వైసీపీకి ఏది వద్దనుకుంటుందో అదే జరుగుతుంది
ఇప్పటివరకు టీడీపీతో పొత్తులు, సీట్ల గురించి చర్చించలేదు
బీజేపీ జాతీయ నాయకులతో మంచి సంబంధాలు
స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయ ప్రయోజనం కోసమే వైసీపీ ప్రయత్నం
గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ జనసేన లక్ష్యం
మద్యం దుకాణం వద్దు అంటే రద్దు చేస్తాం
ముస్లింలకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా అండగా ఉంటా
మదం ఎక్కి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు.
కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి.
యువతలో కులరహితంగా అలోచించే పరివర్తన రావాలి
నమ్మకం కలిగిస్తే అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ
భవిష్యత్తు తరాల కోసం జనసేనకు అండగా నిలబడండి
జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్
రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ (YCP) ఏది జరగకూడదని కోరుకుంటుందో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అదే జరుగుతుంది. మనమంతా ఏది జరిగితే బాగుంటుందని అనుకుంటున్నామో అదే అవుతుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ (Janasena Party) రాష్ట్ర రాజకీయ యవనికపై బలమైన సంతకం కాబోతోంది. వచ్చే ఎన్నికల్లో మా ప్రణాళికలన్నీ అసెంబ్లీలో బలమైన పక్షంగా అడుగు పెట్టేలా ఉంటాయి. నాతో పాటు మా నేతలంతా గెలిచేలా ముందుకు వెళ్తాం తప్ప రాజకీయ ప్రయోగాల జోలికి వెళ్లేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయపరంగా ఈసారి జనసేన బలి పశువు కాదు. కాబోదు అని జనసేన పార్టీ (Janasena Party) అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉద్ఘాటించారు.
జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ నభూతో అన్న రీతిలో మచిలీపట్నం వేదికగా మంగళవారం సాగింది. లక్షలాదిమంది జనసైనికులు, వీర మహిళల సమక్షంలో జరిగిన ఈ ఆవిర్భావ సభ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” రాజకీయాల్లో ఓటమి చెందినా ప్రజలకు అండగా నిలబడ్డాం. మరి ఎన్నికల్లో గెలిస్తే ఇంకెంత చేయగలమో ప్రజలు ఆలోచించాలి. నేను ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర హితం కోసమే ఉంటుందని నమ్మండి.
తెలుగుదేశం పార్టీ అంటే నాకేమీ కొత్తగా ప్రేమ లేదు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులుగా చంద్రబాబు అంటే గౌరవం మాత్రం ఉంది. అదే గౌరవం ఇప్పటి ముఖ్యమంత్రి మీదా ఉంటుంది. నేను ఇప్పటి వరకు టీడీపీ అధినేతతో పొత్తుల గురించి, సీట్లు గురించి చర్చించింది లేదు. ప్రతి వాట్సాప్ మెసేజ్ కు నన్ను సమాధానం చెప్పమంటే ఎలా..? నేను ఏది చేసినా పారదర్శకంగా, బహిరంగంగా మాత్రమే ప్రజల మధ్యలో చేస్తాను. రహస్య ఒప్పందాలు చేసుకునే వాడిని కాదు.
మోదీ బలమైన నాయకత్వం
నాకు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. 2014లో జనసేన పార్టీ పెట్టినప్పుడు మోదీ బలమైన నాయకత్వం దేశానికి కావాలని కోరుకున్న వాడిని. అందుకే ఆ సమయంలో బీజేపీకి మద్దతుగా నిలిచాను. తర్వాత కూడా బీజేపీకి అనేక పర్యాయాలు మద్దతుగా నిలబడ్డాను. అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఉమ్మడి కార్యక్రమాలకు ముందుకు రాకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అమరావతి రాజధాని విషయంలోనూ బీజేపీ జాతీయ నాయకులు ఒక భారీ లాంగ్ మార్చ్ ను జనసేన పార్టీ, బీజేపీ సంయుక్తంగా నిర్వహించేలా ప్లాన్ చేశారు. దీనివల్ల రాష్ట్రంలో ఇరు పార్టీల బలం పెరగడంతో పాటు ప్రజల ఆకాంక్షలు రాజధాని మీద నెరవేరుతాయని భావించాం.
అయితే తర్వాత దానిని ముందుకు తీసుకు వెళ్ళలేకపోయాం. బీజేపీ జాతీయ నాయకులు మాతో చాలా క్లియర్ గా ఉన్నారు. నాకు వారితో మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే స్థానిక బీజేపీ నాయకులు మాత్రం నేను తెలంగాణలో పోటీ చేస్తాను అంటే ఆంధ్ర వ్యక్తివి అంటున్నారు. వారికి మద్దతు ఇవ్వాల్సిన సమయంలో మాత్రం ఆ మాట అనడం లేదు. ముందుగా నేను భారతీయుణ్ణి. ఏ సమస్యల గురించి అయినా, ప్రజాస్వామ్యయుతంగా ఎక్కడి నుంచి పోటీ చేయడానికి అయినా నేను సంసిద్ధంగా ఉంటాను. నేను భారతీయుడిని అన్న భావన ఉంది కాబట్టే బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లోకి వస్తే మనస్ఫూర్తిగా స్వాగతించాను అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.
స్టీల్ ప్లాంట్ మీద పోరాటం విషయంలో మా ప్రణాళిక పని చేయలేదు
రాష్ట్ర ప్రయోజనాలకు ఎప్పుడు భంగం కలిగినా గట్టిగా మాట్లాడే వ్యక్తిని. దానికోసం మిత్రపక్షం బీజేపీ నాయకులతోనూ మాట్లాడాం. గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ విషయంలో సమస్య తలెత్తినప్పుడు మేం బీజేపీ జాతీయ నాయకులతో మాట్లాడినప్పుడు దానికి ఒక పరిష్కారం లభించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళినప్పుడు జనసేన పార్టీ తరఫున ముందుగా స్పందించింది నేనే. దానికోసం కేంద్ర నాయకులతోనూ మాట్లాడాను. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది రాష్ట్ర ప్రజల భావోద్వేగ సమస్యగా వారికి వివరించాను. సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని కోరాను. అయితే తర్వాత వైసీపీ నాయకులు ఉద్యమంలోకి వచ్చాక ఉద్యమం సరైన రీతిలో సాగలేదు. మాకు చట్టసభల్లో కనీసం ఎలాంటి బలం లేకపోయినా జాతీయ నాయకులతో మాట్లాడగలిగాం.
25 సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా మెడలు వంచి తీసుకువస్తామని చెప్పిన పెద్ద మనిషి… ఢిల్లీ వెళ్లి కనిపించిన ప్రతి వారి వద్ద తానే మెడలు వంచుతున్నారు. అంతా కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఒకరోజు రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తే ఎందుకు సమస్య తీరదు? జిందాల్ కు సొంత గనులు కేటాయించినట్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎందుకు సొంత గనులు కేటాయింపు జరగదు..? కచ్చితంగా ఐక్యంగా ఉంటే సమస్య తీరుతుంది. అయితే రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టని వైసీపీ నాయకులు ఈ సమస్యను రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు అని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.
