Janasena SiddhavatamJanasena Siddhavatam

వైసీపీ ముఖ్యమంత్రిది నిలువెల్లా ఆధిపత్య ధోరణి
మీది అహంకారం అహంభావం.. మాది అస్తిత్వం ఆత్మాభిమానం
కష్టపడి బతకడానికి మీ దగ్గర చేతులు కట్టుకోవాలా?
పద్యం పుట్టిన నేలపై మద్యం ప్రవహింప చేస్తున్నారు
రాష్ట్రంలో అంతులేని చీప్ లిక్కర్ మరణాలు
అధికారం రాని కులాలకు అండగా నిలబడతాం
కులాలపై సామాజిక వైద్యుడిగా మాట్లాడుతూనే ఉంటాను
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు బాసటగా నిలుస్తాం
కేంద్రం నిధులకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
సిద్ధవటంలో జనసేన కౌలు రైతుల భరోసా యాత్ర సభలో పవన్ కళ్యాణ్
119 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ. లక్ష రూపాయల సాయం

‘ఆధిపత్యం, అహంకారం కలగలిపిన వైసీపీ నాయకుడు  (YCP Nayakudu) ప్రతి ఒక్కరూ తన ముందు అణిగి మణిగి ఉండాలని కలలు కంటున్నాడు. ఆత్మగౌరవం చంపుకొని నేను ఎప్పుడూ ఆ పని చేయను. కిందిస్థాయి చిరు వ్యాపారి మురళి (Murali) దగ్గర నుంచి, మెగాస్టార్ (Megastar) గా పిలుచుకునే చిరంజీవి (Chiranjeevi) వరకూ వైసీపీ నాయకుడి (YCP Leader) అహంభావానికి గురైన వారే. చిరంజీవి లాంటి వ్యక్తి నమస్కారంపెడితే కనీసం నమస్కారం కూడా పెట్టని వ్యక్తి వైసీపీ నాయకుడు. మరి అలాంటి వ్యక్తి సామాన్యులకు ఎలాంటి గౌరవం ఇస్తాడో ప్రజలే అర్థం చేసుకోవాల’ని జనసేన (Janasena) అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan kalyan)  ప్రభుత్వంపై (Jagan Government) విరుచుకు పడ్డారు.

కష్టపడి బతకడానికి కూడా మీకు నమస్కారాలు పెట్టాలి అంటే మా ఆత్మగౌరవం ఒప్పుకోవడం లేదు.. వంగి వంగి దండాలు పెట్టి బతకాలి అంటే మా అస్తిత్వమే దెబ్బ తినే పరిస్థితి ఏర్పడుతుంది.. అందుకే భీమ్లా నాయక్ లాంటి సినిమాను సైతం వదిలేశాను అని పవన్ కళ్యాణ్ చెప్పారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్ర (Kaulu Rythu Barosa Yatra) కార్యక్రమాన్ని ఉమ్మడి కడప జిల్లా (Kadapa District) లోని సిద్ధవటంలో  (Siddavatam) శనివారం నిర్వహించారు.

సాగు అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడిన 119 మంది కౌలు రైతు కుటుంబాలకు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇతరుల ఆత్మ గౌరవం దెబ్బతీయడానికి మీరెవరు..? మీకేమైనా కొమ్ములు ఉంటాయా.. దిగొచ్చారా? ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు.. వైసీపీకే ముఖ్యమంత్రి అని ఏపీ సీఎం జగన్ ఉద్దేశించి అన్నారు.

ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రయాణం ఆగదు

మురళి అనే తిరుపతికి (Tirupathi) చెందిన జన సైనికుడు తిరుమల కొండ మీద చిన్న దుకాణం పెట్టుకుంటే జనసేన పార్టీలో ఉన్నాడనే కారణంతో అతన్ని వైసీపీ నాయకులు (YCP Leaders) విసిగించి వేధించారు. చివరకు వైసీపీలోకి తీసుకువెళ్లారు. ఆ పార్టీలోకి వెళ్లినా ఎంతో కాలం ఉండలేక మురళి ఇటీవల మళ్ళీ జనసేన పార్టీలోకి వచ్చి ఇటీవల మంగళగిరిలో (Mangalagiri) నన్ను కలిశాడు. వైసీపీ నాయకులు చేసిన దౌర్జన్యాలు వివరించి విలపించాడు. అలాగే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీపడి కోట్లాదిమంది అభిమాన కథా నాయకుడిగా పేరొందిన చిరంజీవి గారిని సైతం అవమానించేలా వైసీపీ ముఖ్యమంత్రి (YCP Chief Minister) ప్రవర్తించారు అని పవన్ కళ్యాణ్ అన్నారు.

