Jagan governmentJagan government

ఈ ప్రభుత్వం నెరవేర్చిన హామీలు ఏమనగా?

రెండేళ్ల జగన్ ప్రభుత్వం (Jagan Government) నెరవేర్చిన హామీలను ఒక డాక్యూమెంటు రూపంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (jagan Mohan Reddy) ఆవిష్కరించారు. వైసీపీ ప్రభుత్వ (YCP Government) రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో 86% గడపలకి ఏదో ఒక పథకం ద్వారా ప్రయోజనం కలిగేలా చర్యలు తీసికొన్నాం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. ఈ కాలంలో తమ ప్రభుత్వానికి తోడుగా నిలబడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. దేవుడి దయతో ఈ రెండేళ్ల పరిపాలన సంతృప్తికరంగా చేయగలిగామని ముఖ్యమంత్రి చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో కూడా ప్రతి ఆశను నెరవేరుస్తూ ప్రజా శ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలనలో అడుగులు వేసేందుకు బలం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నానని జగన్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆదివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో (CM Camp Office) ‘రెండో ఏటా.. ఇచ్చిన మాటకే పెద్ద పీట’ అనే పేరుతో బుక్‌లెట్‌ విడుదల చేశారు. దీనితో పాటు ‘మలి యేడు –జగనన్న తోడు, జగనన్న మేనిఫెస్టో 2019’ డాక్యుమెంట్‌ను కూడా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల సమక్షంలో ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు.

రాష్ట్రంలో రెండేళ్లలోనే 94.5 శాతం హామీలు అమలు చేశామని తెలిపారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇవ్వగలిగామని ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ అన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతోనే సుపరిపాలన అందించగలిగామని సీఎం పేర్కొన్నారు.

ఏకంగా రూ.1,31,725 కోట్లు

ఇవాళ రూ.95,528 కోట్లు నగదు బదిలీ ద్వారా, మరో రూ.36,197 కోట్లు పరోక్షంగా ప్రజలకు చేరాయి. అంటే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, జగనన్న తోడు, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, విద్యా కానుక, ఇళ్ల స్థలాలు, వైఎస్సార్‌ కంటి వెలుగు వంటి పథకాల ద్వారా అందాయి అని ప్రభుత్వం తెలియ జేసింది.

ఇవన్నీ లెక్క వేసుకుంటే మొత్తం రూ.1,31,725 కోట్లు నేరుగా ప్రజలకు అందాయి అని తెలియ జేశారు. వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి, లంచాలు, వివక్ష లేకుండా, నేరుగా ప్రతి పథకం ప్రజల గడప వద్దకే వెళ్లి అందించగలిగాం. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంత గొప్పగా చేయగలిగామని సగర్వంగా తెలియజేస్తున్నాను అని జగన్ అన్నారు.

ఇంటింటికీ లేఖ, డాక్యుమెంట్‌

వలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికీ బుక్‌లెట్, డాక్యుమెంట్‌ చేర్చడానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. ఒక డాక్యుమెంట్‌.. వారి పేరుతోనే స్వయంగా అందజేస్తాం అని కూడా జగన్ తెలియ జేశారు.

మనం ఎన్నికలప్పుడు ఈ మేనిఫెస్టోను ప్రకటించాము. దాన్నే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లా భావించి, అందులో చెప్పిన ప్రతి అంశాన్ని పూర్తి చేయడానికి ఈ రెండు సంవత్సరాలు అడుగులు ముందుకు వేశాం.

ఎన్నికల సమయంలో కేవలం రెండు పేజీల మేనిఫెస్టో మాత్రమే ఇచ్చాము. అందులో చెప్పిన వాటిలో ఏమేం అమలు చేశాము? ఎన్నింటికి అడుగులు పడ్డాయి? ఏమేం ఇంకా అమలు కావాలి? ఆ వివరాలతో పాటు, మేనిఫెస్టోలో చెప్పనివి కూడా ఏమేం చేశామన్నది వివరిస్తూ ప్రతి ఇంటికి ఒక డాక్యుమెంట్, లేఖ పంపిస్తున్నాము.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Dasari Narayana Rao Special