ఒంటరిగా వెళ్లేందుకు అయినా సిద్ధం
జనసేన పార్టీ బలాబలాలపై కచ్చితంగా నియోజకవర్గాల్లో అన్ని పరిస్థితులను ఆధారంగా చేసుకొని సర్వేలు చేపడతాను. కచ్చితంగా క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలంగా ఉంటే ఒంటరిగా అయినా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. క్రిమినల్ పాలిటిక్స్ నుంచి రాష్ట్రాన్ని రక్షించాలి. ఈ రాష్ట్రాన్ని నేరస్థుల నుంచి విముక్తం చేయకపోతే అరాచకం రాజ్యమేలుతుంది. జనసేన పై జరుగుతున్న గోబెల్స్ ప్రచారాన్ని నమ్మకండి. జర్మనీలో అసత్య ప్రచారం చేసిన గోబెల్స్ చివరకు దిక్కు లేని చావు చచ్చాడు. రాష్ట్రంలోనూ జనసేన పార్టీపై గోబల్స్ ప్రచారం చేసిన వారికి అదే గతి పడుతుంది అని జనసేనాని అన్నారు.
తిన మరిగిన కోడి వైసీపీ
మా మగతనం గురించి, దమ్ము గురించి వైసీపీ నాయకులకు ఎందుకు..? మీ రాజకీయం మీరు చేసుకోండి. మేం రాజకీయంగా ఎలా బలపడాలో ఎక్కడ పోటీ చేయాలో మేము చూసుకుంటాం. 175 స్థానాల్లో పోటీ చేయాలో లేదో మేం చూసుకుంటాం. బాగా తిన మరిగిన కోడి ఇల్లు ఎక్కి కూసింది అంట… అలాగే ఉంది వైసీపీ నాయకుల మానసిక స్థితి. ఇసుక, గంజాయి, మద్యం, మైన్లు ద్వారా దోచేసిన సొమ్మును, ప్రజల నుంచి ఎలాంటి బిల్లులు లేకుండా అనధికారికంగా సేకరించిన సొమ్మును ఎన్నికల్లో మళ్లీ ప్రజలకే పంచేందుకు వైసీపీ నాయకులు చూస్తున్నారు. అంటే మన ఆరోగ్యాలు, కాలం కరిగించి ప్రభుత్వానికి కట్టిన సొమ్ము మళ్ళీ మనకే ఇవ్వాలని చూస్తోంది. దీనిని ప్రతి ఒక్కరు గుర్తించాలి అని పవన్ అన్నారు.
మదం తలకెక్కి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దుర్యోధనుడు తొడకొడితే భీముడు ఆ తొడలు బద్దలు కొట్టాడు. వైసీపీ నాయకులు కొట్టే తొడలను జనసేన కచ్చితంగా బద్దలు కొడుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాటను గుర్తు పెట్టుకుంటాం. దానికి కచ్చితంగా మీరు శిస్తు కట్టాల్సిందే. రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజలందరినీ చేతులెత్తి వేడుకుంటున్నా. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి అండగా నిలబడండి. మేము దెబ్బలు తిన్నాం నిలబడ్డాం. ప్రజల గురించి పోరాటం చేశాం. కచ్చితంగా మేం మీకు అండగా ఉండటానికి, రాష్ట్రాన్ని కాపాడడానికి జనసేన పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలను కోరారు.
గంజాయి నిరోధానికి జనసేన కట్టుబడి ఉంది
ఆంధ్రప్రదేశ్ గంజాయి మత్తులో తూగుతోంది. అధికార పక్షమే గంజాయి సాగుకు, రవాణాకు వత్తాసు పలుకుతోంది. దేశవ్యాప్తంగా దొరుకుతున్న గంజాయిలో 26% గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్లడం పరిస్థితి తీవ్రతకు అడ్డం పడుతోంది. ప్రజా ప్రతినిధులు గంజాయి సాగు, రవాణా, అమ్మకాన్ని చక్కగా ప్రోత్సహిస్తున్నారు. నిరుద్యోగ రాష్ట్రంగా మిగిల్చిన ఆంధ్రప్రదేశ్లోని యువత జీవితాలను గంజాయి దెబ్బతో నాశనం చేస్తున్నారు. గంజాయిని భారీగా పట్టుకొని తగులు పెట్టిన రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆ పదవి నుంచి పక్కకు తప్పించిన ప్రభుత్వం ఇది.
