Pawan Kalyan in Vizag press meetPawan Kalyan in Vizag press meet

ఉత్తరాంధ్రను రియల్ ఎస్టేట్ వెంచర్ చేసిన జగన్ రెడ్డి
రాజధాని పేరుతో తమ సొంత భూముల ధరల పెంచుకోవడమే ప్రణాళిక
లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వి దోపిడీ చేస్తున్నారు
విశాఖలో నేరాలను వ్యవస్థీకృతం చేసి క్రూరంగా విభజించి పాలిస్తున్న వైసీపీ
వైసీపీ పెద్దలు వేల కోట్లు.. కింది స్థాయి నాయకులు కోట్ల మేర అవినీతి
ఇప్పుడు జరిగే తప్పులకు అధికారులు బాధ్యత వహించాల్సిందే
ఎన్డీఏ పక్షంలోకి ఏ పార్టీలు కలిసి వస్తాయి అనేది కాలం నిర్ణయిస్తుంది
స్టీల్ ప్లాంట్ సమస్యపై కేంద్రం వద్ద నోరుమెదపని జగన్
విశాఖ మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఉత్తరాంధ్రలో చేస్తున్నది చాలా క్రూరమైన పాలన అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఆరోపణలు చేసారు. ‘ఉత్తరాంధ్రను రాజధాని చేస్తున్నామని మభ్యపెడుతూ ఈ ముఖ్యమంత్రి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. 2004 నుంచి క్రమంగా విశాఖతోపాటు విశాఖ చుట్టూ పక్కల వేలాది ఎకరాలను కొనుగోలు చేసిన నేటి వైసీపీ నాయకుడు, అతని అనుచరులు ఆ భూముల ధరలు పెంచుకునేందుకే ఈ నాటకం ఆడుతున్నారు’ అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఉత్తరాంధ్ర నేల సహజ సంపదల సిరి.. ఇక్కడ దొరికే అద్భుతమైన ప్రకృతి వనరులు, ఖనిజాలు, సహజసిద్ధంగా ఏర్పడిన గొప్ప వాతావరణం మరెక్కడ ఉండదు అన్నారు. విశాఖ రాజధాని అయిపోతుందని చెబుతూ వైసీపీ అధినాయకుడి దగ్గర నుంచి వైసీపీ వార్డు స్థాయి నాయకుల వరకు దొరికింది దొరికినట్లు దోచేస్తున్నారని తెలిపారు. కనిపించిన భూమి కనిపించినట్లు కబ్జా చేస్తున్నారనీ విశాఖ జనవాణిలోనూ 25 గజాల స్థలం కబ్జాల నుంచి వేలాది ఎకరాల భూముల ఆక్రమాలు నా దృష్టికి వచ్చాయని తెలిపారు.

