ఏపీ స్కిల్ డెవలప్మెంట్ (AP Skill Development Case) కేసులో తెదేపా (TDP) అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి (ChandraBabu Naidu) విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇరువర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఆదివారం సాయంకాలం తన తీర్పుని వెలువరించింది.
చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తమ తమ వాదనలు వినిపించారు. ఉదయం 8 గంటలకు ఇరువర్గాల వాదనలు ప్రారంభం అయ్యాయి. మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఈ వాదనలు కొనసాగాయి. ఈ కేసులో కోర్టుకు సీఐడీ (CID) సమర్పించిన రిమాండ్ రిపోర్టుపై ఇరుపక్షాలు న్యాయవాదులు తమ వాదనలను చాలా బలంగా వినిపించారు.
ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి మాజీ సీఎం చంద్రబాబుకు రిమాండ్ విధించారు. చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇరు వర్గాల వాదనలు ఏమిటంటే:
ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో 409 సెక్షన్ పెట్టడం సబబు కాదని ఆ సెక్షన్ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలని సిద్ధార్థ లూథ్రా తన వాదనలు వినిపించారు. అంతే కాకుండా రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలంటూ నోటీసు కూడా ఇచ్చారు. కేసులో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? అని సీఐడీని న్యాయమూర్తి ప్రశ్నించారు. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
శనివారం ఉదయం 6 గంటలకే చంద్రబాబును అరెస్ట్ చేశామని.. 24 గంటల్లోపు కోర్టులో ప్రవేశపెట్టామని ఏసీబీ తరుపు న్యాయవాదులు చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశామన్నారు.
చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని.. ఆయన హక్కులకు భంగం కలిగించేలా సీఐడీ పోలీసులు వ్యవహరించారని సిద్ధార్థ లూథ్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని కూడా చెప్పారు.
ఈ క్రమంలో సీఐడీకి న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది. 2021లో కేసు పెడితే ఇప్పటి వరకు చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరును ఎందుకు చేర్చలేదని కోర్టు ప్రశ్నించింది. రిమాండ్ రిపోర్ట్‌లో అన్ని అంశాలు చేర్చామని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు.
ఈ క్రమంలో 409 సెక్షన్‌పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. మధ్యలో న్యాయమూర్తి పలుమార్లు విరామం ఇచ్చారు. విరామం తర్వాత సుమారు మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వాదనలు ముగిశాయి.
వాదనలు ముగిసిన అనంతరం ఆదివారం సాయంకాలం, చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.