అంటే రాష్ట్రంలో గంజాయి ప్రోత్సాహం అధికార పార్టీయే చేస్తున్నట్లు అర్ధమవుతుంది. రాష్ట్రంలో గంజాయి నిరోధానికి జనసేన ప్రభుత్వంలో ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తాం. గంజాయి రవాణా చేసేవారు, సరఫరా చేసేవారు ఎంత పెద్ద వారైనా తాట తీసి కూర్చోబెట్టే బాధ్యతలు మేము తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ను పూర్తిస్థాయిలో గంజాయి లేని రాష్ట్రంగా చేస్తాం అని జనసేనాని ప్రజలు హామీ ఇచ్చారు.
మద్య నియంత్రణకు కొత్త తరహా ప్రణాళిక
రాష్ట్రంలో పూర్తిస్థాయిలో మద్యనిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికి వదిలేసిన వైసీపీ ప్రభుత్వంలా నేను మాయ మాటలు చెప్పను. మద్యం నిషేధం అనేది దాదాపు అసాధ్యం. అయితే మద్య నియంత్రణ కోసం జనసేన ప్రభుత్వంలో ప్రత్యేక విధానం తీసుకువస్తాం. రాలేగావ్ సిద్ధిలో అన్నా హజారే తీసుకువచ్చిన పద్ధతిలో ఆయా ప్రాంతాల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలు మాకు వద్దు అని అక్కడి స్థానికులు చెబితే వెంటనే ఆ ప్రాంతంలో మద్యం దుకాణాలు తీసివేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. మెజారిటీ ప్రజలు వద్దు అన్నచోట బ్రాందీ షాపులు మూసేస్తాం. క్రమంగా మార్పు వస్తే ఆయా ప్రాంతాల్లో పూర్తిగా మద్య నియంత్రణ చేపడతాం. దీనికోసం జనసేన ప్రత్యేక ప్రణాళికతో పని చేస్తుంది అని జనసేనాని వివరించారు.
అప్పట్లో నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు
అమరావతి రాజధాని విషయంలో మొదట్లోనే నేను రాజధానిని చిన్నగా మొదలుపెట్టి తర్వాత క్రమంగా విస్తరించాలని సూచన చేశాను. చిన్నగా కట్టమని చెప్పాను. అదే జరిగితే ఇప్పుడు రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఉండిపోయేది కాదు. న్యాయ రాజధాని అని లోకాయుక్త కర్నూలు తీసుకువెళ్లారు. అక్కడ పూర్తిస్థాయిలో లోకాయుక్తలను నియమించలేదు. న్యాయ రాజధాని అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు విశాఖపట్నం రాజధాని చేస్తామని అంటున్నారు. అక్కడ ఇప్పటికే అభివృద్ధి జరిగింది. వైసీపీ వెళ్లి ఉన్నది దోచుకోవడం తప్పితే అక్కడ అభివృద్ధి చేసేది ఏమీ లేదు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి లాభం పొందడానికి ఇలాంటి నాటకాలు ఆడుతోంది అని జనసేనాని వైసీపీ ప్రభుత్వన్ని దుయ్యబట్టారు.
