Kakinada General HospitalKakinada General Hospital

కాకినాడ ప్రముఖ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కనిపిస్తున్న కొన్ని దృశ్యాలు చూస్తుంటే హృదయం ద్రవించుకు పోతున్నది. ప్రభుత్వ హాస్పిటల్స్ ఇంత అత్యంత దారుణమైన స్థితిలో ఉన్నాయా అనిపిస్తున్నది. ఇది నిజమా అబద్ధమా అని మన కళ్ళను మనమే నమ్మలేని పరిస్థితి. ఇది ప్రసవ వేదనను అనుభవిస్తూ పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి చేరిన మాతృ మూర్తుల దీన పరిస్థితి. అతి దౌర్భాగ్యమైన స్థితి ! ఒక్కో బెడ్ ఇద్దరికి చొప్పున కేటాయిస్తూ ఉంటే, పరిస్థితులను అర్ధం చేసికోవచ్చు.

పురిటి నొప్పిలతో ఇద్దరు మహిళలకు ఒకే మంచంపై ఉండాల్సిన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇంత దారుణమైన పరిస్థితికి కారణం ఎవరు? హాస్పిటల్ సిబ్బందా? లేక పాలకులా లేక పాలకులను ఎన్నుకొంటున్న ప్రజలా?

తప్పు ఎవ్వరిది?

ఆరోగ్య శాఖ అసలు పని చేస్తున్నదా లేదా? ఆరోగ్య శాఖ సరిగా పని చేస్తుంటే ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి. పనిచేయక పోతే అసలు ఇది ఖచ్చితముగా ప్రభుత్వ వైఫల్యమేనా కదా?

ఎక్కడ చూసినా అవినీతి, నిర్లక్ష్యంతో అన్నట్లు క్షీణదశలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్’లో ఉన్న ఈ దీన స్థితి చూసి పేద మధ్య తరగతుల కుటంబాలు గత్యంతరం లేక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి ఒళ్ళు ఇల్లు గుల్ల చేసుకునే సంఘటనలు నేడు కోకోల్లలు.

తప్పుడు నిర్వహణ, అవినీతి మరియు రాజకీయ సంకల్పం లేకపోవడం తరచుగా ఇటువంటి వైఫల్యానికి కారణాలుగా నిలుస్తున్నాయి అనుకోవచ్చా?

సంక్షేమంపై మోజుతో మరుగున పడుతున్న అభివృద్ధి

విద్యా, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలకు అవసరమైన పరిశ్రమల కోసం ప్రభుత్వ నిధులను వెచ్చించాల్సి ఉంది. కానీ ఏ ప్రభుత్వం అయినా సరే అభివృద్ధిని మరచి, సంక్షేమం కోసం మాత్రమే నిధులను వెచ్చిస్తున్నాయి.

పేదరికం, నిరుద్యోగం నిర్మూలనకు విద్య, ఆరోగ్య ప్రయోజనాలు మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వ్యాప్తి చేయడంలో సామాజిక సంక్షేమ పథకాలు సహాయపడుతాయి. కానీ మితి మీరిన సంక్షేమ పథకాలు, అక్కడక్కడా ఎడాపెడా అవినీతి వల్లే ఇటువంటి సంఘటనలు తరుచు చవిచుస్తున్నాయేమో అనిపిస్తున్నది.

ఎన్నికైన నాయుకులు ఓటు బ్యాంకింగ్ రాజకీయాలు తప్ప దీర్ఘ కాలిక సమస్యలుపై దృష్టి పెట్టడం లేదు? ప్రజలు కూడా తాత్కాలిక ప్రయోజనాలకే అలవాటు పడ్డారు తప్ప అభివృద్ధి కోసం ఆలోచించండం లేదు. ప్రజలలో చైతన్యం రానంతకాలం ఇది సర్వ సాధారణమైన విషయముగానే పరిగిణించ బడుతుంది. ప్రజలు కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు.

క్షమించాలి. పశువులు కొట్టాములో కూడా ఈ విధమైన దుస్థితి ఉండదేమో అని అనిపిస్తున్నది? సంక్షేమం సాకుతో పరోక్షంగా సామాన్యుల నడ్డి విరుస్తున్నా ప్రజలలో చలనం లేదు, చైతన్యము రావడం లేదు.

ఇటువంటి దృశ్యాలు కరోనా సమయంలో ప్రత్యక్షంగా చూసాం. అయితే ఆరోజులలో అభివృద్ధి చెందిన దేశాలలో గూడా రోగులు సంఖ్య లక్షల్లో ఉండటం కారణంగా నియంత్రణ సాధ్యం కాలేదు.

ఇది అతిపెద్ద విపత్తుగా కరోనా రూపంలో యావత్తు మానవ జాతికి నష్టం కలిగించింది. ఇటు వంటి దుస్థితి అప్పుడు తప్పదు. కానీ ఇప్పుడు కూడా ఇదే పరిస్థితినా?

ఇప్పుడు ఎందుకిలా ! ఒక మంచానికి రెండు పురుళ్ళా? సామాన్యులపట్ల ఇంత నిర్లక్షంగా వ్యవరిస్తారా అని ప్రజలు వాపోతున్నారు? ఎప్పుడూ ఎవడికో ఒకడికి భజన చేసే టీవీ చాన్నాళ్లుకి, దినపత్రికలకు ఇవి కనిపించడం లేదా ?

బటన్ నోక్కితే “డబ్బు” అంటూ జబ్బలు చరుస్తున్న నాయకులకు ఇటువంటి దృశ్యాలు కనిపించడం లేదా? ఇటువంటివి చూస్తున్నప్పుడు అయినా మన పార్టీల, నాయకుల మనస్సు చలించదా? ఇటువంటి నాయకులను ఎన్నుకొంటున్న ప్రజల్లో అయినా మానవత్వం ఉన్నదా? ఉంటే అది ఎక్కడుంది? అని అనిపిస్తున్నది. సంక్షేమ పధకాల మోజులో కొట్టుమిట్టాడుతున్న ఈ సమాజంలో చైతన్యం ఇప్పటికైనా వస్తుందా?

ప్రభుత్వాలను విమర్శ చేయాలని ఇది రాయడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలలో జరుగుతున్న హృదయ విచారకర దృశ్యాలను చూచి తట్టుకోలేక పోయాను. ఈ నా ఆవేదనను మీతో పంచుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రమే వివరించా. అర్ధం చేసికోగలరు. మరింత పరిశోధించి నిజానిజాలు తెలిసికోగలరు.

–శ్రీనివాసరావు బస్సా, శృంగవృక్షం గ్రామం, తుని తాలూకా

మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలన ఎందుకు?

Spread the love