వైసీపీ విధానం రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడమా?
మంత్రి ధర్మాన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి సమాధానం ఏది?
ప్రజలను అయోమయంలోకి నెట్టే కుట్ర
ఉత్తరాంధ్ర మీద జగన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు
ఉద్దానం ప్రాంతంలోని ప్రజలు నరక యాతన
యువశక్తి సభ ద్వారా జనసేన భవిష్యత్తు గళం
‘యువశక్తి వేదికకు ‘వివేకానంద వికాస వేదిక’గా నామకరణం
రణస్థలం మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్, నాగబాబు
‘అసలు వైసీపీ విధానం ఏంటీ..? మూడు రాజధానులా (Three Capitals) లేక మూడు రాష్ట్రాలుగా విడదీయడమా..? క్యాబినెట్లో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) విశాఖ కేంద్రంగా ప్రత్యేక రాష్ట్రం (Separate State) చేయాలని ప్రతిరోజు చెబుతున్నారు. దానికి ముఖ్యమంత్రి ఎందుకు బాధ్యత వహించరు..? మంత్రి ధర్మాన మాట్లాడుతున్న మాటలకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు..? మంత్రి ధర్మాన వెనుక ముఖ్యమంత్రి ఉండి ఈ వ్యాఖ్యలు చేయిస్తున్నారా లేక ఇంకేమైనా కుట్ర ఉందా అనేది జగన్ రెడ్డి చెప్పాలి.
ప్రతిరోజు తన సహచర మంత్రి మీడియా ముందుకు వచ్చి ప్రత్యేక రాష్ట్రంగా విశాఖ కావాలని కోరుతుంటే వైసీపీ ప్రభుత్వ అధినేత మాత్రం ప్రజలను అయోమయపరిచేలా ప్రవర్తిస్తున్నార’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అన్నారు.
రణస్థలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించబోయే యువశక్తి సభ వేదిక వద్ద బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
“వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఎంత మభ్యపెడుతుందో చెప్పడానికి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలే నిదర్శనం. ప్రజలను పూర్తిగా అయోమయంలోకి నెడుతున్నారు. ఒకసారి విశాఖ రాజధాని కావాలని అంటున్నారు. మరోసారి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నారు. ఇలా రకరకాల మాటలు చెప్పిన వైసీపీ పాలకులు ఇప్పుడు ఏకంగా విశాఖను రాష్ట్రం చేయాలని కోరుతున్నారు. దీని వెనుక వారి కుట్రలు దాగి ఉన్నాయి. దీనికి కచ్చితంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. జగన్ రెడ్డి నొక్కే బటన్లు క్షేత్రస్థాయిలో ఏమాత్రం ఉపయోగపడడం లేదు. రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వ విధానాల మీద పూర్తి అసహనంతో ఉన్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఉత్తరాంధ్ర వైభవం తెలిపేలా ద్వారాలు
యువతకు స్ఫూర్తి ప్రదాత వివేకానందుడి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న యువశక్తి సభ వేదికకు వివేకానంద వికాస వేదికగా నామకరణం చేశాం. అలాగే సభాస్థలికి వచ్చే నాలుగు ద్వారాలకు ఉత్తరాంధ్రకు చెందిన మహనీయులు గిడుగు రామ్మూర్తి, వీరనారి గున్నమ్మ, అల్లూరి సీతారామరాజు, కోడి రామ్మూర్తి నాయుడు ద్వారాలుగా నామకరణం చేశాం. 35 ఎకరాల్లో నిర్వహించబోతున్న సభకు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు అయ్యాయి. సభకు వచ్చే యువతులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉంటాయి. ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేశాం.
భోజనాలు, మరుగుదొడ్లు సౌకర్యాలు కల్పించాం. 15 రోజుల నుంచి జనసేన పార్టీ నాయకులు విశ్రాంతి లేకుండా సభ వేదిక ఏర్పాట్లు చూస్తున్నారు. సమష్టిగా సభాస్థలిని అందంగా తీర్చిదిద్దాం. పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నాం. అలాగే యువశక్తి కార్యక్రమం మీద ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీ నాయకులు చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. 12వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు మొదలయ్యే యువశక్తి సభలో మొదటగా జనసేన పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేసిన వారిని సభకు పరిచయం చేస్తూ కార్యక్రమం మొదలవుతుంది.
అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, ప్రత్యేకంగా ఎంపిక చేసిన 100 మంది యువత వివిధ అంశాల మీద మాట్లాడుతారు. అనంతరం పార్టీ పీఏసీ ఆధ్వర్యంలో రెండూ రాజకీయ తీర్మానాలు ఉంటాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై, యువతకు భరోసా నింపడంపై రెండు తీర్మానాలు ఉంటాయి. అనంతరం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుంది.
ఉత్తరాంధ్ర సమస్యలతోపాటు యువ నాయకత్వాన్ని తొక్కిపెడుతున్న ఉత్తరాంధ్ర కుటుంబ పాలకుల వైఖరి మీద ఈ ప్రాంత వనరుల దోపిడీ మీద, ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయం మీద యువత ప్రసంగం ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని అనేక చీకటి అంశాలను యువతరం వేదిక సాక్షిగా బయట పెట్టడానికి సిద్ధమవుతున్నారు అని నాదెండ్ల మనోహర్ వివరించారు.