ఉద్యోగులు మోసపోయారు
సి.పి.ఎస్ రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకుడు తర్వాత అసాధ్యం అని, అప్పట్లో తెలియక హామీ ఇచ్చామని చిన్నపిల్లల మాటలు చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా గ్యారెంటీ పింఛన్ స్కీం తీసుకోవచ్చాం అని మరో మాట అంటున్నారు. దానికోసం వేల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్న పాలకులు అది ప్రజల డబ్బు అని గుర్తు పెట్టుకోవాలి. ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ డబ్బులు సకాలంలో వారికి అందడం లేదు. వారి డబ్బులను కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంది. రూ. 2 వేల కోసం ఈసారి ఎవరు ఓటును అమ్ముకోవద్దు. ఓటును అమ్ముకుంటే మార్పు రాదు. విలువలు మాట్లాడేవాడు ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటాడు. మేం ప్రభుత్వంలోకి వస్తే ప్రభుత్వంలో పారదర్శకత విధానాన్ని కచ్చితంగా తీసుకువస్తాం. ప్రజా ప్రతినిధులు ప్రజలకు ప్రతిదానికి సమాధానం చెప్పేలా మా అకౌంట్ బులిటీ ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ అయినా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. ప్రజా ధనానికి ధర్మకర్తలుగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు ప్రతి అంశానికి పారదర్శకంగా సమాధానం చెప్పేలా అవినీతి లేకుండా మేం చూస్తాం. కళ్ళెదుటే ఇన్ని తప్పులు జరుగుతున్నా ప్రజల్లో ఎందుకు కోపం రాదు..? మా రెడ్డి, మా కాపు అని వదిలేస్తే ఎలా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
ముస్లిం సమాజాన్ని కంటికి రెప్పలా చూసుకుంటా
నేను బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు చాలామంది ముస్లింలు నన్ను వీడి వెళ్లారు. జనసేన మూల సిద్ధాంతాల్లోనే మత ప్రస్తావనలేని రాజకీయం ఉంది. ముస్లింలకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా, వారి భద్రతకు భంగం వాటిల్లినా నేను ఎంతటి వారినైనా ఎదిరిస్తాను. కచ్చితంగా గట్టిగా మాట్లాడుతాను. భారతదేశమంటే వసుదైక కుటుంబం. నేను సభల్లో మాట్లాడే సమయంలో నమాజ్ వినిపిస్తే వెంటనే గౌరవం ఇచ్చేలా, ప్రసంగం నిలిపివేస్తాను. ఇది నేను ఇస్లాంకు ఇచ్చే గౌరవం. రాష్ట్రంలో ముస్లింలను, హిందువులను విడదీసేలా రాజకీయం జరుగుతోంది. ఇప్పటికీ పిఠాపురం, రామతీర్థం ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని ఈ ప్రభుత్వం పట్టుకోలేకపోయింది. దీని వెనుక కచ్చితంగా మతాల మధ్య అంతరం సృష్టించే ఆలోచన ఉందని బలంగా నమ్ముతున్నాను.
నేను బీజేపీ తో మిత్రపక్షంగా బహిరంగంగా మద్దతు ప్రకటించాను. అయితే వైసీపీ నాయకులు ఢిల్లీకి వెళ్లి ఎవరెవరి కాళ్ళు పట్టుకుంటారో, ఎవరికి మద్దతు ఇస్తారో నాకు తెలుసు. ముస్లిం సమాజం వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ వైపు నిలబడాలని కోరుతున్నాను. వారికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందిస్తాం.. అండగా నిలబడతాం. దాన్ని మేం బాధ్యతగా భావిస్తాం అని సేనాని తెలిపారు.
యువత కులాల ఉచ్చులో పడకూడదు
వచ్చే భావితరాలు కులాలను చూడకండి. కులాల గురించి టన్నుల కొద్ది ఉపన్యాసాలు చెప్పేవారు కూడా వారి ఇంట్లో పిల్లలకు కులాలకు అతీతంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. బాగుంటున్నారు. ఇతరులకు చెప్పేటప్పుడు మాత్రం కుల జాడ్యం నూరిపోస్తున్నారు. ఒకే కులం, మతం వల్ల సమాజం నడవదు. కులాన్ని చూడకుండా గుణాన్ని చూసి యువత వారి పక్షాన నిలబడాలి. యువత కులాల ఉచ్చు నుంచి బయటకు రావాలి. ఉచిత విద్య, వైద్యం కోసం జనసేన పార్టీ కట్టుబడి ఉంది. ఏ పార్టీ కోసం కులం కోసం జనసేన పనిచేయదు.
