Narendra Modi as PMNarendra Modi as PM

రాజ్‌నాథ్, అమిత్‌ షా, నిర్మల, జైశంకర్‌లకు కీల శాఖలు
12 మందికి యథాతథం.. జేపీ నడ్డాకు వైద్య, ఆరోగ్యం
కిషన్‌రెడ్డికి బొగ్గు, గనులశాఖ రామ్మోహన్‌ నాయుడుకు పౌర విమానయానం
బండి సంజయ్‌కి హోం పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్లు
శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమలు శాఖల కేటాయింపు

భారత ప్రధానిగా (Indian Prime Minister) వరుసగా మూడో సారి ప్రమాణం చేసిన నరేంద్ర మోదీ (Narendra Modi) కాబినెట్ తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసికొన్నారు. అలానే మోదీ కాబినెట్ లో (Modi Cabinet) మంత్రులకు శాఖలను కేటాయించారు.అత్యంత కీలకమైన నాలుగు శాఖలను భాజపా అట్టి పెట్టుకుంది. వాటిని గతంలో నిర్వహించిన రాజ్‌నాథ్‌ సింగ్‌ (రక్షణ), అమిత్‌ షా (హోం), నిర్మలా సీతారామన్‌ (ఆర్థిక), జైశంకర్‌లకే (విదేశీ వ్యవహారాలు) అప్పగించింది.

ప్రధాని నేతృత్వంలో భద్రతపై ఏర్పాటయ్యే క్యాబినెట్‌ కమిటీలో ఈ శాఖలు ఉండటమే దీనికి కారణం అని తెలుస్తున్నది. వీరితోపాటు ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ప్రధాని సిఫార్సు మేరకు సోమవారం సాయంత్రం రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇక తెలుగు రాష్ట్రాలకు ఏమిటంటే?

ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన జి.కిషన్‌రెడ్డికి బొగ్గు, గనులశాఖ, రామ్మోహన్‌ నాయుడికి పౌర విమానయాన శాఖ దక్కాయి. సహాయ మంత్రులుగా నియమితులైన తెలుగు వారిలో బండి సంజయ్‌కు హోంశాఖ, పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్లు, శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమలశాఖలను ప్రధాని నరేద్ర మోదీ కేటాయించారు.

కొత్తగా బాధ్యతలు చేపట్టిన 30 మంది క్యాబినెట్‌ మంత్రుల్లో 19 మంది గతంలో పనిచేసిన వారే. అందులో 12 మందికి పాతశాఖలే దక్కాయి. వీరిలో రాజ్‌నాథ్‌ సింగ్, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్, జైశంకర్, పీయూష్‌ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, సర్బానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, అశ్వినీ వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, హర్దీప్‌ సింగ్‌ పురీ ఉన్నారు.

అశ్వినీ వైష్ణవ్‌కు ఇదివరకు ఉన్న శాఖలకు తోడు కొత్తగా సమాచార, ప్రసారశాఖలను అప్పగించారు.
హర్దీప్‌ సింగ్‌ పురీ నుంచి పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖలను తొలగించారు.
ఏడుగురు మంత్రులకు శాఖలు మారాయి. వారిలో ప్రహ్లాద్‌ జోషి, గిరిరాజ్‌ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, గజేంద్రసింగ్‌ శెఖావత్, కిషన్‌రెడ్డి, మన్‌సుఖ్‌ మాండవీయ, కిరణ్‌ రిజిజు ఉన్నారు.

కేంద్ర క్యాబినెట్‌లోకి కొత్తగా వచ్చిన భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆయన గతంలో నిర్వర్తించిన వైద్య, ఆరోగ్యశాఖే కేటాయించారు.

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు కీలకమైన వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖలను అప్పగించారు. గతంలో ఈ శాఖలను అదే రాష్ట్రానికి చెందిన నరేంద్ర సింగ్‌ తోమర్‌ నిర్వర్తించారు.

హరియాణా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు కీలకమైన విద్యుత్తు, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖలను కట్టబెట్టారు. ఇదివరకు ఈ శాఖలు ఆర్‌కే సింగ్, హర్దీప్‌ సింగ్‌ పురీ దగ్గర ఉండేవి.

