చైనా రాకెట్ (China Rocket) గండం గడిచింది – ముప్పు తప్పింది. చైనా రాకెట్ ‘లాంగ్ మార్చ్ 5బి’ శకలాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో (Indian Ocean) కూలాయి. గత కొన్ని రోజులుగా చైనా రాకెట్ ‘లాంగ్ మార్చ్ 5బి’ ప్రపంచాన్ని ఎంతగానో కలవర పెట్టింది. దీంతో భూమిపై పడనున్నాయన్నప్రపంచ భయాందోళనలకు తెరపడింది. శకలాలు భూ వాతావరణంలోకి రాగానే చాలా వరకు పూర్తిగా భస్మమయ్యాయి. కేవలం కొన్ని చిన్న చిన్న భాగాలు మాత్రమే సముద్రంలో పడ్డాయి.
భూవాతావరణంలోకి ఈరోజు ఉదయం ప్రవేశించిన శకలాల దశను చైనా (China) మ్యాన్‌డ్ స్పేస్ ఇంజినీరింగ్ ఆఫీస్ ఎప్పటికప్పుడు పరిశీలించింది. రాకెట్ భాగాలు హిందూ మహా సముద్రంపై విచ్ఛిన్నమయ్యాయని ముందే పేర్కొంది.శకలాలు, 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం, 2.65 డిగ్రీల ఉత్తర అక్షాంశం కలిసే ప్రాంతంలో పడే అవకాశం ఉందని అంచనా వేసింది. చైనా పేర్కొన్న ఈ ప్రాంతం మాల్దీవులకు కొద్ది దూరంలోనే ఉంది. ఈ నేపథ్యంలో మాల్దీవులకు త్రుటిలో ప్రమాదం తప్పిందనే చెప్పాలి. అలాగే శకలాలు కుప్పకూలుతున్న దృశ్యాలను మాల్దీవుల నుంచి కొందరు ఫోన్‌లో బందించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించినవిగా పేర్కొంటూ కొన్ని వీడియోలు ట్విటర్‌లో కొంతమంది పోస్ట్ చేశారు.