ఉత్తరాంధ్రలో మొత్తం క్రైమ్ ను వ్యవస్థీకృతం చేసి…

విశాఖతోపాటు ఉత్తరాంధ్రలో మొత్తం క్రైమ్ ను వ్యవస్థీకృతం చేసి ఈ ప్రాంతంలో అలజడులు సృష్టించడానికి వైసీపీ పన్నాగం పన్నిందనీ రాయలసీమలో ఇలాంటి దోపిడీ చేస్తే అక్కడ ఫ్యాక్షన్ వర్గాల ప్రభావం, గోదావరి జిల్లాల్లో అక్రమాలు చేస్తే అక్కడ బలమైన నాయకత్వం అడ్డుపడుతుందని భావించి ఉత్తరాంధ్ర మీద పడ్డారని, ఇక్కడి మేధావులే చెబుతున్నారని వెల్లడించారు. కాయకష్టం చేసుకొని బతికే అమాయక జీవుల ఉత్తరాంధ్ర గడ్డను దోచేస్తే అడిగేవారు ఉండరనేది వైసీపీ విధానమని వ్యాఖ్యానించారు. దీనిని కచ్చితంగా జనసేన అడ్డుకుంటుందనీ, పాలకుల దోపిడీని కచ్చితంగా ఎండగడతామనీ ప్రకటించారు. మూడవ విడత వారాహి యాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “వారాహి విజయయాత్రలో ఎక్కడ చూసిన ఎవరి వేదన విన్నా దాని వెనుక వైసీపీ నేతలు దౌర్జన్యం, దోపిడీ మాత్రమే కనిపించాయి. ముఖ్యమంత్రి పూర్తి స్థాయి వ్యాపారి. ఆయన ఆలోచనలు అలాగే ఉంటాయి. నాయకుడు అయితే ప్రజల ఏమంటారో అని భయం ఉండేది. ఈయనకు ఆ భయం లేదు. ఎవరినైనా బెదిరించగలడు, భయపెట్టగలడు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి ఆనందం పొందగలడు. బ్రిటిష్ వారి విధానం అయిన విభజించు పాలించు అనే విధానాన్ని అత్యంత భయానకంగా అమలు చేస్తున్న వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి.

విశాఖలో ఇటీవల మత్స్యకారుల మధ్య గొడవలు పెట్టారు. ఎన్నడూ లేనట్లుగా వల రింగులకు సైతం సైలెన్స్ తీసుకోవాలంటూ దౌర్జన్యం చేశారు. పోలీసులు చూస్తుండగానే మత్స్యకారులకు ఉపాధి చూపే బోట్లను తగలబెట్టారు. కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అన్ని స్థాయిల్లో అవినీతి అలవాటు అయిపోయింది. ఇళ్లు కట్టుకోవాలన్నా, షాపు పెట్టుకోవాలన్నా, రేటు పెట్టి మరి స్థానిక నాయకులు దోచేస్తున్నారు. వైసీపీ నాయకుడు వేలకోట్లు దోచుకుంటే కిందిస్థాయి నాయకులు ప్రజలను పట్టిపీడిస్తున్నారు.

మహబూబాబాద్ స్టేషన్ లో జగన్ ను తన్ని తరిమింది అందుకే…

2004 నుంచి 2012 వరకు తెలంగాణలో విలువైన వనరులను నేటి వైసీపీ నాయకులు అప్పటిల్లోనే దోచుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ దోపిడీ మరింత ఎక్కువైంది. పర్యావరణం, ప్రభుత్వ ఆస్తులు అనేది ఏవీ చూడకుండా చేసిన దోపిడీ తెలంగాణ యువతలో కోపం నింపింది. విలువైన తమ వనరులను కళ్ల ముందే దోచుకు వెళ్తున్న తీరు వారిలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి బాటలు వేసింది. ఆ కోపమే వైఎస్ ఓదార్పు యాత్ర నిమిత్తం వెళ్తున్న వైఎస్ జగన్ మీద తెలంగాణలోని మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో రాళ్ల దాడి జరగడానికి కారణం. తెలంగాణ ఉద్యమం అంత ఎత్తున ఎగిసిపడటానికి కూడా ఆ బ్యాచ్ చేసిన దోపిడీయే ప్రధాన కారణం. ఉత్తరాంధ్ర మీద ఇప్పుడు ఈ గ్యాంగ్ కన్నేసింది. ఉత్తరాంధ్ర వనరులు దోచేస్తే ఎవరూ అడ్డుకోలేరని వీరు భావిస్తూ ఉత్తరాంధ్ర మీద కపట ప్రేమ నటిస్తున్నారు. ఇక్కడున్న వనరులు భూములు మీదే వాళ్లకు అసలైన ప్రేమ.