జల్‌ శక్తిశాఖను గుజరాత్‌కు చెందిన సీఆర్‌ పాటిల్‌కు అప్పగించి ఇప్పటివరకూ ఆ బాధ్యతలను నిర్వర్తించిన గజేంద్ర సింగ్‌ శెఖావత్‌కు పర్యాటకం, సాంస్కృతికశాఖలను అప్పగించారు.

మాజీ ముఖ్యమంత్రులు హెచ్‌డీ కుమారస్వామికి ఉక్కు, భారీ పరిశ్రమలు, జీతన్‌రాం మాంఝీకి సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను అప్పగించారు. సాధారణంగా మిత్రపక్షాలకు అప్పగించే ఈ శాఖలను ఇప్పుడూ అలాగే కేటాయించారు.
జేడీయూ ఎంపీ రాజీవ్‌ రంజన్‌ సింగ్‌కు పంచాయతీరాజ్, పాడి, పశు సంవర్ధకశాఖలను ఇచ్చారు. ఇదివరకు ఈ బాధ్యతలను గుజరాత్‌కు చెందిన పురుషోత్తం రూపాలా నిర్వర్తించారు.

స్మృతి ఇరానీ ఓడిపోవడంతో ఆ స్థానంలో ఇదివరకు విద్యాశాఖ సహాయ మంత్రిగా పని చేసిన అన్నపూర్ణా దేవిని క్యాబినెట్‌లోకి తీసుకుని మహిళా, శిశు సంక్షేమ బాధ్యతలను అప్పగించారు.
చిరాగ్‌ పాస్వాన్‌కు ఇదివరకు ఆయన చిన్నాన్న పశుపతి కుమార్‌ పారస్‌ నిర్వహించిన ఆహారశుద్ధి పరిశ్రమలశాఖనే కేటాయించారు.

కీల శాఖలు బీజేపీకే ఎందుకంటే

ముఖ్యమైన శాఖలను భాజపా తనవద్దే ఉంచుకుంది. ప్రభుత్వం చేపట్టిన పథకాల అమలులో ఇబ్బందులు ఎదురు కాకుండా, వాటిని వేగంగా కొనసాగించేందుకు వీలుగా సీనియర్‌ మంత్రుల శాఖల్లో పెద్దగా మార్పులు చేయలేదు. స్వతంత్ర హోదాలో సహాయ మంత్రులుగా బాధ్యతలను నిర్వహిస్తున్న ముగ్గురు పాత మంత్రుల శాఖలనూ యథాతథంగా కొనసాగించారు. పాత ప్రభుత్వమే కొనసాగుతోందన్న భావన కల్పించేలా మంత్రిత్వశాఖలను కేటాయించారు.

కిషన్‌రెడ్డికి ప్రమోషన్‌ – బొగ్గు, గనుల శాఖ కేటయింపు

తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డిని పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిశాఖల నుంచి తప్పించి కీలకమైన బొగ్గు, గనులశాఖను అప్పగించారు.
బండి సంజయ్‌కు హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. ఇదివరకు కిషన్‌రెడ్డి కేబినెట్‌ మంత్రిగా పదోన్నతి పొందడానికి ముందు హోంశాఖ సహాయమంత్రిగా పని చేశారు. కరీంనగర్‌ నుంచి భాజపా తరఫున గెలిచిన విద్యాసాగర్‌రావు కూడా హోంశాఖ సహాయ మంత్రిగా సేవలందించడం విశేషం.

ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్మోహన్‌నాయుడికి పౌర విమానయానశాఖ దక్కింది. 2014 నుంచి 18 వరకు ఇదే శాఖను అశోక్‌ గజపతిరాజు నిర్వహించారు.
సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్లశాఖలను అప్పగించారు.

నర్సాపురం భాజపా ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు ఉక్కు, భారీ పరిశ్రమలశాఖలను కేటాయించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కాపాడాల్సిన బాధ్యతలను ఆయన చూడాల్సి ఉంటుంది.

ఏపీలో కూటమి కేంద్రంలో ఎన్డీయే దే అధికారం: ఎగ్జిట్ పోల్స్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *