MudragadaMudragada

గతమెంతో ఘనమైన ఓ కాపోడా!

నేడు నువ్వు సాధించినది ఏమిటి?

కాపు రిజర్వేషన్ అంశం

కాపు రిజర్వేషన్ అంశం అటక ఎక్కినట్లేనా? కాపులకి మిగిలిన బాధిత వర్గాలకు ఉన్న గత అన్యోన్యత ఎటువంటిది? కాపు కార్పొరేషన్ ఎలా వచ్చింది. కార్పొరేషన్ వల్ల కాపు తదితరులు సాధించింది ఏమిటో? వీరి ఉద్యమాల వల్ల వీరు ఏమి కోల్పోయారు అనే విషయాన్ని చర్చించాలి అంటే కాపుల చరిత్ర లోతుపాతుల్లోంచి తెలిసికోవడం జరగాలి.

కాపు, బలిజ, ఒంటరి తదితర కులాలు కొన్ని శతాబ్దాలపాటు ఎన్నో రాజ్యాలను పాలించారు. జనాభాలో సుమారు ౩౦% వరకు వీరు ఉన్నారు. అటువంటి వీరు ఎన్నో ప్రభుత్వాలను ఏర్పరచ గలిగే, పడగొట్ట గలిగే వారుగా మాత్రమే మిగులుతున్నారు. అంబెడ్కర్ లాంటి మేధావులతో స్నేహత్వం చేయగలిగిన చరిత్ర కాపు తదితర కులాలకు ఉంది.  బీసీలకు దక్కిన రిజర్వేషన్’లకు కారణ భూతులైన పెరియార్ వంటి మహాశయులు కూడా వీరిలో జన్మించారు. వీరిలో లెక్కకు మించిన  మేధా సంపత్తి కలిగి ఉన్న ఉద్ధండులు జన్మించారు. కానీ ఈ కాపులు నేడు కేవలం ఎందుకు పనికి రాని కుల కార్పొరేషన్’కి ఒప్పు కొన్నారా? అలా ఎందుకు ఒప్పుకొన్నారు?  ఈ కుల కార్పొరేషన్ వల్ల ఒనగూరే ప్రయోజనాలు ఏమిటో ఈ జాతికి తెలియదా? తెలిస్తే ఎందుకు మిన్నకుండి పోతున్నారు

కాపుల ఘనమైన గత చరిత్ర

క్రీస్తు పూర్వం కంటే ముందు నుండి ఎన్నో రాజ్యాలను  కాపు, బలిజ, ఒంటరి తదితర కులాలు పాలించారు. ఈ కాపు తదితర కులాలు  క్రీస్తు శకం 1600 (సుమారు) వరకు కూడా సుమారు 56  సామ్రాజాలను పరిపాలించారు. కాపులు తదితర కులాలు నేటి ఎన్నో పాలక వర్గాలకు మూల భిందువులు. అటువంటి ఈ  కాపులు తదితర కులాల ఘనమైన గత వైభవం కాలగమనంలో ఆర్ధికంగా కరిగి పోయింది. చరిత్ర పేజీలతో పాటు వీరు కూడా  చితికి పోయారు. వీరి రాజ్యాలు పోయాయి. వీరి వనరులు తరిగి పోయాయి. వీరి ఘనచరిత్ర కూడా లేకుండా నేడు  మరుగున పడిపోయింది. వెరసి ఈ కులాలు వెనుకబడ్డ కులాలుగా మారిపోయారు. అందుకే నాటి బ్రిటిష్ ప్రభుత్వంచే కాపులు, బలిజలు, ఒంటరులు తదితర కులాలు వెనుక బడ్డ కులాలుగా గుర్తించబడ్డారు అని చరిత్ర చెబుతున్నది.

