ఆక్షేపించిన ఉన్నత న్యాయస్థానం
కేంద్ర ప్రభుత్వ వాక్సిన్ విధానాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా ఆక్షేపించింది. 45 ఏళ్లకు పైబడిన వారికి ఉచితంగా టీకా వేయడం, అలానే 18-44 ఏళ్ల లోపు వారు వాక్సిన్ కొనుక్కొని వేయించు కోవాలి అనడం వివక్షతో కూడుకున్నదని కోర్ట్ ఎత్తి చూపుంది. ఇది హేతుబద్ధత లేని విధానమని ఘాటుగా ఆక్షేపించింది. కొవిడ్ నిర్వహణ తీరు, వ్యాక్సినేషన్‌పై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్ర భట్‌తో కూడిన ప్రత్యేక ధర్మాసనం సుమోటోగా విచారణ జరుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
సోమవారం విస్తృత స్థాయిలో విచారణ జరిపింది. అనంతరం దానికి సంబంధించిన ఆదేశాలను బుధవారం కోర్టు వెబ్‌సైట్‌లో ఉంచారు. వ్యాక్సినేషన్‌లో వయో భేదాలు చూపడాన్ని ధర్మాసనం విమర్శించింది. కేంద్రం (Central Government) తన విధానాన్ని సమీక్షించాలని సూచించింది. డిసెంబరు 31 వరకు వ్యాక్సిన్ల అందుబాటుపై రోడ్‌మ్యాప్ (Road Map) సమర్పించాలని ఆదేశించింది. 18-44 ఏళ్ల వయస్కులకు ఉచితంగా వ్యాక్సిన్ వేయించాలని కూడా నిర్ణయం తీసుకున్నదీ లేనిదీ తెలియజేయాలని రాష్ట్రప్రభుత్వాలను (State Governments) ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
కార్యనిర్వాహక నిర్ణయాల్లో కోర్టు జోక్యం చేసుకోరాదని కేంద్రం చేసిన వాదనను తోసిపుచ్చింది. పౌరుల రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే కోర్టులు మౌన ప్రేక్షకుల్లా కూర్చోవాలని మన రాజ్యాంగం చెప్పలేదని కోర్టు తేల్చిచెప్పింది.
కేంద్ర బడ్జెట్‌లో (Central Budget) వ్యాక్సిన్ల సేకరణకు రూ.35వేల కోట్లు కేటాయించారని. అందులో ఇంతవరకు ఎంత ఖర్చుచేశారో చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. ఆ మొత్తంతో 18-44 ఏళ్ల వయస్కులకు ఎందుకు వ్యాక్సిన్లు కొనలేరని ప్రశ్నించింది. వ్యాక్సిన్‌పై పోటీ ధరల విధానాన్ని కేంద్రం సమర్థించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది.
ప్రైవేటు ఉత్పత్తిదారులకు ప్రోత్సాహకాలు కల్పించేందుకు ఈ విధానాన్ని అవలంబించినట్లు చెప్పడంపై ప్రశ్నలు గుప్పించింది.