నన్ను తిట్టించడానికి కాపులను, బీసీలను, దళితులను వాడుకుంటున్నారు. అగ్రవర్ణ కుల నాయకులు మాత్రం నన్ను తిట్టడానికి ముందుకు రారు. అంటే జనాభాలో అధిక శాతం ఉన్న మనలో మనం కొట్టుకు చస్తే వారికి పోటీ ఉండదు. రాష్ట్రంలో అభివృద్ధి ఆలోచన మరిచి, కుల ఆలోచన చేస్తున్నాం. ఈ పద్ధతి నిజంగా మారాలి అని బలంగా భావిస్తున్నాను. యువతరం కూడా కుల నాయకుల్ని ప్రశ్నించండి. కులం కోసం ఏం చేశారు అని నిలదీయండి. జనసేనకు అధికారం ఇస్తే కుల నాయకులతో పని చేయించే బాధ్యత నేను తీసుకుంటా. మీ అందరికీ ఒక కూలీగా పని చేస్తా అన్ని జనసేనాని ఎంతో ఉద్వేగంతో అన్నారు.
నాకు డబ్బు ఆశ లేదు. అవసరం కాదు
ఒకప్పుడు అన్నయ్య చిరంజీవి గారికి బాడీగార్డుగా ఉంటే ఈ జీవితం చాలు అని భావించాను. అక్కడి నుంచి ఇప్పుడు రెండు కోట్ల రూపాయల మేర సినిమా రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి నన్ను తీసుకువచ్చింది అభిమానులే. కొందరు నాకు వెయ్యి కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ఇచ్చింది అంటారు.. ప్యాకేజీ అంటారు. ఆ మాటలు అన్నప్పుడే నేను చెప్పు చూపించాను. మరోసారి అలా అనేవారికి గట్టిగా పడుతుంది. నేను చూడని సుఖాలు లేవు.. నాకు మీ గుండెల్లో ఇచ్చే స్థానం కన్నా ఏదీ విలువైనది కాదు.
1964 నుంచి రాష్ట్రంలో మార్పు రావాలి, అధికారం రాని కులాలకు రాజ్యాధికారం దక్కాలని చాలామంది మాట్లాడారు. వారంతా కేవలం మాటలకే పరిమితమయ్యారు. నేను ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేసి దూకేశా. ఎందుకు రాజ్యాధికారం దక్కదు అని పోరాటం మొదలుపెట్టాను. కచ్చితంగా ప్రజా మద్దతును కూడగట్టి ముందుకు వెళ్తాను. 2014 లో పార్టీ పెట్టినప్పుడు ఒక్కడిగా మొదలైన ప్రస్థానం ఈరోజు క్రియాశీలక సభ్యులే 6.50 లక్షలకు చేరుకున్నారు. ఒక పెద్ద సమూహాన్ని సిద్ధాంత బలంతో ముందుకు తీసుకురాగలిగా. కచ్చితంగా త్వరలోనే అధికారం వైపు బలంగా అడుగులు వేస్తాం అని జనసేనాని ఆశాభావం వ్యక్తం చేసారు.
కులం పెత్తనం ఆగిపోవాలి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం పెత్తనం ఆగిపోవాలి. రెడ్డి సామాజిక వర్గానికి అన్ని కీలకమైన పదవులను ఇస్తే, మిగిలిన అణగారిన కులాలకు రాజ్యాధికారం ఎలా దక్కుతుంది. జనాభాలో అత్యధికంగా ఉండే కాపులు కచ్చితంగా పెద్దన్న పాత్రను పోషించాలి. నేను పదే పదే ఇదే మాట చెబుతున్నా. బీసీలు, దళితులను కలుపుకొని వెళ్లి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలి. ఇప్పటివరకు అధికారం దక్కని కులాలకు కచ్చితంగా అధికారం రావాలి. అలాగే అగ్రవర్ణాల్లో చాలామంది పేదలు ఉన్నారు. వారికి అన్ని రంగాల్లో న్యాయం చేయాలి అండగా నిలబడాలి. అగ్రవర్ణాల్లో పేదల ఆవేదనను జనసేన పార్టీ అర్ధం చేసుకుంది.
