గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక పురస్కారం అందింది. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ – 2022 పురస్కారానికి మెగాస్టార్ చిరంజీవిని ఎంపిక చేస్తున్నట్టు కమిటీ ప్రకటించింది.
చిరంజీవి నాలుగు దశాబ్దాలుగా నటుడిగా, నిర్మాతగా 150కిపైగా సినిమాలు చేసి చిరంజీవి ప్రజాదరణ పొందారు. చిరుది విశిష్టమైన కెరీర్ అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చిరంజీవిని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
గతంలో ఈ అవార్డుని అమితాబ్ బచ్చన్, హేమమాలిని, రజనీకాంత్, ఇళయరాజా లాంటి హేమాహేమీలు గెల్చుకున్నారు.
చిరుని అభినందించిన కిషన్ రెడ్డి
ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అవార్డుకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అభినందించారు. తెలుగువారితో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈ అవార్డుకు వన్నె తీసుకు వచ్చారనడంలో అతిశయోక్తి లేదని కిషన్ రెడ్డి అన్నారు. చిరంజీవి నటప్రస్థానం ఇకముందు కూడా ఇలాగే కొనసాగాలి. సేవా కార్యక్రమాల్ని కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలి’ అని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.
అన్నయ్యకి తమ్ముడి హృదయపూర్వక అభినందనలు
తెలుగు చలన చిత్రసీమలో శిఖర సమానులు, అన్నయ్య చిరంజీవిని ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022’ పురస్కారం వరించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది అని పవన్ అన్నారు. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో భాగంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం. ఈ ఆనంద సమయంలో నా మార్గదర్శి అన్నయ్య చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. నాలుగు దశాబ్దాలుపైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలచుకొని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం నాతో సహా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అంతర్జాతీయ చలన చిత్ర వేదికపై అన్నయ్యకి ఈ గౌరవం దక్కుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను అని జనసేనాని పవన్ కళ్యాణ్ తన అభినందనలు తెలిపారు.