ఆయన మాటలు విని అధికారులు తప్పులు చేయొద్దు
తప్పులు చేసిన ప్రతి అధికారి భవిష్యత్తులో బాధ్యత వహించాలి
వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే రాష్ట్రం అథోగతి పాలైంది
మరోసారి ఛాన్స్ ఇస్తే ప్రజల ఆస్తులను లాక్కుంటారు
జనసేన, టీడీపీ కలిసి పని చేస్తేనే వైసీపీ దౌర్జన్య పాలనకు అంతం
తిరుపతి, శ్రీకాళహస్తి కార్యవర్గ సమావేశంలో కొణిదెల నాగబాబు
జనసేన పార్టీ (Janasena Party) అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ధర్మో రక్షతి రక్షితః అనే సిద్ధాంతాన్ని ఆచరిస్తారు. కానీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (AP CM Jagan Reddy) ధనమో రక్షతి రక్షితః అనే సిద్ధాంతాన్ని నమ్ముతారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు (Konidela Nagababu) పేర్కొన్నారు. వ్యవస్థలు, అధికారులను మేనేజ్ చేయడంలో జగన్ దిట్టని, ఆయన మాటలు విని అధికారులు తప్పులు చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని నాగబాబు హెచ్చరించారు. జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చెప్పిన విధంగా అధికారులకు ఆరు నెలలు సమయం ఇస్తున్నాం పద్ధతి మార్చుకోవాలని అయన సూచించారు.
శనివారం తిరుపతి నగరంలో తిరుపతి, శ్రీకాళహస్తి నియోజక వర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ “రాష్ట్రంలో రౌడీయిజం, గూండాయిజం పెరిగిపోయింది. వైసీపీ నాయకులు కంటికి కనిపించిన భూములను కబ్జాలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, దేవుడి భూములు అని చూడకుండా కబ్జాలకు పాల్పడుతున్నారు. వారి దౌర్జన్యాలు, దాష్టీకాలపై మాట్లాడితే దాడులకు పాల్పడుతున్నారు. అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారు.
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ సంక్షేమం ముసుగులో ప్రభుత్వ ఆస్తులను ఇష్టానుసారం తాకట్టు పెడుతున్నాడు. మరోసారి ఆయనకు అధికారం ఇస్తే మన ఇంటి పత్రాలను కూడా బలవంతంగా లాక్కొని మరి తాకట్టు పెడతాడు అని నాగబాబు అన్నారు.
నిస్వార్థంగా పని చేసే ప్రతి కార్యకర్తకీ మంచి భవిష్యత్
జగన్ దుర్మార్గ, దౌర్జన్య పాలనను అంతమొందించాలంటే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క జన సైనికుడు, వీరమహిళ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో కలిసి పని చేయాలి. పొత్తులకు తూట్లు పొడిచేలా ఎవరూ ఎక్కడా మాట్లాడొద్దు. పవన్ కళ్యాణ్ నిర్ణయానికి కట్టుబడి పనిచేయడం మనందరి బాధ్యత. పదేళ్లు ఎదురుచూశాం. మరికొద్ది రోజులు క్రమశిక్షణగా పని చేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించ గలుగుతాం.
వచ్చేది ముమ్మాటికి జనసేన, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వమే. కష్టపడి, నిస్వార్థంగా పని చేసే ప్రతి కార్యకర్తకు మంచి భవిష్యత్తు ఉంటుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి, కాన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. హరిప్రసాద్, తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్, శ్రీకాళహస్తి ఇంఛార్జ్ వినుత కోట, తిరుపతి పట్టణ అధ్యక్షులు జె. రాజారెడ్డి, వీర మహిళ రీజనల్ కోఆర్డినేటర్ వనజ, పార్టీ అధికార ప్రతినిధి కీర్తన, జనసేన పార్టీ ఆస్ట్రేలియా కో ఆర్డినేటర్ కలికొండ శశిధర్, జిల్లా కమిటీ నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.