తిరుపతి ఎస్పీ వైసీపీ తరఫున మాట్లాడినట్లు అనిపించింది

రాష్ట్రంలో 30వేల మంది మహిళలు, యువతులు అదృశ్యమైనట్లు నేను మాట్లాడితే వైసీపీ నాయకులు నోటికి వచ్చినట్లు నన్ను విమర్శించారు. ఒక కేసు అయినా చూపించు అన్నారు. నిన్న జనవాణిలో ఒక 16 ఏళ్ల యువతి అదృశ్యమైతే ఆమె జాడ కోసం పరితమిస్తున్న తల్లిదండ్రులు న్యాయ పోరాటం చేసినా వారిని అడ్డుకుంటున్న వైసీపీ నేతల తీరును ఏమనాలి. ఓ పంచాయతీ ప్రెసిడెంట్ ఇంట్లో ఆమె ఆచూకి తెలిస్తే తీసుకురాకుండా వదిలేశారు. ఆమె తల్లిదండ్రులు కోర్టులో రిట్ పిటిషన్ వేసినా వెనక్కి తీసుకోమని బెదిరిస్తున్నారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి రాష్ట్వ్యాప్తంగా ఎన్నో ఎన్నెన్నో కేసులు ఉన్నాయి. 30 వేల మంది అదృశ్యమయ్యారని పార్లమెంట్ సాక్షిగా లెక్కలు బయటకు వచ్చినా కనీసం సమీక్ష చేస్తాం.

అదృశ్యం అయినవారిని వెంటనే కనుగొనేందుకు తగిన విధంగా కృషి చేస్తాం అనే మాట లేదు. నేను ఇటీవల తిరుపతి ఎస్పీని కలిసేందుకు వెళ్తే ఎలాంటి సమాచారం లేకుండా అలా ఎలా మాట్లాడతారు అని ఆ ఎస్పీ నన్ను ప్రశ్నించారు. పోలీసులకు ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేస్తేనే వాళ్ల దృష్టికి నేరం వస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది. తిరుపతి ఎస్పీ నేను వింటున్నాను కదా అని క్లాస్ తీసుకోబోయారు. సాక్షాత్తూ వారి హోంమంత్రి రేప్ జరిగితే దొంగతనం చేయడానికి వచ్చి పొరపాటున రేప్ చేశారు అని మాట్లాడితే మాత్రం ఏ పోలీస్ అధికారీ స్పందించరు. సదరు ఎస్పీ వైసీపీ తరఫున మాట్లాడినట్లు నాకు అనిపించింది. ఇలా పోలీస్ అధికారులు పాలక పక్షాల తరఫున మాట్లాడటం సరికాదు.

విశాఖలో రూ.500 కోసం హత్యలు

విశాఖలోనూ రూ. 500 కోసం హత్యలు జరుగుతున్నాయి. ఒకే బార్ ప్రాంతంలో పది రోజుల వ్యవధిలో మూడు మర్డర్లు జరిగాయి. విశాఖ ప్రజలు భయం నీడన బతుకుతున్నారు. ముఖ్యమంత్రి నివాసం ఉండే తాడేపల్లిలోనే క్రైమ్ రేటు ఎక్కువగా ఉంటే మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. యువత ఏం పీలుస్తున్నారో, ఏం తాగుతున్నారో కూడా అర్ధం కావడం లేదు. సాధారణ విషయాలకు సైతం పెద్ద పెద్ద గొడవలు హత్యల వరకు వెళ్తున్నారు. గతంలో నేరాలకు కేరాఫ్ గా బీహార్ ఉండేది. ఇప్పుడు అక్కడ పరిస్థితి మెరుగుపడి ఆంధ్ర నేరాలకు నిలయం అయ్యింది. శాంతిభద్రతలు పూర్తిగా రాష్ట్రంలో దిగజారాయి.

