Pawan at Mangalagiri office

కూల్చివేతలతో పరిపాలన ప్రారంభించిన వైకాపా ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చివేయటంపై పవన్ మండిపడ్డారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చినందుకే గ్రామస్థులపై ప్రభుత్వం కక్ష కట్టిందని జనసేనాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఓటు వేయనివారు శత్రువులన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పవన్ అన్నారు. వైకాపాకి ఓట్లేసిన 49.95 శాతం మందికి మాత్రమే పాలకులం అన్నట్లుగా తీరు ఉందని అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు పవన్‌ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

”ఇప్పటం గ్రామంలో ఇప్పటికే 70 అడుగుల రోడ్డు ఉంది. ఆర్టీసీ బస్సులు కూడా రాని గ్రామంలో 120 అడుగుల మేర రోడ్లు వేస్తామని స్థానిక ఎమ్మెల్యే చెప్పడం విడ్డూరంగా ఉంది. కూల్చివేత నోటీసులపై గ్రామస్థులు ఇప్పటికే కోర్టుకు వెళ్లారు. ఇంతలోనే అధికారులు ఇళ్ల కూల్చివేత పనులు చేపట్టారు. ఉదయం నుంచి పోలీసు బలగాల సాయంతో జేసీబీలతో ఇళ్లను కూల్చివేస్తున్నారు. రోడ్డు పక్కనే ఉన్న మంచినీటి ట్యాంక్ వదిలి.. దాని పక్కన ఇంటిని కూలగొట్టారు. అక్కడ ఆందోళనకు దిగిన జన సైనికులు, వీర మహిళలను కూడా పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గం.

ఇప్పటం వాసుల పోరాటానికి జనసేన అండగా నిలబడుతుంది. రెండురోజుల క్రితం నాదెండ్ల మనోహర్ ఇప్పటం వెళ్లినప్పుడు గ్రామంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేసి వైసీపీ నాయకులు తమ కుసంస్కారాన్ని ప్రదర్శించారు. ఈ ప్రభుత్వం కూలిపోయే రోజు ఎంతో దూరం లేదు” అని పవన్‌ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఇది మానవత్వం లేని ప్రభుత్వం: నాదెండ్ల మనోహర్