వారి అభ్యున్నతి కోసం మేము ప్రత్యేకంగా పాలసీ తయారు చేస్తాం. సంఖ్యా బలం ఉన్న కులాలు సైతం తమ పనుల కోసం, నిధుల కోసం దేహి అనే పరిస్థితి పోవాలి. ఐక్యత సాధిస్తే సంఖ్యా బలం ఉన్న కులాలు డిమాండ్లు సాధించుకోవడం చాలా సులభం. అన్ని కులాల్లోనూ మార్పు రావాలి. ఏ కులంలో పుట్టాలి అన్నది మన ఛాయిస్ కాదు.. ఏ కులంలో పుట్టినా అణగారిన కులాలకు అండగా నిలబడాలి అన్నదే నా ఆలోచన. అన్ని కులాలు బాగుండాలి అందరి ఆర్థిక అభివృద్ధి మెరుగ్గా ఉండాలి అని బలంగా కోరుకునే వాడిని. ఏ కులానికి కష్టం వచ్చినా ముందుండేవాడిని. నన్ను కులం పేరుతో దూషిస్తే చాలా బాధేస్తుంది.
నేను విశ్వ నరుడ్ని. కులాల కోటలు బద్దలు కొట్టి ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలని బలంగా కోరుకునే వాడిని. ప్రతి కులాన్ని మనస్ఫూర్తిగా గౌరవించేవాడిని. మత్స్యకారులకు సమస్య వచ్చినా, సుగాలి బిడ్డకు కష్టం వచ్చినా ముందుండి ఆ సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేసే వ్యక్తిని. రాష్ట్రంలో కులాల ఐక్యత చాలా అవసరం. మనలో మనమే కొట్టుకు చచ్చిపోతే కులాలు విచ్ఛిన్నం అవుతాయి. అది సమాజానికి చాలా ప్రమాదకరం. కుల ఆలోచనల నుంచి మానవత్వంతో నిలబడడానికి సమాజంలో పరివర్తన తీసుకురావడానికి నేను ఎల్లవేళలా ప్రయత్నిస్తాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.
దెబ్బ పడే కొద్దీ బలపడ్డాం
సమాజంలో ఒక అద్భుతమైన మార్పు కోసం రాజకీయ ప్రయాణం ప్రారంభించాను. 9 ఏళ్లు ఓటమిని, బాధలను, కష్టాలను దాటుకుంటూ ప్రయాణం సాగిస్తూనే ఉన్నాం. ధైర్యం ఉన్నచోటే లక్ష్మీ ఉంటుంది అని బలంగా నమ్మే వ్యక్తిని. ఆర్థిక వనరులు ఏమీ లేకున్నా నా సొంత శ్రమతో పార్టీని ముందుకు నడిపిస్తున్నాను. దశాబ్ద కాలంలో మాటలు పడ్డాం. మన్ననలు పొందాం. మహా అయితే ప్రాణాలు పోతాయి.
జాతీయ నాయకుల స్ఫూర్తి పోకూడదు అనే లక్ష్యంతో పార్టీని ముందుకు తీసుకు వెళ్తున్నాం. ధర్మం వైపు నిలబడడమే నాకు తెలుసు. దానిని మనస్ఫూర్తిగా స్వీకరించడం కర్తవ్యంగా భావిస్తాను. ఈ ప్రయాణంలో ప్రజా ఆశీస్సులు తప్పక పొంది, జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. వచ్చే ఏడాది ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ విజయ ప్రస్థానంలో మైలురాయి కావాలని, విజయ గర్వంతో నిర్వహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అన్నారు.