పీఎం గతిశక్తితో వేగం పుంజుకోనున్న మౌలిక వసతుల అభివృద్ధి
నవ భారత నిర్మాణానికి మరింత దోహదం
భారతదేశాన్ని (India) ప్రగతి పథంలో పరుగులు పెట్టించే గొప్ప కార్యక్రమానికి దేశ ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) శ్రీకారం చుట్టారు. రోడ్డు, రైలు, విమానం, విద్యుత్తు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థలతో దేశాన్ని అనుసంధానించేందుకు రూ.100 లక్షల కోట్లతో ‘పీఎం గతిశక్తి’ మాస్టర్ ప్లాన్‌ను (Master Plan) బుధవారం దిల్లీలో (Delhi) ఆవిష్కరించారు. వచ్చే పాతికేళ్ల అభివృద్ధికి ఈ ప్రణాళిక ద్వారా పటిష్టమైన పునాది వేస్తున్నట్లు ప్రధాని ఉద్ఘాటించారు.
రేపటి అవసరాలకు తగ్గట్టుగా నవభారత్‌ను (New India) నిర్మించేందుకు ఈ ప్రణాళిక దోహదపడుతుంది అని ప్రధాని అన్నారు. ఈ పీఎం గతిశక్తి బృహత్ ప్రణాళిక ఆవిష్కరణ కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ ఇలా అన్నారు. ప్రభుత్వ పని అనే మాట వినిపిస్తే చాలు… ఏళ్ల తరబడి సాగదీత, నాణ్యతాలోపం, ప్రజాధనం వృథా వంటి ప్రతికూల ఆలోచనలే ప్రజల మనసుల్లో వస్తూ ఉంటాయి.
ప్రజల ధనాన్ని (Public Money) వృథా చేయకూడదన్న భావన గత ప్రభుత్వాల్లో కొరవడింది. అందుచేత సర్కారీ పథకాల అమలులో ఉదాసీనత కనిపించేది. ఇటువంటి పరిస్థితులు ఉన్నంత కాలం దేశ ప్రగతి సాధ్యం కాదు. ఆ జాడ్యాలను వదిలించుకివాలి అనే మా ప్రభుత్వం ముందుకు కదులుతోంది. పురోగతి కోసం నిరంతరం పరిశ్రమిస్తోంది. ప్రాజెక్టులను సరైన సమయంలో పూర్తిచేసే సంస్కృతిని మీ ముందుకు తీసుకొచ్చింది’’ అని మోదీ అన్నారు.
మౌలిక వసతుల ప్రాజెక్టుల విషయంలో ప్రణాళికలు లేమి?
మౌలిక వసతుల ప్రాజెక్టుల విషయంలో తగిన ప్రణాళికలు కొరవడటంతో గతంలో ఎన్నో అడ్డంకులు ఎదురవవుతూ ఉండేవి. రోడ్డు, రైల్వే, రవాణా, టెలికాం, గ్యాస్ నెట్‌వర్క్ విభాగాల వారు ఎవరికివారు సొంత ప్రణాళికలను అమలు చేసుకుంటూ పోవడంతో.. చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉండేవి. సమయం, డబ్బు వృథా అవుతూ ఉండేవి. ఎన్నో దశాబ్దాలుగా నిలిచిపోయిన ప్రాజెక్టుల పనులను నేను ప్రధాని పీఠమెక్కాక ఏకతాటిపైకి తీసుకొచ్చాను. ఫలితంగా చాలా ప్రాజెక్టులు ప్రస్తుతం పూర్తవుతున్నాయి. ఇకపై మౌలికవసతులకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులను పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్‌తో అనుసంధానిస్తాం.
సాంకేతిక వేదికతో పారదర్శకత!
ఒక శాఖ (డిపార్ట్‌మెంట్) చేసే పనిని మరో శాఖ తెలుసుకునేలా సాంకేతిక వేదికను తయారుచేశాం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాతో జతకావొచ్చు. దానివల్ల ఎప్పుడు ఏ పనిచేయాలన్నది అందరికీ స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. దీనితో ప్రభుత్వ ప్రణాళికల అమలు వేగం పుంజుకుంటుంది. డబ్బు, సమయం ఆదా అవుతాయి. ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో, సరైన సమయంలో పూర్తయ్యేందుకు పీఎం గతిశక్తి దోహదపడుతుంది అని ప్రధాని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు, రైతులు, గ్రామాలు, వర్తమాన-భవిష్యత్తు తరాలకు అవసరమైన 21 శతాబ్దపు భారత నిర్మాణానికి ఇది కొత్త శక్తిని అందిస్తుంది’’ అని మోదీ పేర్కొన్నారు.