వారికి ఎవరైనా ఒకటే. వైసీపీ నాయకుడు ముందు చేతులు కట్టుకొని నిలబడాలి అనే దర్పం. అలా కాకుంటే తట్టుకోలేరు. నేను దెబ్బలు తినడానికి వచ్చాను. తల వంచేది లేదు. ఎంత తొక్కితే అంత బంతిలా లేస్తాను. మీ బెదిరింపులకు, దౌర్జన్యాలకు లొంగే వ్యక్తిని కాదు. నా ఆత్మాభిమానం ఎప్పటికీ చంపుకోను. కచ్చితంగా ఒక మార్పు కోసం బలమైన సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన వాడిని. కచ్చితంగా అది సాధించేవరకు నా ప్రయాణం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగదు అని జనసేనాని ఆరోపించారు.

పద్యం పుట్టిన చోట మద్యం పారిస్తున్నారు

అల్లసాని పెద్దన వంటి వారు రాయలసీమ ప్రాంతంలో మొదట పద్యం రాశారు. ఇదొక విజ్ఞాన భూమి. సరస్వతి నడయాడిన నేల. తెలుగు వచనం పుట్టిన గొప్ప ప్రాంతం. ఇలాంటి అద్భుతమైన ప్రాంతంలో వైసీపీ నాయకుడు మద్యం పారిస్తున్నాడు. చీప్ లిక్కర్ తో ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నాడు. ఇటీవల నన్ను కలిసిన రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు- సర్కారు అమ్ముతున్న చీప్ లిక్కర్ వల్ల తన తండ్రి ఆరోగ్యం పాడవుతోందని, హానికరమైన మద్యం వల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. దీని మీద నన్ను స్పందించాలని కోరాడు. రాష్ట్రం మొత్తం నకిలీ మద్యానికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారు. రాష్ట్రంలో లెక్కలేనన్ని మద్యం మరణాలు సంభవిస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసే నాధుడే లేడు అని జనసేనాని ఆవేదన వ్యక్తం చేసారు.

ఆది భిక్షువుకే అన్నం పెట్టిన నేల

రాయలసీమ (RayalaSeema) ప్రాంతం ఆదిభిక్షువు అయిన శివుడికి (Shiva) అన్నం పెట్టిన నేలగా అల్లసాని పెద్దన వర్ణిస్తారు. అత్యంత సుభిక్షంగా ఉంటూ అన్ని పంటలతో కలకలాడే రాయలసీమ ప్రస్తుతం రైతు కన్నీటితో నిండిపోయింది. రైతుకు (Rythu) సాయం చేయాల్సిన ప్రభుత్వాలు వారి ఆత్మహత్యలను సైతం అవహేళన చేస్తున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే గత మూడు సంవత్సరాల్లో 190 మంది కౌలు రైతులు ఆత్మహత్య (Suicide) చేసుకోవడం అత్యంత బాధాకరం.

సీమ ప్రాంతం అంటే కక్షలు, ఫ్యాక్షన్ గొడవలుగా నాయకులే చిత్రీకరించారు. ఇక్కడున్న అమాయకులను పావులుగా వాడి వారిలో వారికి గొడవలు పెట్టి వారి ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఇక్కడి ప్రజలు కష్టాన్ని నమ్ముకున్నవారు. అద్భుతమైన ఆలోచన పరులు. నాయకులు తమ స్వార్థం కోసం ప్రజలను ఉపయోగించుకుంటూ పెద్దవారు అవుతున్నారు తప్పితే, ఇక్కడి ప్రజల బతుకులు ఏ మాత్రం మారలేదు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు మేము ఇచ్చే లక్ష రూపాయలతో పూర్తిగా సాంత్వన కలుగుతుందని చెప్పను కానీ… కష్టాల్లో ఉన్న మనిషికి మేమున్నాం అన్న భరోసా మాత్రం దక్కుతుంది అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