ఖనిజ సంపద దోపిడీలో మాజీ టీటీడీ ఛైర్మన్ కుటుంబ సభ్యులు

విశాఖ జిల్లా నాతవరం మండలంలో బమిడికలొద్దిలో అక్రమంగా లేటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారం ఉంది. 271 హెక్టార్లలో ఖనిజం తవ్వి, కడపలోని సిమెంటు ఫాక్టరీకు పంపుతున్నారు. దీనికోసం గ్రామీణ ఉపాధి హామీ నిధులతో రహదారి నిర్మించారు. కత్తిపూడి మీదుగా లాటరైట్ తరలింపు సులువు అవుతుందని భావించి, పంచాయతీ రాజ్ సహకారంతో మార్గ మధ్యంలోని వేలాది చెట్లను నరికి జీవో నంబరు 174 ద్వారా నిధులు మంజూరు తెచ్చుకున్నారు. దీనిలో రిజర్వు ఫారెస్టు 5 కిలోమీటర్ల మేర ఉన్నా, నిబంధనలు పాటించలేదు. ఈ ఆక్రమంలో గతంలో టీటీడీ ఛైర్మన్ గా పనిచేసిన నాయకుడి కుటుంబసభ్యులు ఉన్నారు. రావికంపాడు స్టేషన్ నుంచి రైల్వే వేగన్ల ద్వారా వేల టన్నులు ఎగుమతి చేస్తున్నారు. లేటరైట్ ముసుగులో రూ.15 వేల కోట్ల బాక్సైట్ మైనింగ్ జరుగుతోంది. 121 హెక్టార్లలో జార్త లక్ష్మణరావు అనే ఆటోడ్రైవర్ పేరుతో వైసీపీ ప్రభుత్వం లాటరైట్ గనులను కేటాయించింది.

బమిడికలొద్ది నుంచి తూర్పు గోదావరి జిల్లాలోని రౌతులపూడి వరకు ఉన్న ఏజెన్నీ ప్రాంతాలను కలుపుతూ వేసిన రోడ్డు ఎవరు వేశారో, ఎందుకు వేశారో కూడా గిరిజనులకు తెలియలేదు. మనుషులే రాని ఊర్లకు పెద్ద పెద్ద మిషన్లు తెచ్చి అందమైన రోడ్లు వేశారు. రోడ్లు వేసినప్పుడు గిరిజనులకు డబ్బులు, బియ్యం, పప్పులు పంచారు. కొందరికి ఫోన్లు కూడా ఇచ్చారు. విశాఖ, తూర్పుగోదావరి ఏజెన్సీ సరిహద్దులో ఉన్న సరుగుడు పంచాయితీలో భారీగా తవ్వకాలు చేస్తున్నారు. ఆటోడ్రైవర్ లక్ష్మణరావును అడ్డుపెట్టుకుని ప్రభుత్వానికి చెందిన పెద్దలే ఈ తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వుతున్నది లేటరైటో, బాక్సైట్లో బయటకు తెలియదు. అధికారులు చెప్పరు.

అధికారులు అంతా కుమ్మక్కై లేటరైట్ అక్రమ తవ్వకాలు

నాతవరం మండలంలో జరుగుతున్న లేటరైట్ త్వవకాలకు సంబంధించిన క్వారీలు అనకాపల్లి భూగర్భ గనులశాఖ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ గనులు, రెవెన్యూ, అటవీ అధికారులు అంతా కుమ్మక్కై లేటరైట్ అక్రమ తవ్వకాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. విశాఖ జిల్లాలో ఆరు లేటరైట్ లీజులు ఉన్నాయి. వీటిలో ఐదు పని చేయడం లేదు. హైకోర్టు తీర్పు మేరకు ఒకేచోట మాత్రమే మైనింగ్ నడుస్తోంది. అది కూడా 5 వేల టన్నులకే అనుమతి ఉంది. 2013 నుంచి ఇప్పటి వరకు మూడు లక్షల టన్నుల లేటరైట్ అక్రమ తవ్వకాలు జరిగినట్లు అధికారులే చెబుతున్నారు. గతంలోనూ ఆండ్రూస్ అనే సంస్థకు అనమతులు ఇస్తే, భారీగా బాక్సైట్ దోచుకుపోయారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోందన్న అనుమానం ఉంది.