కొన్ని వందల సంత్సరాల పాటు కాపు, బలిజ, ఒంటరి తదితర కులాలే గ్రామా / పట్టణ పెద్దలుగా (శెట్టి సంఘం) ఉండేవారు. ఈ కులాలకు చెందిన వారే స్థానిక చట్టాలను చేస్తుండేవారు. వీరే తీర్పులు ఇస్తుండేవారు. రాజు మారినా గాని వీరు చేసిన చట్టాల్లో పెద్దగా మార్పు ఉండేది కాదు. ఆ గ్రామ, పట్టణాల్లో ఉన్న అన్ని కులాలు ఈ కాపు నాయకులకు మద్దతు నిస్తూ ఉండేవారు అని చరిత్ర చెబుతున్నది. అయితే బ్రిటిష్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ శెట్టి సంఘాలకు ప్రాభల్యం తగ్గడం, స్థానిక న్యాయ వ్యవస్థలు రావడంతో మిగిలిన కులాల్లో కాపులు తదితర కులాలపై వ్యతిరేకత రావడం మొదలు అయ్యింది.  బ్రిటిష్ చట్టాలు పతనం మొదలు అయ్యింది. కాపుల కింద పనిచేసే కొన్ని కులాలు తమ ఆధిపత్యం కోసం పునాదులు వేసికోవడం మొదలు పెట్టారు అంటుంటారు.

కాపు రిజర్వేషన్  గత చరిత్ర! 

కీ. శే. 1910 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కాపు, బలిజ, ఒంటరి తదితర కులాలకు రిజర్వేషన్స్ ప్రాంభమైనవి. ఆ రిజర్వేషన్స్ మాంటేగ్ – చెమ్స్ ఫర్డ్ & రిపోర్ట్ -1919 లోను కొనసాగాయి. గవర్నమెంట్ అఫ్ ఇండియా ఆక్ట్ 1935 లోను కొనసాగాయి. స్వత్రంత్ర భారత దేశంలో కూడా ఈ కులాలకు రిజర్వేషన్స్ కొనసాగినట్లు ఆధారాలు ఉన్నాయి. 1953 లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలోనూ, స్టేట్ అఫ్ తెలంగాణ లోను ఈ కాపు, బలిజ, ఒంటరి తదితర కులాలకు రిజర్వేషన్స్ కొనసాగినట్లు చరిత్ర చెబుతున్నది.

కాపు రిజర్వేషన్లు ఎప్పుడు ఆగిపోయాయి?

అయితే 1956 , నవంబర్ వరకు ఈ కులాలకు రిజర్వేషన్స్ కొనసాగాయి. కానీ 1956లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవ రెడ్డి  ఏ విధమైన కమీషన్ రిపోర్ట్ లేకుండా కాపులు, బలిజలు, ఒంటరులకు రిజర్వేషన్స్ తీసివేసినట్లు రికార్డులు తెలియ చేస్తున్నాయి.

అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. కాపులకి రిజర్వేషన్ల విషయంలో కుర్మా వెంకట రెడ్డి నాయుడు లాంటి వారికి నాడు బాబా సాహెబ్ అంబేద్కర్  మద్దతు పలికారు. మరల 1961లో ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్య (ఒక దళిత సోదరుడు) కాపు రిజర్వేషన్స్’కి మద్దతు పలికారు. నాటి రెడ్డి వార్ల ప్రభుత్వాలు తీసేసిన కాపు రిజర్వేషన్స్’ని దళిత బిడ్డలు కాపులకి మద్దతు పలికారు. కాపు రిజర్వేషన్లని పునరుద్ధరించారు.

కాపు రిజర్వేషన్లను తీసివేసింది ఎవరు?

దామోదరం సంజీవయ్య  మధ్యంతర ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లను పునరుద్ధరించారు. కానీ  శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి  ప్రభుత్వం సమయంలో కొన్ని సాంకేతిక కారణాలతో కాపుల రిజర్వేషన్స్’ని తీసివేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా శ్రీ నీలం సంజీవ రెడ్డి ఉన్నారు. అయితే నాటి కాపు నాయకులు ఎవ్వరు అంత స్థాయిలో నాటి ప్రభుత్వంపై ప్రతిఘటించక పోవడం విచారకరం.

నాటకీయ పరిణామాల్లో  కాపులపై కోట్ల నిర్ణయం!

