జగనన్న ఇళ్ల నిర్మాణంలో చతికిలపడిన రాష్ట్ర గృహనిర్మాణ శాఖామంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) నియోజకవర్గమైన పెడనలో (Pedana) వై.సి.పి. కార్యకర్తలు (YCP Leaders) గూండాలుగా మాదిరి దౌర్జన్యాలకు పాల్పడు తున్నారు. గురువారం రాత్రి జనసేన కార్యకర్తలు (Janasainiks) మంత్రి వైఫల్యాలను ఎత్తి చూపుతూ ముద్రించిన పోస్టర్లను అతికిస్తుండగా మంత్రి అనుచరులు దౌర్జన్యం చేశారు. వారి నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్ (Police Station) లోనికి వెళ్లగా పోలీసులు చూస్తుండగానే- మంత్రి అనుచరులు వీరంగం వేస్తూ నలుగురు జన సైనికులను దుర్మార్గంగా కొట్టిన విషయాన్ని పార్టీ కార్యాలయం దృష్టికి జిల్లా నాయకులు తీసుకువచ్చారని మనోహర్ (Nadendla Manohar) అన్నారు.
దాడికి పాల్పడినవాళ్ళు పోలీసులు చూస్తుండగానే దర్జాగా వెళ్లిపోయారు. పోలీసులు మాత్రం పోస్టర్లు అతికించిన నలుగురు జన సైనికులపైనా, వారి కోసం వెళ్ళిన స్థానిక జనసేన నాయకుడు ఎడ్లపల్లి రామ్ సుధీర్ మీద కేసులు పెట్టారు. ఈ దాడిని జనసేన తీవ్రంగా ఖండిస్తోందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
దాడి విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, జన సైనికులు పెడన పోలీస్ స్టేషన్’కు తరలి రావడంతో.. చివరకు దాడి చేసిన వారిపై కూడా కేసు నమోదు చేయడానికి పోలీస్ అధికారులు అంగీకారం తెలిపారు. మంత్రి అనుచరుల దౌర్జన్యాన్ని ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలి. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలను న్యాయబద్ధంగా జనసేన ఎదుర్కొంటుందని నాదెండ్ల మనోహర్ వివరించారు.
మడ అడవుల ధ్వంసం చేసి తీరాన్ని కొల్లగొట్టడం నిజం కాదా? ఇసుక, మట్టి దోపిడీ మాటేమిటి? ఈ వాస్తవాలను ప్రశ్నించారు. దేనితో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి నియోజక వర్గంలోనే ‘పేదలందరికీ ఇళ్లు’ పనులు ముందుకు వెళ్లడం లేదని జనసేన బయట పెట్టింది. దీనిపై మంత్రి బాధ్యతగా స్పందించాల్సింది పోయి ఈ విధమైన దాడులు ఏమిటి? ప్రభుత్వాన్ని, మంత్రులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నించే హక్కు పౌరులకు రాజ్యాంగం ప్రసాదించింది.
ఆ హక్కును వై.సి.పి. నాయకులు కాలరాయాలని ప్రయత్నించడం వారి అహంకారానికి ప్రతీక. ప్రశ్నించే గొంతుకలను నొక్కి వేయడానికి ప్రయత్నిస్తే ప్రజలు తగురీతిలో వై.సి.పి. ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారనేది మంత్రి తెలుసుకోవాలని నాదెండ్ల మనోహర్ అన్నారు.