Andhra Pradesh MapAndhra Pradesh Map

అమెరికా శాక్రమెంటో మోడల్

రాజధానిపై పాలక వర్గాల కీచులాటల వెనుక ఉన్న కుట్ర!

అమరావతిలో ఉన్న రాష్ట్ర రాజధానిని వికేంద్రీకరణ చేయాలా వద్దా అనే దానిపైనే గత కొద్ది వారాలుగా చర్చోపచ్చలు, వాదోపవాదనలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి (Kamma) అనుకూలమైన మీడియా రాజధానిని (AP Capital) అమరావతి (Amaravathi) నుండి తరలించకూడదు అంటూ అమరావతికి అనుకూల ప్రచారం చేస్తున్నది.

రాష్ట్రంలో ఉన్న మరొక పాలక వర్గానికి (Reddy) చెందిన జగన్, అతనికి సంబంధించిన మీడియా అమరావతిలో ఉన్న రాజధానిని వికేంద్రీకరించాలి. అమరావతినుండి తరలించాలి అంటూ అమరావతికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నది. ఈ రెండు పాలక వర్గాల మీడియా చేస్తున్న తమ తమ వర్గ అనుకూల ప్రచారాన్ని మాత్రం అర్ధం చేసికోలేక సామాన్య ప్రజలు తికమక పడుతున్నారు.

రాజధాని తరలింపువల్ల సామాన్య ప్రజానీకానికి వచ్చే లాభ నష్టాలు ఏమిటి అనే దానిపై ఒక్కసారి ప్రజలు అందరూ ఆలోచించాలి. రాజధాని తరలింపువల్ల రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ఆంధ్రులకు ఏమి సంబంధం ఉన్నదీ? తరలింపు వల్ల ప్రజలకు ఏమైనా వచ్చే లాభం గాని లేదా పోయే నష్టం గాని ఏమిటి? అనేదానిపై కూడా ప్రజలందరూ తెలిసికోవాలి.

రాజధానిని తరలిస్తే?

రాష్ట్రంలో ఉన్న ఎంతమంది ప్రజలు తమ దైనందిన కార్యక్రమాల్లో రాష్ట్ర రాజధానిపై ఆధారపడి ఉంటారు? రాజధానిపై ఆధారపడ్డ సామాన్య ప్రజల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. రాజధానిని తరలిస్తే, రాష్ట్ర రాజధాని అయిన అమరావతికి పొలాలు ఇచ్చిన రైతులకి చాలా అన్యాయం జరుగుతున్నది అనే ఆరోపణలు చాలా వస్తున్నాయి. వీరికి అన్యాయం జరుగుతున్న మాట నిజమే. అయితే రాష్ట్రంలో ఉన్న మిగిలిన ప్రాంతాల్లో ఉన్న మిగిలిన రైతులకు జరుగుతున్న నష్టం మాటేమిటి? ఏదో 20 వేల మంది రైతులకు జరుగుతున్న నష్టానికి రాష్ట్రంలో ఉన్న లక్షల మంది రైతులకి సంభంధం ఏమిటి? కొద్దీ మంది రైతుల గురించి ఆలోచించే వారు, మిగిలిన ప్రాంతాల్లో ఉన్న అందరి రైతుల గురించి ఎందుకు ఆలోచించడం లేదు? ఈ కొద్ది మంది రైతుల గురించి మిగిలిన రైతులు ఎందుకు బలవ్వాలి?

సాధారణంగా ఏ సామాన్య ప్రజానీకం అయినా తమ బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పించడానికి సరిఅయిన విద్యాలయాలు, ఉద్యోగ సదుపాయాలు దగ్గరలో ఉండాలని కోరుకొంటారు. అలాగే ఉన్నతమైన ఆసుపత్రులు దగ్గరలో ఉండాలని కోరుకొంటారు. దానికి అనువైన మంచి రవాణా సదుపాయాలను కూడా ఉండాలని ప్రజలు కోరుకుంటాడు. ఈ బేసిక్ సదుపాయాలు తాను ఉంటున్న ప్రదేశానికి అతి దగ్గరలో ఉండాలని కోరుకుంటాడు గాని ఎక్కడో దూరంగా ఉన్న రాజధానిలో ఉండాలని కోరుకోడు.రాజధాని ఎక్కడున్నా గాని ప్రజల రోజువారీ అవసరాలను రాజధాని అనేది తీర్చలేదు అనేది ఇక్కడ గమనించాలి.

