అక్రమ కేసుల నుంచి కార్యకర్తలను కాపాడాలి
లా నేస్తం కంటే ప్రభుత్వ ప్రచారానికి ఖర్చు ఎక్కువ
కర్నూలులో జరిగిన జనసేన లీగల్ సెల్ మీటింగులో నాదెండ్ల మనోహర్
ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని న్యాయవాదులు అడ్డుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. అక్రమ కేసుల నుంచి జనసైనికులు, వీరమహిళలను, నాయకులను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత అడ్వకేట్లు తీసుకోవాలన్నారు. లా నేస్తం కింద న్యాయవాదులకు ఇచ్చే సాయం గురించి వైసీపీ గొప్పలు చెబుతోందన్నారు. న్యాయవాదులకు చేసే సాయం… ప్రభుత్వ ప్రకటనల కోసం ఖర్చు చేసే సొమ్ము కంటే చాలా తక్కువని అన్నారు. జనసేన పార్టీ లీగల్ సెల్ రాయలసీమ ప్రాంతీయ సమావేశం శనివారం కర్నూలు నగరంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మనోహర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… “స్వాతంత్ర్య ఉద్యమ సమయం నుంచి లాయర్లు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. సమాజానికి తమ వంతు మంచి చేయాలనే తపనతో న్యాయవాదులు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. గతంలో చాలా సహజంగా ఈ ప్రక్రియ జరిగేది. విదేశాలతోపాటు మన దేశంలో న్యాయవాదులు ప్రజా పోరాటాలు చేసి మంచి నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకు ఉదాహరణే మహాత్మగాంధీ. ఇలా ఎంతోమంది మహనీయులు న్యాయవాది వృత్తి నుంచి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చి మంచి నాయకులుగా ఎదిగారు. పార్టీ నుంచి ఏర్పాటైన మొట్ట మొదటి విభాగం లీగల్ సెల్లే జనసేన పార్టీని స్థాపించిన తరువాత ఎన్నో కసరత్తులు చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేశారు. పార్టీలో ఏర్పాటైన మొట్టమొదటి విభాగం న్యాయ విభాగమే. ఎంతో మంది మేధావులతో చర్చించి న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేశారు అని అన్నారు.
వైసీపీకి అధ్యక్షుడెవరో వాళ్ళకే తెలియదు
వైసీపీకి విజయమ్మ రాజీనామా చేస్తున్నారనే వార్తను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసినందుకు కర్నూలు జిల్లాకు చెందిన జనసైనికుడిని అక్రమంగా అరెస్టు చేసి కొట్టారు. చివరకు ఆ మాటే నిజమైంది. వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా ఉండాలని జగన్ రెడ్డి తీర్మానం చేయించుకున్నారు. ఎన్నికల సంఘం తిప్పి పంపించింది. వైసీపీకి అధ్యక్షుడెవరో వాళ్ళకే తెలియదు. అలాగే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ టీవీలో వచ్చిన ఆర్టికల్ ను ఫార్వర్డు చేసినందుకు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. కిరణ్ రాయల్’ను ఎంతలా ఇబ్బంది పెట్టారో మనందరికీ తెలుసు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం నామినేషన్ కూడా వేయనివ్వలేదు. పోలీసులే మన అభ్యర్థులను నిర్భందించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా సమస్య వస్తే పార్టీకి ముందుగా గుర్తొచ్చేది న్యాయ విభాగం. జనసేన పార్టీకి కొండంత అండ న్యాయ విభాగమే అని న్యాయ విభాగం సేవలను కొనియాడారు.
ప్రభుత్వ తీరును వెల్లడిస్తున్నారని వేధిస్తున్నారు
ప్రజాభిప్రాయాన్ని నిర్భయంగా ప్రచురిస్తుందనే ఈనాడు పత్రికపై ప్రభుత్వం కక్ష కట్టింది. రామోజీరావు, ఆయన కుటుంబ సభ్యులపై కేసులు పెట్టి వేధిస్తుంది. ఈనాడులో ప్రభుత్వ వైఫల్యాలను వెల్లడిస్తూ కథనాలు ఇస్తున్నారు. అందుకే మార్గదర్శిపై కేసులు పెడుతున్నారు. వందలాది పోలీసులతో ఆడిట్ సంస్థలపై దాడులు చేసి డ్యాక్యుమెంట్లు పట్టుకెళ్లిపోయారు. ఒక పోలీస్ అధికారి అయితే ఏకంగా ఢిల్లీ వెళ్లి ప్రెస్ కాన్ఫరెన్స పెట్టాడు. కాకినాడలో జయలక్ష్మి కో ఆపరేటివ్ బ్యాంకులో రూ. వందల కోట్లు దుర్వినియోగం అయితే కనీసం కేసు పెట్టలేదు. బాధితులను పట్టించుకునే నాథుడే లేడు. ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ ను చంపేస్తే అరెస్టు చేయడానికి కూడా వెనకాడారు. అప్పుడు న్యాయవాదులు అందరూ పోరాటం చేస్తే అరెస్టు చేశారు అని నాదెండ్ల మనోహర్ అన్నారు.
అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో న్యాయవాదులను నియమిస్తాం
సామాన్యుడి తరఫున గళం విప్పుతున్నామనే జనవాణి కార్యక్రమాన్ని బలవంతంగా అడ్డుకున్నారు. మూడు రోజులపాటు హోటల్ రూమ్ లోనే నిర్భందించారు. సమస్యలపై పోరాడుతున్న ఉత్తరాంధ్ర యువతపై అక్రమ కేసులు పెడుతున్నారని పార్టీ దృష్టికి రావడంతో ఆ ప్రాంతంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక న్యాయవాదిని నియమించాం. రాష్ట్రంలో 1021 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో న్యాయవాదిని నియమించి జనసైనికులు, వీరమహిళలకు అండగా నిలబడాలనేదే పార్టీ లక్ష్యం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు న్యాయ విభాగం అండగా నిలబడాలని” నాదెండ్ల మనోహర్ కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ న్యాయవిభాగం ఉపాధ్యక్షులు ఏవీఎన్ఎస్ రామచందర్రావు, కర్నూలు జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ సీవీ శ్రీనివాస్, చిత్తూరు జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ ఎ. అమర నారాయణ, అనంతపురం లీగల్ సెల్ ప్రెసిడెంట్ జి. మురళీకృష్ణ, కడప జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ కరుణాకర్ రాజుతో పాటు వివిధ జిల్లాల లీగల్ సెల్ ప్రెసిడెంట్లు, లీగల్ సెల్ విభాగం సభ్యులు పాల్గొన్నారు.
కర్నూలులో నాదెండ్లకు ఘన స్వాగతం
మనోహర్’కి ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చింతా సురేశ్, రేఖా గౌడ్, అర్షద్, శ్రీమతి హసీనా బేగం, వెంకట్, చల్లా వరుణ్ తదితరులు పాల్గొన్నారు.