ ప్రభుత్వం అఖండ విజయం సాధించబోతోంది
ఇళ్లకు తీసుకువెళ్లి పెన్షన్ ఇవ్వకపోతే అది ప్రభుత్వ కుట్రే
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో పవన్ కళ్యాణ్
రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత (Janasena President) పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పిఠాపురం ఎమ్మెల్యే (Pitapuram MLA) అభ్యర్థిగా మంగళవారం నామినేషన్‌ (Nomination) దాఖలు చేశారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో తన ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు వెల్లడించారు. ఐదేళ్లలో ఆయన సంపాదన రూ.114,76,78,300. ఇందుకు ఆదాయపన్నుగా రూ.47,07,32,875, జీఎస్టీ కింద రూ.26,84,70,000 చెల్లించినట్టు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పవన్‌ అప్పులు రూ.64,26,84,453గా ప్రకటించారు. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు రూ.17,56,84,453, వ్యక్తుల నుంచి తీసుకున్నవి రూ.46.70 కోట్లు అని వివరించారు.

మీడియాతో పలు ఆశక్తికర విషయాలను బయటపెట్టిన పవన్

పిఠాపురం నుండి నామినేషన్ వేసిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆశక్తికర విషయాలను బయటపెట్టారు.

ఐదేళ్లుగా రాష్ట్రంలో సాగుతున్న ప్రభుత్వ దమనకాండకు చరమగీతం పలికే సమయం ఆసన్నమైంది… ఈ ఎన్నికలు రాష్ట్రానికే కాదు భవిష్యత్ తరాలకు ఎంతో కీలకమైనవి. అందుకోసం టీడీపీ, బీజేపీతో కలసి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ముందుకు వెళ్తున్నామని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. 60 నుంచి 70 వేల మంది ప్రజల ఆశీర్వచనాలతో వచ్చి ఈ రోజు పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పిఠాపురం ఎంపీడీఓ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున పిఠాపురం అసెంబ్లీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి శ్రీ రామసుందర రెడ్డికి అందచేసి ప్రమాణం చేశారు.

అనంతరం  పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ.. “జనసేన పార్టీ మిగిలిన పార్టీలతో సమంగా బలం పుంజుకున్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలు చేసి ముందుకు వెళ్లాం. మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం లాంటి 40 నియోజకవర్గాల్లో బలమైన ప్రజా నాయకులు పార్టీలో ఉన్నప్పటికీ పోటీ నుంచి విరమించుకోవాల్సి వచ్చింది. పిఠాపురంలోనూ బలమైన నాయకులు, ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న నాయకులు వర్మ నా కోసం సీటు త్యాగం చేశారు. ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాల కోసమే. వారికి భవిష్యత్తులో ఉన్నత స్థానం లభించాలని కోరుకుంటూ దానికి నా వంతు కృషి ఉంటుందని తెలియచేస్తున్నాను. కాకినాడ పార్లమెంటు అభ్యర్ధిగా టీ టైమ్ వ్యవస్థాపకులు ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ఎంపీగా ఎన్నిక అయితే మన ప్రాంతంలో ఉపాధి అవకాశాల కోసం, ఓఎన్జీసీ కాలుష్యం తదితర అంశాలపై బలంగా గళం విప్పగలరు. ఇక్కడ మాకు మద్దతు ఇచ్చిన బీజేపీ నాయకులు బుర్రా కృష్ణంరాజుకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించబోతోంది. దానికి నేటి నామినేషన్ కి మద్దతుగా తరలివచ్చిన ఆశేష ప్రజానీకమే తార్కాణం అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.

వైసీపీ సర్కార్ చేతిలో మీడియా నలిగిపోయింది

నెల మొదటి తేదీన సామాజిక పింఛన్లు ఇళ్లకు తీసుకువెళ్లి ఇవ్వకపోతే దాని వెనుక ప్రభుత్వ కుట్ర ఉన్నట్టే. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ప్రభుత్వ అధికారులు అడ్డంకులు కలిగించకపోతే ఫించన్ ఇంటికే చేరుతుంది. ఈ ప్రభుత్వం చేతిలో నలిగిపోయిన మీడియాకి మేము అండగా ఉంటాం. మీ కష్టాల్లో పాలు పంచుకుంటాం. గతంలో ముక్కోణపు పోటీ ఉంది. ఇప్పుడు ఉమ్మడిగా ముందుకు వెళ్లడం వల్ల సమస్యలపై మరింత బలమైన పోరాటానికి అవకాశం ఉంటుంది” అని జనసేనాని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు, పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ , బీజేపీ ఇంఛార్జ్ బుర్రా కృష్ణంరాజు, కాకినాడ ఎంపీ అభ్యర్ధి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివప్రతాప్, పార్టీ నాయకులు మర్రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీతో పొత్తు పెట్టుకొన్న జనసేనకి ఓటు ఎందుకు వేయాలి: అక్షర సందేశం