లాటరైట్ కు, బాక్సైట్ కు అల్యూమినియం థాతువు శాతం మాత్రమే తేడా ఉంటుంది. దీన్ని నిర్ధారించే ప్రత్యేక వ్యవస్థ లేదు. దీంతో లాటరైట్ ముసుగులో విశాఖ మన్యం ఖాళీ చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఖనిజాలు అవసరం. వాటిని అత్యంత జాగ్రత్తగా వెలికి తీయాలి. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ఖనిజాలను దోచేస్తోంది. విస్సన్నపేటలో కూడా వందలాది ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి అక్కడి వనరుల్ని దోచేస్తున్నారు. యువతకు ఉద్యోగాల పేరు చెప్పి అక్రమ లే అవుట్లు వేస్తున్నారు. కొండల్లో వంద అడుగుల రోడ్లు వేస్తూ అక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారు. దీనిపై జనసేన దృష్టి పెడుతుంది. మన్యంలో జరుగుతున్న అక్రమాల మీద పోరాడుతాం.

విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్న వైసీపీ

అమ్మఒడి, నాడు-నేడు, ఆంగ్ల మీడియం అంటూ రకరకాల మాటలు చెబుతున్న వైసీపీ నాయకుడు క్షేత్ర స్థాయి పరిస్థితిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. నిన్న జనవాణిలో సాలూరు ప్రాంతం నుంచి తమకు కనీసం నిలువనీడ లేని చదువులు చదువుతున్నామని, అంతదూరం నుంచి వచ్చి నాకు కష్టం చెప్పుకున్నారు. ఏలూరు పెద్ద నగరం అయినప్పటికీ అక్కడ కనీసం డిగ్రీ కళాశాలకు ఓ శాశ్వత భవనం లేదు. విద్యార్థులు చెట్ల కింద చదువుకుంటున్నారు. బ్రెయిలీ నేర్చుకుని మరీ చదువు చెప్పే గొప్ప అధ్యాపకులు ఉన్న ఏలూరు కళాశాలలో విద్యార్థులకు చెట్ల కింద చదువులే దిక్కవుతున్నాయి. ఢిల్లీ జేఎన్ యూలో ఫీజు చాలా నామమాత్రంగా ఉంటుంది. అలాగే 53 శాతం ఆడపిల్లలకు రిజర్వేషన్ ఉంటుంది. వెనుకబడిన జిల్లాల నుంచి వచ్చిన వారిని ప్రోత్సహించేందుకు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మార్కులూ కలుపుతారు. ఇక్కడ మాత్రం విద్యా వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టారు. ఇష్టానుసారం ఫీజులు పెంచుతూ అవసరం అయిన చోట భవనాలు కట్టకుండా విద్యా వ్యవస్థలో రకరకాల పాలసీలు తీసుకువస్తూ మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు.

మద్యం అమ్మకాలు తగ్గించే ఆలోచన చేస్తాం

మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి మద్యం మీద మొత్తంగా రూ. 1.25 లక్షల కోట్లు సంపాదించడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాడు. మద్యం మీద రకరకాల బాండ్లు ఇష్యూ చేసి అప్పులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మద్యంలో వస్తున్న ఆదాయంలో మూడో వంతు కూడా నిజాయితీగా చూపడం లేదు. మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లను తీసుకోకపోవడం వెనుక వైసీపీ నాయకుల దోపిడి దాగి ఉంది. జనసేన ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు తగ్గించే ఆలోచన చేస్తాం. దీనితో పాటు ప్రభుత్వం తరఫున డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తాం. లారీ యజమానులు రాష్ట్ర ప్రభుత్వం విధించిన హరిత పన్ను విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు.