1994 లో కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని నాటి కోట్ల ప్రభుత్వం జీవో జారీచేసింది. ఆ జారీచేసిన జీవోని రాష్ట్ర హైకోర్ట్ కూడా సమర్ధించినట్లు ఆధారాలు ఉన్నాయి. అయితే 1995 తరవాత వచ్చిన తెలుగు దేశం ప్రభుత్వం (బాబు) కాపు రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టింది గాని, నాటి జీవోని అమలు జరపలేదు. అయినా కాపు పెద్దలు, కాపు ఉద్యమ నాయకలు ప్రతిఘటించలేదు.

తదనంతరం వచ్చిన రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం, ముస్లిం సోదరులకు రిజర్వేషన్లు ఇచ్చి, ఎప్పటి నుండో పెండింగ్’లో ఉన్న కాపు రిజర్వేషన్లు అంశాన్ని పక్కన పెట్టి, ఈ అంశానికి శాశ్వతంగా ముగింపు పలికినట్లు చేసింది అని అంటారు. ఇక్కడ కూడా కాపు నాయకులు అంత స్థాయిలో ప్రతిఘటించలేదు. నాటి పాలకుడితో అంతర్గతంగా కలిసిపోయారు. కాపు నాయకులు రాజన్న ప్రభుత్వంపై ఎందుకు నోరెత్తలేదు? కాపు నాయకులు ఎందుకు మిన్నకుండి పోయారు అనే కారణాలు కాపు యువత తెలిసికోలేక పోతున్నారు.

2014 లో మరల మొదలు అయ్యిన కాపు కుంపట్లు!

అయితే కాపు కుంపట్లు, కాపు ఉద్యమాలు 2014  లో మళ్ళీ మొదలు అయ్యాయి. ఈ ఉద్యమాలు  వ్యతిగత కక్షలతో మొదలుపెట్టార్రా, లేక రాజన్న కుటుంబంపై ఉన్న ప్రేమతో మరల మొదలు పెట్టారా లేక కాపులపై ప్రేమతో మొదలు పెట్టారా అనేది ఆ పెరుమాళ్ళకే ఎరుక?  అయితే 2014 జరిగిన కాపు ఉద్యమాల పర్యవసానాల ఫలితంగా నాటి బాబు ప్రభుత్వం కాపు రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టి, కార్పొరేషన్’ని ఏర్పాటు చేసింది. దానికి కొన్ని విధి విధానాలు కూడా పెట్టింది. అయినా కాపు నాయకులు ప్రతిఘటించక నిద్ర పోవడం మొదలు పెట్టారు? అలసట నటిస్తున్నారు. అవసరాల కోసం ఉద్యమ నాయకులు తీర్చుకొనే అలసటను కాపు యువత తెలిసికోలేక పోతున్నది.

కాపు ఉద్యమాలు ఎవరి కోసం?

ఏ ఉద్యమం అయిన సమాజం కోసమో లేక సమాజంలోని భాగమైన అణచివేయబడ్డ కొన్ని కులాల సమూహం కోసమో చేస్తే తప్పు లేదు. కానీ ఏ కుల ఉద్యమం అయినా ఒక పాలక వర్గంపై ద్వేషంతోనో లేక మరొక పాలక వర్గాన్ని అధికారంలోకి తేవడం కోసమో చేస్తే ముమ్మాటికీ తప్పే అవుతుంది. అప్పుడు అటువంటి ఉద్యమాల వల్ల ఆ కులానికి జరగరాని నష్టం జరిగి తీరుతుంది.

ఇక్కడ కాపు తదితర కులాలకు అదే జరిగింది. 1985 నుండి జరిగిన కాపు ఉద్యమాలు అన్నీ కూడా ఒక బాబు వర్గానికి వ్యతిరేకంగా, మరొక బాబు వర్గానికి అనుకూలంగా జరిగినట్లే అర్ధం అవుతున్నది. అది యాధృచ్చికమా లేక  దొడ్డల వర్గం కోసమే మన నాయకులు ఉద్యమాలు చేశారా అనేది విజ్ఞులైన కాపు యువత తెలుసు కోగలరు.

