Nadendla Manohar Press meetNadendla Manohar Press meet

లక్షల పాడి పశువులు ఎక్కడ ఉన్నాయో చూపించండి
అన్ని లక్షల పశువులు కొనుగోలు చేసి ఉంటే పాల ఉత్పత్తి ఎక్కడ?
సమాధానం చెప్పలేకే మంత్రిగారు వ్యక్తిగత విమర్శలు
మంత్రిగారికి శాఖపై పట్టు లేదు… ఎస్.ఎల్.బి.సి. నివేదిక చూడలేరు
ఎస్.ఎల్.బి.సి. సమావేశం జరిగిన సంగతైనా తెలుసా?
త్వరలోనే మంత్రిగారి అంబులెన్స్ కుంభకోణం ఆధారాలతో వెల్లడి
దమ్ముంటే పాల వెల్లువ పథకం లబ్ధిదారుల జాబితా చేస్తారా?
క్షేత్ర స్థాయి పర్యటనలో నిజానిజాల నిగ్గుతేల్చుదాం రండి
నవంబర్ 14 నుంచి రోజుకో స్కాంపై పత్రికా సమావేశం
తెనాలి మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

“జగనన్న పాలవెల్లువ (Jagananna Pala Velluva) పథకంలో రూ.2887 కోట్ల అవినీతి (Corruption) జరిగిందని జనసేన (Janasena Party) పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మరోసారి స్పష్టం చేసారు. జగనన్న పాలవెల్లువ పథకంలో రూ.2887 కోట్ల అవినీతి గురించి ఆధారాలతో సహా జనసేన పార్టీ బయటపెడితే… దీనిపై స్పందించాల్సిన మంత్రిగారు వ్యక్తిగత విమర్శలతో సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశార”ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

పాడిపరిశ్రమ, పశువర్ధక శాఖలో జరిగిన అవినీతిపై తాము ప్రశ్నించిన పదిరోజుల తరువాత స్పందించిన మంత్రిగారు నోటికొచ్చినట్లు మాట్లాడి అవినీతిపై మాట దాటేశారని అన్నారు. ఆయన శాఖలో అవినీతే జరగకపోతే పథకంలో లబ్ధిదారుల జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందాలి. అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా అమలు కావాలని పథకాల్లో జరుగుతున్న అవకతవకలపై జనసేన పార్టీ ప్రశ్నిస్తుంటే… బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సిన సంబంధిత మంత్రి మాత్రం వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని మేము అడిగిన ప్రశ్నలు మూడే మూడే.

– పాడిపశువుల కొనుగోలుపై ఇద్దరు మంత్రులు చెప్పిన సంఖ్యలో తేడాలు ఎందుకు ఉన్నాయి?
– మీరు చెప్పినట్లే 3.94 లక్షల పాడిపశువులు కొనుగోలు చేసి ఉంటే పాల ఉత్పత్తి ఎందుకు పెరగలేదు?
– అవినీతి జరగకపోతే లబ్ధిదారుల జాబితాను ఎందుకు బయటపెట్టడం లేదు?

ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పమని సంబంధిత మంత్రిని డిమాండ్ చేస్తే ఆయన… రాష్ట్రంలో ఉన్న డెయిరీల పరిస్థితి గురించీ… చిత్తూరు డెయిరీ, సంఘం డెయిరీలో ఏం జరిగింది? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? వ్యక్తిగత విమర్శలు, రాజకీయ అంశాలు మాట్లాడి సమస్యను పక్కదారి పట్టించాలని చూశారు.

చేయూత పథకం… పేద మహిళల కోసమా? అమూల్ కోసమా?

నిజానికి పథకంలో అవినీతి జరగకపోతే… అసెంబ్లీలో గణాంకాలకు వివరణ ఇవ్వాలి. ఒక మంత్రి 2,08,790 పాడిపశువులు కొనుగోలు చేశామని చెప్పారు. మరుసటి రోజే మరో మంత్రి 3.94 లక్షల పశువులు కొనుగోలు చేశామని చెప్పారు. ఇంకో సందర్భంలో ఇదే మంత్రి గారు 3,92,911 పాడిపశువులు కొనుగోలు చేశామని చెప్పారు. ఇందులో ఏది నిజం?

నిజానికి 3.94 లక్షల పాడిపశువులు కొనుగోలు చేసుంటే మహిళల మినీ డెయిరీల ద్వారా రూ. 14,250 కోట్ల ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక వృద్ధి జరిగేవి. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు 22 లక్షల లీటర్ల పాల సేకరణ జరిగేది. రోజూ 2.72 లక్షల లీటర్ల పాలు అమూల్ కోసం సేకరిస్తున్నామని మంత్రి గారు గర్వంగా చెబుతున్నారు. చేయూత పథకం మహిళల ఆర్థిక వృద్ధి కోసం పెట్టారా? లేక అమూల్ డెయిరీ కోసం పెట్టారా? అనేది మంత్రిగారు సమాధానం చెప్పాలి. లబ్ధిదారులు అమూల్ కు సహకరించకపోతే సంక్షేమ పథకం నుంచి తప్పిస్తారా? ఇదెక్కడి న్యాయం? ఇదేం పథకం అంటూ నాదెంలా మనోహర్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.

పాపం… మంత్రి గారికి తీరిక లేదేమో?

స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కాన్ఫరెన్స్ (ఎస్.ఎల్.బి.సి.) జరగలేదని మంత్రిగారు చెబుతున్నారు. పాపం… ఆయనకు సమాచారం లేకపోయి ఉండొచ్చు. లేకపోతే తీరిక లేక పట్టించుకొని ఉండరు. అక్టోబర్ 30వ తేదీన ఈ కాన్ఫరెన్స్ జరిగింది. తొమ్మిది పేజీల నివేదిక అధికారులు సమర్పించారు. అందులో మూడో పేజీలో కొనుగోలు చేసిన పాడి పశువులనే మళ్లీ మళ్లీ కొన్నట్లు చూపించారని, నిజమైన లబ్ధిదారులకు కాకుండా వైసీపీ సానుభూతిపరులకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారు… అందుకే కొన్ని కమర్షియల్ బ్యాంకులు సహకరించడం లేదని అధికారులు నివేదిక ఇచ్చారు. ముందు ఆ నివేదిక తెప్పించుకొని మూడో పేజీ ఒక్కసారి చదవండి. మాట్లాడితే క్లాస్ వార్ అని ముఖ్యమంత్రి మాట్లాడతారు. మహిళ సాధికారిత, ఆర్థిక వృద్ధి అంటారు. క్షేత్రస్థాయిలో మాత్రం దాదాపు 5 లక్షల మంది ఆడబిడ్డల ఆర్ధిక వృద్ధిని దెబ్బతీశారు. దీనిపై ముఖ్యమంత్రి, మంత్రి సమాధానం చెప్పాలి.

రోజుకో అవినీతిని ఎండగడతాం

నవంబర్ 14వ తేదీ నుంచి రోజుకో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి వైసీపీ ప్రభుత్వ అవినీతిని ప్రజాక్షేత్రంలోనే ఎండగడతాం. ముఖ్యంగా పశువర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రిగారి అంబులెన్స్ స్కాంను ఆధారాలతో బయటపెడతాం. అధికారులతో కలిసి చేశారా? లేకపోతే ఆయన ఒక్కరే చేశారా? లెక్కలతో సహా తేలుస్తాం. పాడి పశువుల కొనుగోలులో భారీగా అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం. 3.94 లక్షల పశువులు కొనుగోలు చేసినట్లు మంత్రి చెప్పారు. క్షేత్ర స్థాయి అధికారుల పరిశీలనలో మాత్రం 8 వేలు మాత్రమే కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ పథకంలో దాదాపు రూ.2887 కోట్ల అవినీతి జరిగింది. రూ.738 కోట్ల సబ్సిడిని దారి మళ్లించారు. లబ్ధిదారుల జాబితా విడుదల చేసి మీరు సిద్ధం అంటే మేము కూడా క్షేత్ర స్థాయి పర్యటనకు సిద్ధంగా ఉన్నాం. వాస్తవాలను క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలకు తెలియజేస్తాం. వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంటే ముందుకు రావాల” అని నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వాన్ని సవాల్ చేశారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఆమంచి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, పార్టీ నేతలు పసుపులేటి మురళీకృష్ణ, హరిదాసు గౌరీశంకర్, షేక్ జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

బటన్లు నొక్కే సీఎంపై నాదెండ్ల మనోహర్ సంచలన కామెంట్స్

Spread the love