తమిళనాడులో ఇది కేవలం రూ.200 ఉంటే కర్ణాటకలో టాక్స్ లేనట్లు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని పన్నుల మయం చేసిన ముఖ్యమంత్రి ఆఖరికి చెత్తపన్నును రూ.120 వేసి దోచుకుంటున్నాడు. హరిత పన్ను విషయంలో మూడు నెలలకు ఒక్కసారి వేలకు వేలు కట్టలేకపోతున్నామని వాహన యజమానులు వాపోతున్నారు. వాహనమిత్ర పథకం లో ఆటోడ్రైవర్లకు రూ. 10 వేలు ఇస్తూ పోలీసు చలానాల పేరుతో అంతకు మూడింతలు పిండేస్తున్నారు. డబ్బులు ఇచ్చి మొత్తం లాగేయండి అని చెప్పడమే ప్రభుత్వ ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వ బడుల్లో 3 లక్షల మంది డ్రాప్ అవుట్ అయితే దానికి గల కారణాలను ప్రభుత్వం తెలుసుకోలేకపోయింది. సామాన్యుడు రోజంతా కష్టపడి నెలకు రూ. 10 నుంచి రూ. 15 వేలు తెచ్చుకోవడమే కష్టమైపోతోంది. కుటుంబాన్ని పోషించుకోవడం గగనమైపోతోంది. వైసీపీ నాయకుల దగ్గర మాత్రం వేలాది కోట్లు వచ్చి పడుతున్నాయి.

డబ్బు అంతా ఒకే దగ్గర ఉండిపోతోంది. ఫలితంగా సామాన్యుడు వారి మాట వినాలి అనేలా వైసీపీ నాయకుల నియంత స్వభావం పెరుగుతోంది. ఇలా ఇది పెరుగుతూపోతే ఎల్లకాలం ప్రజలు బానిసల్లా ఉండక తప్పదు. వైసీపీ నాయకుల చెప్పినట్టు ఆడక తప్పదు. ప్రజలను పీడించి వైసీపీ నాయకులు లావైపోతున్నారు.

ఇప్పటి తప్పులకు బాధ్యత వహించక తప్పదు

వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం మారి ఏ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా ఇప్పుడు జరిగే తప్పులకు అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధ్యత వహించాల్సిందే. జనసేన ప్రభుత్వం కాని, సంకీర్ణ ప్రభుత్వం కానీ వచ్చినా ఇప్పుడు తీసుకున్న ప్రతి తప్పుడు నిర్ణయానికి జవాబుదారీగా సదరు వ్యక్తులు నిలవాల్సిందే. కచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కిందకి దింపి తీరుతాం. నేటి పాలకులకు ఏ అధికారులు అయితే వత్తాసు పలుకుతున్నారో వారు ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్లో భాగస్వాములయ్యారో వారంతా కొత్త ప్రభుత్వంలో సమాధానం చెప్పి తీరాల్సిందే. దశాబ్ద కాలంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజా క్షేత్రంలోనే ఉన్నాను. నేను రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాను. నాతోపాటు మా పార్టీ నాయకులు సైతం ప్రజా క్షేత్రంలో ప్రజల కోసం పని చేసేందుకు సంసిద్ధంగా ఉన్నారు. నాయకులు సైతం ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా పని చేయాలి.

ఎన్డీఏ పక్షంలో ఏ పార్టీ కలసి వస్తుందనేది కాలం నిర్ణయిస్తుంది. నా వరకు నేను రాష్ట్రంలో ఓటు చీలనివ్వకూడదు అనే విషయానికి కట్టుబడి ఉన్నాను. ఎన్డీఏ పక్షంలో ఉండి కూడా ఈ మాట చెబుతున్నాను. రాజకీయ నిర్ణయాలకు సంబంధించిన చర్చలు సాగుతున్నాయి.

మా పార్టీ ఎలా నడపాలో చెప్పడానికి వాళ్లెవరు?

గతంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మొదట గొంతు ఎత్తింది నేనే. బీజేపీ తీరును ప్రశ్నించాం. అయితే దీనిపై ప్రజల్లో చైతన్యం లేదు. సేలం స్టీల్ ప్లాంట్, తెలంగాణ పోరాటం విషయంలో ప్రజల చైతన్యం ఉన్నట్లు ఇక్కడ లేదు. ప్రజల నుంచి చైతన్యం తెచ్చే దిశగా జనసేన పోరాడుతుంది. గతంలో టీడీపీ హయాంలో జరిగిన ఏ తప్పయినా సరిచేసేందుకు వైసీపీకి ఇప్పుడు అవకాశం ఉంది. దానిని పక్కనపెట్టి నా పార్టీ ఎలా నడపాలో చెప్పాల్సిన అవసరం వైసీపీ వాళ్ళకు లేదు. మీ పార్టీ సంగతి మీరు చూసుకోండి. స్టీల్ ప్లాంట్ విషయంలోనూ జనసేన మొదటి నుంచి ఒకే స్టాండ్ మీద కట్టుబడి ఉంది. ప్రభుత్వం రంగం, సహకార సంస్థలు బతకాలని జనసేన భావిస్తోంది. స్టీల్ ప్లాంట్ గురించి దానికి అవసరమైన ప్రత్యేక గనుల కేటాయింపు గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ | ఒక్క సారి కూడా ఢిల్లీ వెళ్లి హోంమంత్రి శ్రీ అమిత్ షా వద్ద మాట్లాడింది లేదు. కేంద్ర పెద్దలను కలిసి దీనిపై అడిగింది లేదు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యే, 22 మంది ఎంపీలు ఉన్నారు. వారెవరూ ఎప్పుడు కనీసం అడిగిన పాపాన పోలేదు.

పార్లమెంటులో ప్రతి బిల్లు పాస్ కావడానికి కేంద్రానికి వైసీపీ సహకరిస్తుంది కదా … దానిని ఆసరాగా తీసుకొని రాష్ట్ర సమస్యల మీద, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని అడగే సాహసం వైసీపీ నాయకుడికి లేదు. అలాంటి సహకారం అందించినప్పుడు ప్రతిఫలంగా తన సీబీఐ కేసుల మీద, దోపిడీ మీద మాత్రమే మాట్లాడతారు” అన్నారు.

మీరు సాక్షి ప్రతినిధి అయినా.. నాకు జర్నలిస్టు అంటే గౌరవం

సమావేశంలో సాక్షి మీడియా నుంచి వచ్చిన ప్రతినిధి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ గతంలో కూడా టీడీపీ హయాంలో జరిగిన తప్పులను మీరు ఎందుకు అడగలేదు అని ప్రశ్నించగా… శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ… “మీరు సాక్షి ప్రతినిధి అయినా ఫర్వాలేదు నేను మీకు గౌరవం ఇస్తాను. ఒక జర్నలిస్టుగా మీకు గౌరవం ఇస్తాను.. మీరు అడిగిన ప్రశ్న నన్ను ఏమీ ఇబ్బందిపెట్టదు. మీ యజమానిలా కాకుండా మిమ్మల్ని జర్నలిస్టుగా గౌరవించుకుంటాను. ఎవరి పాలనలో తప్పులు జరిగినా నేను మాట్లాడతాను. గతంలో బీజేపీనే వ్యతిరేకించినవాడిని. గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని పాలసీ తప్పులను ఎత్తి చూపాను. జన్మభూమి కమిటీల విషయాన్ని ప్రస్తావించి తప్పుబట్టాను. వ్యవస్థలను ప్రక్షాళన చేయాలి అనేది నా అభిమతం. మీ యజమాని కంటే టీడీపీ బెటర్” అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.

జగన్ రెడ్డి ఓడిపోయినా ఏ పథకమూ ఆగదు. మరిన్ని కొత్త పథకాలు: జనసేనాని

Spread the love