ఇప్పటి వరకు జరిగిన కాపు ఉద్యమాల వల్ల క్రింది స్థాయి కాపులు తదితర కులాల్లో యూనిటీని తేగలిగాయి. ప్రభుత్వాల్లో ఒక భయాన్ని సృష్టించగలిగాయి. కానీ క్రింది స్థాయి కాపుల్లో వచ్చిన ఆ యూనిటీ కాపు నాయకుల్లో మాత్రం రాలేదు. నాయకులూ కులాన్ని అమ్ముకొంటూ ఎదుగుతున్నారు. తోడేళ్ళ లాంటి తమ తమ నాయకులను నమ్ముకొని ఈ కాపులు మోస పోతున్నారు.

కాపు నాయకులు ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు మసులు కొంటున్నారు. అవకాశం వచ్చిన ప్రతీ వాడు తమ కులాన్ని అమ్ముకొని, కులం వెన్నెముకపై నడుచుకు పోతూ తమకు తాము ఎదగడం మొదలు పెట్టారు అనే ఆరోపణలు ఉన్నాయి. అలానే తమకు దక్కిన ఆ చిన్న చిన్న పదవులను అనుభవిస్తూ సంతృప్తి పడసాగారు. ఈ కుల నాయకులు తమకు దక్కిందే చాలు అనుకొన్నారు గాని తమకు దక్కాలిసింది ఎంత అనే దాన్ని పూర్తిగా విస్మరించారు అనే చెప్పాలి. పాలకుల ఉచ్చులోపడి, రాజ్యాధికారం కోసం కాకుండా కులాన్ని ఏకాకులను చేసి కుల ఉద్యమాలపై పోరాటం చేస్తున్నట్లు జీవించడం కొనసాగించారు.

ఇది పాలకుల కుట్రనా లేక నాయకుల అవకాశవాదమా?

అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. కాపు ఉద్యమాల వల్ల పాలక వర్గాల్లో కలిగిన భయమే కాపు, బలిజ, ఒంటరి తదితర కులాల కొంప ముంచింది అని చెప్పాలి. కాపులకి, మిగిలిన వర్గాలకు నిత్యం తగాదాలు ఉండేటట్లు పాలకులు తమ పన్నాగాలు పన్నుతుండేవారు. ఆ కుట్రల్లో ప్రధాన భాగస్వాములు కాపు తదితర కుల నాయకులే అనేది కూడా అందరికి తెలుసు. కుల నాయకులు తమ స్వలాభం కోసం  పాలకుల చేతుల్లో తొత్తులుగా ఉంటూ వచ్చారు. తమ కులాలకు అన్యాయం చేస్తూ వచ్చారు. కాపు యువత కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క కుల నాయకుల గ్రూపుకి వత్తాసు పలుకుతూ వస్తున్నారు?

కాపులకి చివరకి మిగిలింది ఏమిటి?

వెరసి కాపులు సమాజంలో ఏకాకులుగా మిగిలి పోయారు. పల్లకీలు మోసే వారుగా, ప్రభుత్వాలు మార్చేవారుగా, కొన్ని కులాలకు రక్షకులుగా కొన్ని కులాలకు ద్వేషులుగా వీరు మిగిలిపోయారు. దీనికి అంతటికి ముద్రగడ చేసిన ఉద్యమం ఒక కారణం కావచ్చునేమో గాని పూర్తిగా ముద్రగడ కాదు అని కూడా గ్రహించాలి. ఒక్కో కాపు నాయకుడు గ్రూపు ఒక్కో పాలక వర్గానికి కాపు కాసేవారుగా ఉండడమే కాపులు తదితర కులాల నేటి దుస్థితికి ప్రధాన కారణం అని అర్ధం చేసికోవాలి. ఉద్యమాల వల్ల నిజాయితీ పరుడైన ముద్రగడ ఎంతో కోల్పోయారు. అలానే ముద్రగడ చేసిన పక్షపాత వైఖిరితో కూడిన ఈ ఉద్యమాల వల్ల కులం కూడా ఏకాకి అయ్యింది. కాపు యువత భవిత సర్వ నాశనం అయ్యింది అనే వాస్తవాలు బయట పడుతున్నాయి?