అందుకే రాజధాని, సెక్రటేరియట్ లేదా హై కోర్ట్ ఎక్కడున్నాగాని ప్రజల దైనందిన అవసరాలను తీర్చలేవు. సామాన్య ప్రజలకి కోర్టు ఎక్కడున్నా, సెక్రటేరియట్ ఎక్కడున్నా, అసెంబ్లీ ఎక్కడున్నా గాని అంతగా పట్టించుకోరు. ఎందుకంటే వీటి అవసరం అందరికి అస్తమాను ఒకేలా ఉండదు. చాలా తక్కువ మంది ఉపయోగించే రాజధాని కోసం రాష్ట్రంలో ఉన్న మొత్తం ప్రజలని ఎందుకు భాధ పెట్టాలి. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో ప్రధాన సమస్యలను ఈ రెండు పార్టీలు ఎందుకు మరుగున పెడుతున్నారు? ఇది అంతా వ్యూహంతో కాదా?

అందుకు పారిశ్రామిక సముదాయాలు(Industrial Clusters) రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో/ప్రాంతాల్లో వికేంద్రీకరింపబడి ఉండాలి. శ్రీ సిటీ లాంటి పారిశ్రామిక సముదాయాలు మరెన్నో మన రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లోకి సమానంగా రావాలి. అప్పుడు ఆ ఫలాలను ప్రజలు అందరికి దక్కుతాయి గాని రాజధాని ద్వారా చేసికొనే రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల కాదు అనేది గమనించాలి.

రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు ఈ రాజధాని తరలింపుపై చేస్తున్న స్వార్ధ పూరిత విష ప్రచారం వెనుకున్న నిజా నిజాలను రాష్ట్ర ప్రజలందరూ పూర్తిగా తెలుసుకోవాలి. రాష్ట్రంలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, సహజ సంపదలను చేజిక్కించుకోవడంలో , అధికారంలో పై చేయి కోసం రెండు సామాజిక వర్గాల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరుగానే రాజధాని అంశాన్ని పరిగణించాలి తప్ప వీరి ఇద్దరు పోరు రాష్ట్ర అభివృద్ధికోసం కాదు.

రాజధాని మార్పు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనా?

రాష్ట్రంలో అభివృద్ధి చెందిన రెండు సామాజిక వర్గాలు/పాలక వర్గాల రాష్ట్ర సంపదలను దోచుకోవడానికి అవసరమైన ఆధిపత్యం కోసం వీరిలో ఒకరిపై మరొకరు పోట్లాడుకొంటున్నారు. ఇది రాష్ట్ర ప్రజలు తెలిసికోవాలి. వీరి ఆధిపత్య పోరులో పడి మిగిలిన అణగారిన వర్గాలు గాని, కొత్తగా వస్తున్న జనసేన లాంటి పార్టీ గాని సమిధలు కాకూడదు అనే అణగారిన వర్గాలకి చెందిన ప్రజలు కోరుకొంటున్నారు.

అమెరికాలో శాక్రమెంటో మోడల్ ఎలా ఉంటుంది?

అమెరికాలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన కాలిఫోర్నియా లాంటి రాష్ట్రానికి రాజధాని ఎక్కడో చిన్న ప్రదేశం అయిన “శాక్రమెంటో”లో ఉంటుంది. కానీ ప్రపంచ ప్రజల అందరికి బాగా తెలుసున్న నగరాలు లాస్ ఏంజిల్స్, సాన్ ఫ్రాన్సిస్కో మరియు బే ఏరియా. ఈ నాలుగు నగరాలు/ప్రదేశాలు కాలిఫోర్నియాలోనే ఉన్నప్పటికి లాస్ ఏంజిల్స్, సాన్ ఫ్రాన్సిస్కో మరియు బే ఏరియాలనే గుర్తించు కొంటారు. శాక్రమెంటో’ని కాదు. దీనికి కారణం అక్కడ జరిగిన అభివృద్ధి, అక్కడకు వచ్చిన ఇండస్ట్రియల్ క్లస్టర్స్. రాజధాని ఎక్కడున్నాగాని అభివృద్ధి జరిగిన చోటనే ప్రజలు వృద్ధి చెందుతారు. అప్పుడు రాష్ట్రము కూడా అభివృద్ధి చెందుతుంది అని ప్రజలు తెలిసికోవాలి.