సామాజిక వైద్యుడిలా మాట్లాడుతాను

నేను ఎప్పుడు కులాలు, మతాలు గురించి ఆలోచించను కానీ.. అమెరికాలో జాతుల్లాగా ఆఫ్రికాలో తెగలు మాదిరి మన భారతీయ సమాజంలోనూ కులానికి ప్రముఖ పాత్ర ఉంది. వైసీపీ ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అంతా అంటున్నారు. అయితే చాలామంది రెడ్డి సామాజిక వర్గంలోని వారు పేదరికంలోనే మగ్గిపోతున్నారు అని ఇక్కడకు వచ్చిన రైతు కుటుంబాలను చూస్తే అర్థమవుతుంది. కడప జిల్లాలో మొత్తం 60 వేల మంది కౌలు రైతులు ఉంటే కేవలం 3000 మందికి కౌలు రైతుల కార్డులు ఇవ్వడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏంటి.. అని పవన్ ప్రశ్నించారు.

మైదుకూరు ప్రాంతానికి చెందిన నాగేంద్ర అనే దివ్యాంగుడు తమకు పరిహారం రాలేదు అని, త్వరలో తమకు సహాయం చేసేందుకు జనసేన పార్టీ నాయకులు వస్తున్నారని వాట్సప్ స్టేటస్ పెడితే అతన్ని వైసీపీ నాయకులు పిలిచి మరీ బెదిరించారు. ఎందుకు మీకు ఈ భయం..? మీరు సాయం చేయరు మేము చేస్తున్న సహాయం దక్కనివ్వరు.. ఎందుకీ అతి భయం? రాయలసీమలో యువతకు ఉపాధి అవకాశాలు పూర్తిగా సన్నగిలే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడకు వచ్చిన ఎంబీఏ చదివిన కామిని అనే యువతికి సైతం ఉద్యోగం రాలేదని ఆవేదన చెందింది. నాగేంద్రకు, కామినికి జనసేన నాయకులు పూర్తిగా అండగా నిలవాలని కోరుకుంటున్నాను అని జనసేనాని (Janasenani) అన్నారు.

అధికారం రాని కులాలకు అండగా ఉంటాం

రాయలసీమలో 11 శాతం ఉన్న మాదిగలకు, 8 శాతం ఉన్న బోయలకు, కురబలకు, 20 శాతం వరకు ఉన్న 24 ఉప కులాల బలిజలకు, నాలుగు శాతం వరకు ఉన్న పద్మశాలి, దేవాంగులకు అండగా ఉంటాం. పేదరికంలో ఉండే ముస్లింలకు, దూదేకులకు అండగా నిలబడ తాం. అధికారం దక్కని కులాలకు కచ్చితంగా అండగా నిలబడాలి అన్నదే జనసేన అభిమతం. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వరకు భుజం కాస్తాం. ఒక ఇంట్లో అన్నా, చెల్లిగా ఉన్న మీకే పడక ఒకరు ఆంధ్రాలో, మరో కరు అధికారం కోసం పాకులాడుతుంటే ఎప్పటికీ అధికారం దక్కని ఇన్ని కులాలకు అధికారంపై తపన ఉండకూడదా.. అని పవన్ సూటిగా ప్రశించారు.

కులాలను అమ్మడానికి, ఇతర కులాలకు కొమ్ము కాయడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు. ఒక బలమైన సామాజిక మార్పు వచ్చి అన్ని కులాలకు తగిన గౌరవం దక్కాలి అన్నది, సమాజంలో అందరికీ సమన్యాయం జరగాలి అన్నదే నా ఆకాంక్ష. సోషల్ డాక్టర్ గా కులాల గురించి నిత్యం అధ్యయనం చేస్తూ, వారి అభ్యున్నతి గురించి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాను. నేనెప్పుడూ ఏ కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించను అని పవన్ స్పష్టం చేసారు.