ఉద్దానం మీద ముఖ్యమంత్రికి ఏ మాత్రం ప్రేమ లేదు
ముఖ్యమంత్రి కాక ముందు జగన్ రెడ్డి ఉత్తరాంధ్ర ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు అందరికీ ముద్దులు పెట్టి మరీ ఉద్దానం ప్రాంతానికి ఆరోగ్య భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ప్రాథమిక కేంద్రంలోనూ డయాలసిస్ సెంటర్’లు పెడతామని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అయి నాలుగు సంవత్సరాలు అయినా ఉద్దానం ప్రాంతం మీద ఆయన చూపిన శ్రద్ధ లేదు. ఉత్తరాంధ్ర ప్రాంత ఆస్పత్రులలో కనీసం నెఫ్రాలజిస్టు లేరు. 25 రోజులకు ఒకసారి వచ్చే నెప్రాలజిస్టు సేవలే ఇక్కడి ప్రాంత వాసులకు గతి.
రూ.700 కోట్లతో ఉద్దానం ప్రాంతంలో చేపట్టబోయే రక్షిత మంచినీటి పథకం పనులు ఎంతవరకు వచ్చాయో కూడా అతిగతీ లేదు. ఉద్దానం ప్రాంతంలో ప్రజలు కళ్ల ఎదుటే మృత్యువాత పడుతున్నా కనీస కనికరం లేని ప్రభుత్వం ఇది. జనసేన పార్టీ కచ్చితంగా ఉద్దాన ప్రాంతానికి ఆరోగ్య భరోసానిచ్చేలా ప్రత్యేక ప్రణాళిక తో ముందుకు వెళ్తుంది. ఉద్దానం ప్రాంతంలో మళ్లీ చిరునవ్వులు చిందించే పరిస్థితిని తీసుకువస్తాం అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
పవన్ కళ్యాణ్ రాజకీయ పోరాటం గంగమ్మ దీవెనలతోనే…
క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ చేపట్టిన కీలకమైన పోరాట యాత్ర మత్స్యకారుల ఆరాధ్య దైవం అయిన శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతోనే మొదలుపెట్టారు. మత్స్యకారుల వలస వెతలను పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. కుటుంబాలను వదిలి గుజరాత్, మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాలకు నామమాత్రపు వేతనాల కోసం వలస వెళ్తున్నారు.
ఈ ప్రాంతంలో కనీసం ఫిషింగ్ హార్బర్, బెట్టిల నిర్మాణం లేక మత్స్యకారులు యాతన అనుభవిస్తున్నారు. మత్స్యకారులకు భరోసా నింపేలా, వారి వలసలు నిరోధానికి జనసేన పార్టీ ఏం చేస్తుంది అన్నది పవన్ కళ్యాణ్ వివరిస్తారు. జనసేన పార్టీ భవిష్యత్తు ప్రణాళిక, ప్రయాణం మీద పవన్ కళ్యాణ్ మాట్లాడుతారు. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు ఇంటికి పంపించాలి అన్న అంశం మీద యువతకు అర్ధమయ్యేలా పవన్ కళ్యాణ్ వివరిస్తారు అని నాదెండ్ల అన్నారు.
యువతకు అద్భుత అవకాశం: నాగబాబు
జనసేన పార్టీ పీఏసీ సభ్యులు నాగబాబు పలు అంశాలను ప్రస్తావించారు. “వివేకానందుడు జయంతి సందర్భంగా యువతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా బహిరంగ వేదికల మీద యువతకు ఇవ్వని అవకాశం జనసేన పార్టీ ఇస్తుంది. యువతలో ఉన్న అంతులేని ఆవేదనను ప్రపంచానికి తెలియజెప్పే గొప్ప ప్రయత్నం ఇది. రాష్ట్రంలోని యువతకు నిండా సమస్యలు కనిపిస్తున్నాయి. చదువుకున్న దగ్గరనుంచి, ఉపాధి పొందే వరకు వారికి నిత్యం ఇబ్బందులే.
వారి గుండె ఘోషను వేదిక నుంచి అందరికీ తెలియజేప్పేలా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వంద మంది యువతకు తన సమక్షంలో మాట్లాడే అవకాశం ఇవ్వడం నిజంగా గొప్ప విషయం. దీనిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. నేటి యువతరమే రేపటి భవిష్యత్తుకు పునాదులు. వారి ఆలోచనలే భవిష్యత్తులో దేశాన్ని నడిపించబోతున్నాయి. అలాంటి యువతరం ఆలోచనలను అందరూ వినాల్సిన అవసరం పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
యువతరం భవిష్యత్తు బంగారంలా ఉండాలని కంకణం కట్టుకున్న పార్టీ జనసేన. రణస్థలం పేరులోనే ఒక సమరం నినాదం ఉంది. యువతను కచ్చితంగా గౌరవించాల్సిన అవసరం ఉంది. పని లేని వైసీపీ నాయకుల మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం గౌరవం లేదు. కచ్చితంగా యువశక్తి వేదిక ద్వారా ఇవ్వగలరని ప్రపంచానికి చెప్పేలా చేస్తున్న ఈ ప్రయత్నానికి అందరూ సహకరించి ముందుకు రావాలి అని నాగబాబు అన్నారు.
సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్చార్డులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.