సంతాప సందేశంలో ఆవేదనను వ్యక్తం చేసిన జనసేనాని
గానకోకిల లతా మంగేష్కర్ (Lata Mangeshkar) తుదిశ్వాస విడిచారనే విషయం తీవ్ర ఆవేదనను కలిగించింది. ఆమె భారతీయ సినీ సంగీత లోకంలో ధ్రువతారగా వెలిగొందింది. లతాజీ అస్తమయం భారతీయ సినీ సంగీతానికి తీరని లోటు అని జనసేనాని (Janasenani) ఒక ప్రకటనలో విచారం వెలిబుచ్చారు. అనారోగ్యం నుంచి కోలుకొని ఇంటికి వెళ్లారు అని తెలుసుకొని స్వస్థత చేకూరింది అనుకొన్నాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది అని పవన్ కళ్యాణ్ బాధని వ్యక్తం చేసారు.
లతాజీ పాటకు భాషాబేధం లేదు. ఆ గళం నుంచి వచ్చిన ప్రతి గీతం సంగీత అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. వేలాది గీతాలు ఆలపించిన లతాజీ స్వరం దైవదత్తం అనిపిస్తుంది అని పవన్ అన్నారు. తెలుగులో కేవలం రెండు పాటలే పాడినా అవి మరచిపోలేనివి. నిదురపోరా తమ్ముడా…, తెల్ల చీరకు… పాటలు శ్రోతలను మెప్పించాయి అంటే లతాజీ గానమే కారణం జనసేనాని ఆమె స్వరానుభులను గుర్తు చేశారు.
ఏడు దశాబ్ధాలుపైబడి సాగిన ఆమె గానయజ్ఞం అమోఘం. బాల్యం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని తను నిలిచి గెలిచిన తీరు మనందరికీ స్ఫూర్తిదాయకం అని పవన్ అన్నారు. దైవభక్తి మెండుగా కలిగిన లతాజీకి సద్గతులు ప్రాప్తించాలని కోరుకొంటున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా తరఫున, జనసేన (Janasena) పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని పవన్ ఒక ప్రకటనలో తెలిపారు.