ఎక్కడో ఉన్న రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం వస్తేనే మన రైతులకు యూరియా ధర అమాంతం పెరిగింది. అలాంటిది కులంలో విభేదాలు వల్ల ఆ సమాజం మొత్తం నష్టపోతుంది. 2018లో రాయలసీమ ప్రాంతంలో నేను పర్యటనకు వస్తున్నప్పుడు కొందరు పెద్దలు నన్ను కలిసి రెడ్డి సామాజిక వర్గాన్ని తగిన విధంగా గుర్తించి సీమ రావాలని కోరారు. రెడ్డి సామాజిక వర్గంలో ఎందరో మహానుభావులు ఉన్నారు. నాకు ఎంతో ఇష్టమైన తరిమెల నాగిరెడ్డి వంటి వారు కనిపిస్తారు. రెడ్డి సామాజిక వర్గం అంటే నాకు ఎనలేని గౌరవం. వారిలోనూ ఎంతో వెనుకబడిన వారు కనిపిస్తారు.

అయితే సుగాలి (Sugali) సామాజిక వర్గాన్ని అందలం ఎక్కిస్తే రెడ్డి సామాజిక వర్గాన్ని(Reddy Community) కించరించినట్లు, విస్మరించినట్లు కాదు. వారికి అవకాశం కల్పించినట్లు అని రెడ్డి సామాజిక వర్గం పెద్దలు భావించాలి. ఆంధ్రప్రదేశ్లో అధికారం రెడ్డి (Reddy), కమ్మ (Kamma) సామాజిక వర్గం వరకే రాసి పెట్టి లేదు. అన్ని కులాల వారికి సమ ప్రాధాన్యం దక్కినప్పుడే ఈ రాష్ట్రంలో అందరికీ సమన్యాయం దక్కినట్లు భావిస్తాను. రాజకీయాలు అంటే కొన్ని కులాలకే పరిమితం అంటే అసలు ఒప్పుకోను అని పవన్ కళ్యాణ్ వివరించారు.

బాబాయిని చంపిన వారెవరు?

వైసీపీ నాయకుడు (YCP Nayakudu) చేస్తున్న పనులు అతని సొంత సామాజిక వర్గం వారిని సైతం ఇబ్బంది పెడుతున్నాయి. అనంతపురంలో జేసీ బ్రదర్స్ దగ్గర నుంచి, మా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి (Madhusudhan Reddy) వరకు అందర్నీ ఇబ్బందిపెడుతున్నాడు. రెడ్డి సామాజిక వర్గ రైతులను ఆదుకోలేకపోతున్నాడు. సొంత బాబాయి ఇంట్లో హత్యకు గురైతే ఇప్పటివరకు క్రిమినల్స్ ను పట్టుకోలేని అసమర్ధ ప్రభుత్వం ఇది. కులం లేదు… కుటుంబం లేదు… కేవలం వ్యక్తిగత అజెండా మాత్రమే వైసీపీ నాయకుడికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.

రూల్ ఆఫ్ లా అందరికీ ఒకేలా ఉండాలి కదా?? సుగాలి ప్రీతి చనిపోతే దాని గురించి ఎవరూ మాట్లాడరు. ఐఏఎస్, ఐపీఎస్ లు సైతం మౌనంగా ఉంటారు. ఇప్పటికీ ఆ తల్లి వేదన అర్థం చేసుకునేవారు కనిపించరు. సీబీఐ విచారణ వేస్తామని చెప్పిన ప్రభుత్వం మౌనంగా చోద్యం చూస్తోంది. ఈ రాష్ట్రంలో మనిషికో న్యాయం జరుగుతోంది. దౌర్జన్యాలు దోపిడీలకు కేరాఫ్ గా ఆంధ్రప్రదేశ్ మారుతోంది. కోడి కత్తి దాడి జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు మీద నమ్మకం లేదని, పక్క రాష్ట్రానికి హుటాహుటిన వెళ్లిన వ్యక్తికి, నేటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేకపోవడం అత్యంత శోచనీయం అని పవన్ అన్నారు.

