వినోద్ జైన్‌కు బుద్ధి చెప్పేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు: వైసీపీ
వైసీపీవి నీచ రాజకీయాలు: టీడీపీ
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేతను శిక్షించాలి:ప్రజలు
విజయవాడకు (Vijayawada) చెందిన టీడీపీ నాయకుడు (TDP Leader) వినోద్ జైన్ వేధింపులతో విజయవాడ భవానీపురంకు చెందిన 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటనపై టీడీపీ (TDP), వైసీపీలు (YCP) పరస్పరం బురద చల్లుకోవడం మొదలు పెట్టాయి.
ఈ ఘటన వింటుంటే చాలా బాధేస్తోందని వైయస్ఆర్‌సీపీ (YSRCP) ఎమ్మెల్యే ఆర్కే రోజా (Roja) పేర్కొన్నారు. 60ఏళ్ల వ్యక్తి, ఒక ప్రజా ప్రతినిధిగా పోటీ చేసిన వ్యక్తి పద్నాలుగేళ్ల బిడ్డను ఓ తండ్రిలా చూడాలి కానీ, ఇలా లైంగికంగా వేధించడం ఎంతవరకూ సమంజసం…? అని ప్రశ్నించారు. ఇలాంటివాళ్లకి కచ్చితంగా బుద్ధి చెప్పేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియచేయాలని మహిళా లోకానికి పిలుపునిస్తున్నాం.
గత అయిదేళ్లలో చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ల వరకూ వారిపై అత్యాచారాలు జరిగాయి. మహిళా వ్యతిరేకి అయిన చంద్రబాబు వల్ల, టీడీపీ నాయకులు అంతా ఏవిధంగా మహిళలను హింసించారో, వేధించారో చూశామన్నారు. కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ పేరుతో ఎంతోమందిని వ్యభిచార కూపంలోకి దించారో కళ్లారా చూశామన్నారు.
వనజాక్షి (Vanajakshi) లాంటి సిన్సియర్ అధికారిణిపై ఎలా దాడి చేశారో చూశాం. అలాగే చదువుల తల్లి రిషితేశ్వరిని (Rishiteswari) ఎలా పొట‍్టన పెట్టుకున్నారో చూశాం. ఇవన్నీ అడిగిన నన్ను రూల్స్‌కు విరుద్ధంగా ఏవిధంగా సస్పెండ్ చేశారో రాష్ట్ర ప్రజలు చూశారు అని రోజా ఎద్దేవా చేసారు.
ఇలాంటి పనికిమాలినవాళ్లు, దొంగలు… నారీ సంకల్ప దీక్ష చేస్తున్నామంటున్నారు. ఏ మొహం పెట్టి ఆ దీక్షలు చేస్తారని మేము అడుగుతున్నాం. మీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే వేధింపులకు గురై ప్రాణాలు కోల్పోయిన బాలిక ఇంటి ముందు కూర్చుని సంకల్ప దీక్షలు చేయండి. అప్పుడు ఎవరు దొంగలని తెలుస్తుంది అని రోజా అన్నారు?
ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి (Chief Minister) చేయనటువంటి విధంగా మహిళా భద్రత కోసం దిశా పోలీస్ స్టేషన్లు తీసుకువచ్చారు. దిశ యాప్ తీసుకువచ్చి దానిద్వారా ఫిర్యాదు చేసిన అయిదు నిమిషాల్లోనే అక్కడకు పోలీసులు చేరుకుని బాధితులకు రక్షణ కల్పించిన దాఖలాలు అనేకం ఉన్నాయి. 14 ఏళ్ల బాలిక ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోయి ఆత్మహత్యకు పాల్పడింది. అదే దిశ యాప్‌ద్వారా ఫిర్యాదు చేసినా ఇవాళ ప్రాణాలతో ఉండేది అని రోజా అన్నారు.
మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మహిళలు ధైర్యంగా పోలీసులకు (Police) ఫిర్యాదు చేసి, తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడేలా చేయాలి కానీ, మీలో మీరే కుమిలిపోయి, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి, ప్రాణాలు తీసుకుంటే మీ కుటుంబం ఎంత కుంగిపోతుందో దయచేసి ఆలోచించండి అంటూ రోజా భాదితులకు విజ్ఞప్తి చేశారు.
టీడీపీ నుండి వినోద్ జైన్ బహిష్కరణ!
వినోద్ జైన్ స్థిరాస్తి వ్యాపారి. 2014 లో విజవాడ 39 వ డివిజన్’కి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత టీడీపీలో చేరినట్లు తెలుస్తున్నది. టీడీపీ నుండి 37 వ డివిజన్’కి పోటీ చేసి ఓటమి చెందారు. వినోద్ జైన్ ను టీడీపీ పార్టీ నుండి బహిష్కరించినట్లు టీడీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు నెట్టం రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు.
మంత్రి వెల్లంపల్లి పరామర్శ
బాలక మరణానికి కారకుడైన వినోద్ జైన్’ని కఠినంగా శిక్షించాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (Vellampalli Srinivas) డిమాండ్ చేసారు. మృతురాలి తెల్లితండ్రులను మంత్రి కలిసి పరామర్షించారు.