మనం ఎన్ని చెప్పినా, ఎంత చేసినా, రాజధాని ఎక్కడున్నా, ఐటీ కంపెనీలు మాత్రం అమరావతికిగాని, లేదా విశాఖకు గాని వస్తాయి అనుకోవడం పొరపాటే అవుతుంది. హైదరాబాద్ లాంటి మహా నగరం ఉండగా విశాఖకు లేదా అమరావతికి రావడం జరగదు. వ్యవసాయం, ఆక్వా కల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్’లాంటి వాటిపై ఆంధ్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలి. ఆంధ్ర ప్రదేశ్’కి ఉన్న విశేషమైన కోస్ట్ లైన్’ని కూడా ఉపయోగించుకోవడానికి అవసరమైన చర్యలు తీసికోవాలి. నౌకా రవాణా, ఓడరేవులు లాంటివాటిని అన్ని ప్రదేశాల్లో నిర్మించడం లాంటివాటిపై ఆంధ్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి.

అమరావతి తరలింపుపై జరుగుతున్న అనవసరం రాద్దాంతాన్ని ఇప్పటికైనా నిలిపివేయడం జరగాలి. అమరావతిపై పెట్టదలుచుకున్న వ్యయాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల అభివృద్ధిపై పెడితే రాష్ట్ర పురోభివృద్ధికి ఉపయోగపడుతుంది.

అమరావతిలోనే రాజధాని ఉండాలి అనే బాబు నిర్ణయం రాష్ట్రానికి మంచిది కాదు. అలాగే ప్రజలతో చర్చించకుండా రాజధానిని మూడు ముక్కలుగా చేస్తాను అనే జగన్ నిర్ణయం కూడా ఆంధ్రాకి మంచిది కాదు. ఎందుకంటే వీరు ఇద్దరు తమలో తమకి ఆధిపత్యం కోసమే పోరాడు కొంటున్నారుగాని రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు అని ప్రజలు భావించాలి.

రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన సామాజిక వర్గాల అమరావతిపై ప్రజలను రెచ్చగొడుతుంటే, రాష్ట్రంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్, జనసేన లాంటి మిగిలిన పార్టీలు ఈ రెండు వర్గాల కుతంత్రాలను బయటపెట్టలేక పోతున్నారు. అడ్డుకోలేక పోతున్నాయి.

పాలక పార్టీల కుట్రలను పవన్ ఎందుకు తెలుసుకోలేక పోతున్నాడు?

ఈ రెండు సామాజిక వర్గాలు అమరావతి తరలింపుపై ఆడుతున్న నాటకాలను పవన్ కళ్యాణ్ కూడా తేలిసికోలేకపోతున్నాడు అని అణగారిన వర్గాలకు చెందిన ప్రజలు విశ్వసిస్తున్నారు. జనసేనుడు రాజధాని తరలింపు వెనుక ఉన్న పాలక పార్టీల కుట్రలను తెలిసికొని, ఆ రెండు పార్టీల ఆధిపత్య నాటకాన్ని అడ్ఢకొంటారని ప్రజలు గట్టినా ఎదురు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వీరి ఆధిపత్య పోరాటంలో సమిధలు కాకూడదు అని ప్రజలు వేడుకొంటున్నారు.

రాష్ట్ర అభివృద్ధిని మరిచి అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రాజధాని అంటూ కొట్టుకొంటూ ఉన్నట్లు నటిస్తున్నాయి. కానీ మిగిలిన వర్గాలు మాత్రం నిజా నిజాలు తెలుసుకోకుండా చెరో వర్గం వెనుక ఉంటూ వారికి పల్లకీలు మోస్తున్నారు. ఇది ఇలా ఉంటే మన రాష్ట్ర నిరుద్యోగ యువత పొట్ట చేత బట్టుకుని ఉపాధి కోసం పక్క రాష్ట్రాలను వెతుక్కొంటూ పోతున్నారు. రాష్ట్ర రాజధాని వచ్చేదెప్పుడు, రాష్ట్ర అభివృద్ధి జరిగేదేప్పుడు. అంతా మిధ్య అనుకొంటూ సామాన్య కూలీ నాలీ చేసికొంటున్న ప్రజలు కూడా ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు తరలి పోతున్నారు.

ఇప్పటికైనా అమరావతిపై జరుగుతున్న అనవసరపు రాద్దాంతం అంతా ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు అని ప్రజలు గమనించాలి. అలాగే ఈ రెండు ప్రధాన పార్టీలు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికోసం పాటు పడేటట్లు ప్రజలు ఒత్తిడి తీసికొని రావాలి. లేకపోతే రాజధాని చిచ్చులో ప్రజలు నలిగిపోతారు అనేది వాస్తవం. ఇది అక్షర సత్యం. ఆలోచించండి.

Spread the love