సమాజానికి, ముఖ్యంగా కాపు, బలిజ, ఒంటరి తదితర కులాల్లో ఉన్న యువతకి వీరికి జరిగిన అన్యాయం ఏమిటి? దీనికి కారకులు ఎవ్వరు అనే దానిపై కొన్ని వాస్తవాలు తెలిసికొన్నాం. ఇక అసలు  విషయానికి వద్దాం. ఇప్పుడు కాపు రిజర్వేషన్ ఉద్యమాలు, కాపు కార్పొరేషన్ గురించి కూడా  వాస్తవాలను చర్చించడం మొదలు పెడదాం.

కోట్ల ప్రభుత్వం కాపులకు జారీచేసిన GO

కాపు, బలిజ, ఒంటరి తదితర కులాలతో పాటు, మరికొన్ని కులాలతో కలిపి మొత్తం 14 కులాలకు బీసీ ప్రతిపత్తి ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం GO MS No 30  ఆగష్టు 25 , 1995 న ఒక గవర్నమెంట్ ఆర్డర్ జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్ర హైకోర్ట్ కూడా ఈ GO ని సమర్ధించినట్లు ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికీ  నాటి GOని అమలు జరపాలని నాటి చంద్రబాబు ప్రభుత్వం గాని, తరువాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి ప్రభత్వం కానీ చొరవ చూపలేదు. కాపు నాయకులు కూడా అమరాలు జరిపామని ఉద్యమించ లేదు.

1995 తరువాత వచ్చిన దురదృష్టం ఏమిటంటే మిగిలిన 9 కులాలకు బీసీ ప్రతిపత్తి లభించింది. కానీ కాపు, బలిజ, ఒంటరి తదితర 4 కులాలకు మాత్రం బీసీ ప్రతిపత్తి ఇప్పటికీ రాలేదు. మాకు మాత్రమే ఎందుకు రాలేదు అని కాపు నాయకులు కూడా పాలకులను గట్టిగా అడిగినట్లు కనిపించడం లేదు. వారి వారి స్వార్ధ ప్రయోజనాలకు ఆశపడి కాపుల రిజర్వేషన్స్ గురించి పట్టించుకొన్న నాధుడే  కాపుల్లో లేక పోయాడు. ఒక్క ముద్రగడనే ఉద్యమాలు చేశారు. అయితే ఆ ఉద్యమాలు ఒక వర్గానికి అనుకూలం అనే ఆరోపణలు రోజు రోజుకీ బలపడుతున్నాయి. ఇక్కడ ఉన్న మర్మాన్ని యువత తెలిసికోగలిగితే వాస్తవాలు బయట పడతాయి.

చెయ్యెత్తి జై కొట్టు కాపోడా గత మెంతో ఘనకీర్తి కలవాడా

“చెయ్యెత్తి జై కొట్టు కాపోడా గత మెంతో ఘనకీర్తి కలవాడా” అనే వాడి నోరు నొక్కేయడంలో / అటువంటి వాడిపై బురద చల్లేయడంలో కాపు రాజకీయ / ఉద్యమ నాయకులు, మేతావులు ముందుంటారు. అలానే నీజాతికి అన్యాయం జరుగుతున్నది. నీ అసమర్ధ – అనైక్య పోరాటాల వల్ల నీతో పాటు నిన్ను నమ్మాలనుకొంటున్న మిగిలిన అణగారిన వర్గాలకు కూడా అన్యాయం జరుగుతున్నది అని చెప్పే వాడిపై విరుచుకు పడతారు. అమ్ముడు పోయాడు అనే బురద చల్లడం వీరి నాయకులే మొదలు పెట్టేస్తారు. పాలక పార్టీల పంచన ఉంటూ కులంలో వస్తున్న  చైతన్యాన్ని పాలకులకు అమ్మేస్తూ ఉంటారు అనే ఆరోపణలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.. అంతే గాని కాపు కార్పొరేషన్ లాంటి ద్వారా ఈ జాతి ఏమి సాధిస్తాదో చెప్పలేక పోతున్నారు.

అర్ధం పర్ధం లేని, ముగింపు ఎలానో తెలియని రిజర్వేషన్ ఉద్యమాల వల్ల ఏకాకులము అవ్వుతున్నామే గాని ఏమి సాధిస్తున్నామో ఇప్పటికీ వీరు తెలిసికోలేక పోతున్నారు. కొంత మంది నాయకులు ఒక పాలక వర్గం పల్లకీ, మరికొంత మంది నాయకులు మరొక పాలక వర్గం పల్లకీలు మోస్తూ వస్తున్నారు. జాతి భవితని పాలకులకి తాకట్టు పెడుతున్నారు. జాతి ఐక్యతకు పూనికోని కుల పెద్దలను నిలబెట్టి అడగలేక పోతున్నాము అనే అంతర్మధనం కాపు యువతలో/ ప్రజానీకంలో కూడా లేదు

కాపులు కాపు ఉద్యమాలు విఫలం అవ్వడానికి కారకులు ఎవ్వరు?

దీనికి బాధ్యులు ముద్రగడ వర్గమా? లేక అమ్ముడు పోతున్న తతిమ్మా కుల నాయకులా? లేక వీరి తప్పులను నోరెత్తి చూపలేని చిరునా లేక పరమపదించిన గత కాపు నాయకులా? అందరూ బాధ్యులే. అలానే నిజాయితీగా వచ్చిన పవన్ కళ్యాణ్ లాంటి వారికి మద్దతు నివ్వకపోయిన కాపు ప్రజలు కూడా దేనికి బాధ్యులే. వీరు అందరూ కూడా ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు పోట్లాడుకొంటూ పోతున్నారు. కానీ అందరిని సమీకరించి, సమైక్య పరచి, ఉత్తేజ పరచే వారు వీరిలో కరువయ్యారు. తమ చిరకాల లక్ష్యం అయిన రాజ్యాధికారం వైపు తీసికెళ్ళే పవన్ కళ్యాణ్ లాంటి కొత్త నాయకుడుని కూడా వీరు ( కాపులు) నమ్మక పోవడం విచారకరం. ఆ నాయకుడు వెంట వీరు నడవడం పోవడం కూడా ఈ కులాలు చేసికొన్న దురదృష్టం అని కాపు యువత బలంగా నమ్ముతున్నది.

మెగా కుటుంబం బాధ్యత ఏమిటి?

అలానే కాపులు కూడా సమాజంలో ఒక భాగమే. వీరి అందరిని కూడా కలుపుకొని వెళ్ళలిసిన అవసరం నాకు ఉంది. వీరిని సమైక్య పరిచే బాధ్యతని తీసికొని ముందుకు వెళతాను అని జనసేనుడు కూడా భావించాలి. జాతితో పాటు మిగిలిన అణగారిన వర్గాలు కూడా ఇదే కోరుకొంటున్నాయి. రాజ్యాధికారం కోసం వస్తున్న  చైతన్యాన్ని వినియోగించు కొంటూ, అందరిని కలుపుకొని వెళ్లకపోతే జనసేనుడు కూడా విఫలం చెందవచ్చు. అలానే రాజ్యాధికారం సాధించాలి అనే కాపు జాతి ఆశలు కూడా మరొక్కసారి ఆవిరి కావచ్చు.

రిజర్వేషన్ ఇస్తాను అని మోసం చేసిన నాయకుడి వెంట నడుస్తారు. రిజర్వేషన్ ఇవ్వలేను అని బహిరంగంగా చెప్పిన పార్టీ అధినాయకుడి వెంట కూడా నడుస్తారు. కానీ రిజర్వేషన్ కోసం పోరాడుతాను అని తన మేనిఫెస్టోలో పెట్టిన తమ పార్టీ నాయకుడు జనసేనుడు వెంట నడవక ఓడిస్తారు.

కాపులు ఎక్కడ ప్రలోభ పడుతున్నారు?