వీరి దోపిడీ, దౌర్జన్యాలకు చరమ గీతం ప్రజలే పాడాలి. ప్రజలు ఆలోచించాలి, మారాలి. భయపెడితే మరింత భయపెట్టే ధోరణి వారిది. ముఖ్యంగా మహిళలు ఈ ప్రభుత్వ అరాచకాలపై నడుం బిగించి పోరాడాలి. కచ్చితంగా జనసేన పార్టీ వారికి అండగా నిలుస్తుంది. ఈ ఆదిపత్య ధోరణికి అహంకారానికి ఎదురు తిరగాలి. ఏ సామాజిక వర్గంలో అయినా ఎవరికైనా అన్యాయం జరిగితే అంతా వెన్నుదన్నుగా నిలవండి… అదే సొంత కులంలో ద్రోహం చేసే వారిని పక్కన పెట్టండి. గొడ్డలిలో దూరిన కర్ర.. మొత్తం అడవి నరికేసిందట అన్నట్లు ఉంది ఈ వైసీపీ నాయకుడి తీరు. కులం కన్నా గుణం గొప్పది అనే బలంగా నమ్మిన వాడిని. కచ్చితంగా అన్ని కులాలకు బలమైన గొంతుకగా పని చేస్తాను అని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదనతో అన్నారు.

కేంద్రం మెడలు వంచుతామని.. వీరు మెడలు వంచుతున్నారు

కేంద్రం (Center) అందించే రకరకాల నిధులకు సంబంధించి రాష్ట్రం తరఫున ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వడం లేదు. ఫలితంగా కేసీ కెనాల్ (KC Canal) ఆధునీకరణ లాంటి సాగునీటి ప్రాజెక్టులు సైతం ఆగిపోయాయి. అలాగే రైల్వే లైన్లు (Railway Lines) నిలిచిపోయాయి. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ గారు ఇటీవల ముఖ్యమంత్రిని ప్రధాని మోదీ (Prime Minister Modi) సొంత కొడుకులా చూసుకుంటున్నారని చెప్పారు. చాలా సంతోషం. మరి అలాంటప్పుడు సొంత కొడుకు రాష్ట్రానికి రావలసిన పోలవరం (Polavaram) మీద కానీ ప్రత్యేక హోదా మీద (Special Status) గాని, ఉక్కు పరిశ్రమ (Steel Plant) మీద కానీ ఎందుకు మాట్లాడడం లేదు. 28 మంది ఎంపీలను అందించిన రాష్ట్రానికి వైసీపీ (YCP) చేసిన ప్రయోజనం ఏంటీ? ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు పంచుతామని చెప్పిన వైసీపీ నాయకులు (YCP Leaders) మెడలు వంచి మరి దండాలు పెడుతున్నారు. ఎన్నో కేసులు చుట్టూ ఉన్న నాయకుడు ఎలా మెడలు వంచుతాడు.. ఎవరిని అడుగుతాడు..? ఇన్ని కేసులు ఉంటే ధైర్యం ఎక్కడ ఉంటుంది. మాటలు కోటలు దాటడం తప్ప చేసింది ఏదీ లేదు అని జనసేనాని వివరించారు.

ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పాలన చేస్తాను

వచ్చే ఎన్నికల్లో బలమైన మార్పు కోసం ప్రజలు ఆలోచించండి. ప్రతి సామాజిక వర్గానికి సమ ప్రాధాన్యం ఉండాలి అని నేను బలంగా భావిస్తాను. కచ్చితంగా ఆలస్యమైనా అద్భుతమైన మార్పు వస్తుందని నమ్ముతున్నాను. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన వైపు చూడండి. ఒక కొత్త మార్పు కోసం ఆలోచించండి. రాయలసీమ ప్రాంతానికి చెందిన చాలామంది ముఖ్యమంత్రులను మీరు చూసి ఉంటారు. వారు చేయలేని అతి గొప్ప పాలనను రాయలసీమతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తాను. అన్ని కులాలకు సమ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు వారికి పూర్తిస్థాయి స్వేచ్ఛను కల్పిస్తాం.

వ్యవస్థలను పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తాం. పోలీసు, రెవెన్యూ వంటి కీలక శాఖలను ప్రజలకు ఉపయోగపడేలా అద్భుతంగా తయారు చేస్తాం. కచ్చితంగా జనసేన ప్రభుత్వంలో ఒక గొప్ప ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను చూస్తారని మాట ఇస్తున్నాను.” అని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు.

Spread the love