Pawan with Pamarru RythuluPawan with Pamarru Rythulu

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌
దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన

రైతులను నివర్‌ తుపాను (Cycl0ne) కోలుకోలేని దెబ్బ తీసిందని, ప్రభుత్వం (AP Government) వారికి అండగా నిలవాలని జనసేన (Janasena) అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) విజ్ఞప్తి చేశారు. పంట నష్టపోయిన ఒక్కో ఎకరాకు రూ.35 వేల ఆర్థికసాయం అందించాలని డిమాండ్‌ చేశారు. 48గంటల్లో రూ.10 వేలను రైతు ఖాతాల్లో తక్షణసాయంగా జమ చేయాలని సూచించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు మండలాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పవన్ బుధవారం పరిశీలించడంతో పాటు రైతులతో ఆయన మాట్లాడారు. మోపిదేవిలో విలేకరులతోనూ మాట్లాడారు. 17లక్షల ఎకరాల్లో పంట నష్టమైందని అధికారిక లెక్కల ప్రకారమే చెబుతున్నారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే రెండున్నర లక్షల ఎకరాలు దెబ్బతిన్నాయని పవన్ వివరించారు.

సంపూర్ణ మెజారిటీతో 151మంది ఎమ్మెల్యేలను గెలిపించి ప్రజలు పంపారు. అలా పంపితే ఈ విపత్కర సమయంలో రైతులలకు అండగా ఉండాల్సింది పోయి అసెంబ్లీలో (Assembly) తిట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకున్న ప్రజాప్రతినిధులు ప్రస్తుతం రైతులను పట్టించుకోకపోవడం శోచనీయమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు ఇంటికి రూ.10 వేల చొప్పున రూ.650 కోట్లకుపైగా అక్కడి ప్రభుత్వం ఇచ్చింది అని పవన్ గుర్తు చేశారు. ఇక్కడ మాత్రం ప్రజాధనం (Public money) దుబారా చేస్తున్నారన్నారు.

నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోకుంటే పోరాడతాం:

రైతులు తాము నష్టపోయిన పంటను పరిగణనలోకి తీసుకోవడం లేదని చాలా మంది కౌలు రైతులు తన దృష్టికి తెచ్చారని, బాధితుల్లో 60 శాతం వారే ఉన్నారని పవన్‌కల్యాణ్‌ వివరించారు. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి కౌలు రైతులకు గుర్తింపు పత్రాలు ఇవ్వాలని నష్టపోయిన పంటను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ఇద్దరు కౌలు రైతులు చనిపోయారని, ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కౌలు రైతును ఆదుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా పోరాడతామన్నారు. చల్లపల్లి మండలం పాగోలు రోడ్డు వద్ద ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు గద్వాల కృష్ణ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. కృష్ణా జిల్లా కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ, మోపిదేవి, గుంటూరు జిల్లా రేపల్లె, తెనాలి, వేమూరు, అమృతలూరు, భట్టిప్రోలు మండలాల్లో దెబ్బతిన్న పొలాలను పవన్ పరిశీలించారు.

అన్నదాతలను పట్టించుకోవడం లేదు: మాజీ ఎంపీ రెడ్డయ్య

దేశంలో అన్నదాతలను ఎవరూ పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్‌ (Congress), భాజపాలకు (BJP) కూడా రైతు అవసరం లేదని మచిలీపట్నం మాజీ ఎంపీ, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి (వైకాపా) తండ్రి కె.పి.రెడ్డయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మొవ్వ మండలం అయ్యంకి అడ్డ రోడ్డు వద్ద పవన్‌ను రెడ్డయ్య కలిశారు. సాగుదారుల బతుకు అధ్వానంగా తయారైందని, వర్షాలకు మొత్తం పంట దెబ్బతిన్నదని వివరించారు.