రాజ్యాధికారం కావాలి అనే చైతన్యం వస్తున్న దశలో రంగాని కోల్పోయారు. రంగాని కోల్పోవడం ద్వారా వీరికి అన్యాయం జరిగింది అనే ఆలోచన వీరిలో వస్తున్న దశలో రిజర్వేషన్ కావాలి అనే కాలం చెల్లిన ఉద్యమాలతో  కాలం గడిపారు. ఇక్కడే  పాలకుల ఉచ్చులో పడి కాపులు విఫలం చెందుతున్నారు. అయితే కాపు నాయకులు, కొంతమంది ఉద్యమ నాయకులు మాత్రం  కాపుల వైభవ సమాధులపై వృద్ధి చెందుతున్నారు. తద్వారా కాపులు తమ సమాధులను తామే తవ్వు కొంటున్నారు అని విశ్లేషకులు అంటుంటారు. పోనీలే రిజర్వేషన్ కోసం అయినా కలిసిగట్టుగా పోరాడుతారా అంటే ఎవరి స్వార్ధం వాడిదే? ఎవరి పల్లకీల మోత వారిదే? ఎవ్వరి అమ్మకాలు వారివే.

పోరాటం చెయ్యని జాతి బానిసత్వంలో మగ్గిపోతుంది!

ఇప్పటికైనా అందారూ ఒక్కటవ్వాలి. జాతి ప్రయోజనాలను పట్టించుకోకుండా, పాలకుల పల్లకీలు మోసే కుల నాయకులను ఇప్పటికైనా నిలదీయాలి. అవసరమైతే వీరి అందరిని దూరం పెట్టాలి. మేధావులు కూడా వీరికి చేయూత నివ్వాలి. ప్రజలను చైతన్య  పరచాలి. ఒక పక్క కాపు కార్పొరేషన్ ద్వారా కాపులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడుతూనే, మరొక పక్క రాజ్యాధికారం కోసం పోరాడాలి. ఆ రెండు పాలక వర్గాల పల్లకీలు మోయడం కాదు. మన పల్లకీని మనమే మోద్దాం. అలానే అవసరమైతే మన సోదర తాడిత, పీడిత, భాదిత వర్గాల పల్లకీలు కూడా మనం మోద్దాం. కలిసిగట్టుగా పోరాడి రాజ్యాధికారంలో మార్పు తీసికొద్దాం అనే చైతన్యంతో యువత ముందుకు సాగాలి.

కాపు యువత మేల్కొనక పోతే, మీ కుల నాయకులు మాత్రం రోజు రోజుకీ ఎదుగుతూ ఉంటారు. కానీ నీ తాత, నీ తండ్రి, నీలాగే రేపు నీ బిడ్డలు, వారి బిడ్డలు కూడా పాలకుల పల్లకీలు మోస్తూనే ఉండాలి? పాలకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాస్తూనే ఉండాలి. డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ చెప్పినట్లు పోరాటం చెయ్యని జాతి బానిసత్వంలో మగ్గిపోతుంది. చివరకు కాల గర్భంలో కలిసిపోతుంది. నీ జాతిని సక్రమ మార్గంలో నడిపిస్తారో లేక మీలో మీరే తిట్టుకొంటూ, కొట్టుకొంటా మీ జీవితాలను నెట్టుకొస్తారా అనేది మీ ఇష్టం.

ఆలోచించండి…. కాపు కార్పొరేషన్ కాపు రిజర్వేషన్లకి ప్రత్యామ్న్యాయము కాదు. అలానే రాజ్యాధికారానికి కాపు రిజర్వేషన్ ప్రత్యామ్నాయం కాదు. రిజర్వేషన్లుతో పాటు రాజ్యాధికారం వస్తే దాని వల్ల జాతి మొత్తం బాగు పడుతుంది. “గతమెంతో ఘనమైన ఓ కాపోడా-నేడు నువ్వు సాధించినది ఏమిటి అనేదే ఇప్పటికైనా తెలుసుకో?

(సమాజంలో కాపులు భాగం. అలానే సమాజంలో కాపుల అభివృద్ధి కూడా అవసరమే. అణగారిన వర్గాలకు అధికారం దక్కాలి అనే భావనతో రాసాను తప్పా మీ నాయకులనుగాని లేదా వారి అభిమాన గణాన్ని గాని కించపరచాలని నా భావన కాదు. మీలో ఎవ్వరి భావాలు గాయపడిన నన్ను క్షమించ గలరని మనస్సుపూర్తిగా కోరుకొంటా మీ అక్షర సత్యం)

Spread the love