ఎపి వర్కింగ్ జర్నలిస్టుల మహాసభలో వక్తల వినతి
జంగారెడ్డి గూడెం: పాత్రికేయుల సమస్యలను ప్రభుత్వాలు సానుభూతితో పరిష్కరించాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ చింతలపూడి,పోలవరం నియోజక వర్గాల సమావేశంలో వక్తలు కోరారు. శనివారం స్థానిక ప్రియదర్శిని కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రభుత్వపరంగా లభించే సౌకర్యాలు నిలిపివేశారని వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో సామాజిక బాధ్యత కలిగి జర్నలిస్టుల సంక్షేమం గురించి ప్రజా ప్రతినిధులు యోచించాలని విశిష్ట అతిథిగా విచ్చేసిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సేవా సంస్థ అధ్యక్షుడు ఆకుమర్తి రామారావు కోరారు. మీడియా సభ్యులు తన కుటుంబ సభ్యుల వంటి వారని పేర్కొన్నారు. వారికి ఏ అవసరం వచ్చినా తాను ముందుంటానని వాగ్దానం చేశారు.
విద్యావేత్త అలుగు ఆనంద శేఖర్ మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన జర్నలిస్టుల సంఖ్య బాగా పెరిగిందని తెలిపారు. సమిష్టిగా ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చెయ్యాలని కోరారు. ప్రజాశక్తి జిల్లా రిపోర్టర్ ఎం గంగ రాజు ప్రసంగిస్తూ జర్నలిస్టుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అక్రిడిటేషన్లు తగ్గి పోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. రాష్ట్ర కార్యదర్శి కె ఎస్ శంకర రావు మాట్లాడుతూ కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. ఐక్యతే బలం అని పిలుపునిచ్చారు.
సూర్య మేనేజర్ పసుమర్తి రాము జర్నలిస్టుల కోసం తన వంతుగా ఇన్స్యూరెన్స్ తరహాలో సహాయం చేస్తానని వాగ్దానం చేశారు. బాబ్జి గ్రూప్ అధినేత షకీల్ బాబ్జి ప్రభృదులు మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ నేత ఆకుమర్తి ని జర్నలిస్టులు ఘనంగా దుశ్శాలువతో సత్కరించారు.
పోలవరం నూతన కమిటీ ఎన్నిక
ఈ సందర్భంగా పోలవరం నూతన కమిటి ఎన్నిక జరిగింది. అధ్యక్షుడుగా గిరికుమార్, కార్యదర్శిగా బుచ్చిబాబు, కోశాధికారిగా అప్పారావు తదితర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సమావేశానికి చింతలపూడి ఏపీడబ్ల్యూ జె ఎఫ్ అధ్యక్షుడు కె.చిన్నారావు అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి గొల్లమందల శ్రీనివాస్,సీనియర్ జర్నలిస్టులు జాబీర్, సోమ శేఖర్ పి ఎన్ వి రామారావు, గరువు బాబురావు, తదితరులు పాల్గొన్నారు. రెండు నియోజకవర్గాలకు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.
–జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబురావు